నవతెలంగాణ – మద్నూర్
సీపీఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మగ్దూమ్ భవన్ లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండి పేదల కష్టాల పట్ల, శ్రామిక వర్గాల పట్ల తన అంకితభావాన్ని చూపుతూ ప్రజా ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొన్నారు అని తెలిపారు.
నల్గొండ ప్రజల విశ్వాసం పొంది రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గౌరవప్రదమైన సేవలందించారు. ఎల్లప్పుడూ సామాజిక న్యాయం, రైతు కూలీల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన గొంతు వినిపించారు. ఆయన ఆలోచనలు, విలువలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోవడం తెలుగు వాళ్లకే కాకుండా, భారతదేశ ప్రజాస్వామ్య ఉద్యమానికి తీరని లోటని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలు, విలువలు మార్క్సిస్టు ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES