– బీజేపీ పరకాల నియోజకవర్గ ఇంచార్జ్ పగడాల కాళీప్రసాద్ డిమాండ్
నవతెలంగాణ – పరకాల
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న జర్నలిస్టుల పట్ల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటని బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ పగడాల కాళీప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. శనివారం పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాళీప్రసాద్ మాట్లాడుతూ.. సమాజంలో నాలుగో స్తంభంగా ఉంటూ, అనేక సాధక బాధకాల మధ్య విధులు నిర్వర్తిస్తూ వార్తలు సేకరించే జర్నలిస్టులను కించపరచడం సరికాదన్నారు.
ప్రజాప్రతినిధిగా ఉండి జర్నలిస్టుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసిన ఎమ్మెల్యే వెంటనే వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడటం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని హితవు పలికారు. ఎమ్మెల్యే తన నిరంకుశ ధోరణిని వీడి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



