– సంఘీభావం ప్రకటించిన ప్రజా పంథా,ఆంధ్రా సీపీఐ నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రెవిన్యూ, పోలీస్ శాఖల దుర్మార్గపు చర్యతో నిరాశ్రయులైన పేద ప్రజలకు న్యాయం చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 200 మంది పేద ప్రజలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకొని దాదాపు ఆరు సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. వారి ఇళ్లను ఆదివారం అర్ధరాత్రి ఎటువంటి సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా రెవెన్యూ అధికారులు,పోలీసులు కూల్చి వేయడం జరిగింది. ఇల్లు కోల్పోయిన ప్రజలంతా నిరాశ్రయులయి రోడ్డు మీద పడ్డారు. వారికి న్యాయం చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన గురువారం నాటికి మూడో రోజు కు చేరింది. ఈ క్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ మునీర్,సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ లు దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఎలక్షన్ల సమయంలో ఓట్లు అడుక్కోవడానికి ఇంటింటికీ తిరిగిన ఎమ్మెల్యే నేడు ప్రజలు ఇంత దుర్భర అవస్థలో ఉన్నప్పుడు ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి నష్టపోయిన పేద ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన పేదలకు తగిన న్యాయం చేయకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరిస్తున్నారు.



