నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ (1630–1680) భారతదేశ చరిత్రలో ధైర్యవంతుడైన రాజు, సమర్థవంతమైన పాలకుడు అని పేర్కొన్నారు.
స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా చేసుకుని, మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన వీరుడని అన్నారు. శివాజీ మహారాజ్ కోట్లాది మంది భారతీయులకు ఆదర్శప్రాయుడని తెలిపారు. ఆయన అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయం అన్నారు. శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
ప్రజల సంక్షేమం, న్యాయం, ధర్మం ఇవే ఆయన పాలనకు మూల సూత్రాలని తెలిపారు. రైతులు, సామాన్య ప్రజల హక్కులను కాపాడిన రాజుగా ఆయనకు గొప్ప గౌరవం ఉందని చెప్పారు. శత్రువుల పట్ల కూడా మానవత్వం చూపిన ఉదాత్తమైన నాయకుడిగా శివాజీ మహారాజ్‌ను కొనియాడారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19 లోపు ఇక్కడ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



