నవతెలంగాణ – హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో 33/11 కేవి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నానని అంటున్నారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా మునుగోడు ప్రజల కోసం ఇక్కడ నుండే పోటీ చేశానని చెప్పారు. పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించే వాడికి పదవి కావాలి కానీ.. నాలాంటి వారికి ప్రజలే ముఖ్యమన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని.. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలోనూ అలాంటి హామీనే ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. పదవి ఇస్తారా.. ఇవ్వరా అనేది మీ ఇష్టం.. సీనియర్ నేతనే కాబట్టి మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదంటూ మనసులో ఉన్నది ఓపెన్ గా చెప్పారు. మునుగోడు ప్రజల సంక్షేమం కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనంటూ ఆయన కామెంట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది.