హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే..
హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ వృద్ధి అతలాకుతలం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ-మియాపూర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో వాళ్లు కేసీఆర్ ద్వారా గెలిచారు తప్పా వారి సొంతంగా గెలిచింది ఏమీ లేదని తెలిపారు. శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మియాపూర్ డివిజన్‌లోని నరేన్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్‌మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తోందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని అన్నారు. తమ హయాంలో హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయితీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని గుర్తు చేశారు. అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారని అన్నారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో రూ.2 లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, సీఎం రేవంత్‌రెడ్డి 20 నెలల్లోనే రూ.2 లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆస్పత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జీ కానీ, మోరీ కానీ కట్టిండా అని ప్రశ్నించారు. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసి వచ్చే కార్పొరేషన్‌తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శంబిపూర్ రాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, కార్పొరేటర్లు రోజా రంగారావు, సింధు ఆదర్శ్‌రెడ్డి, జూపల్లి సత్యనారాయణ రావు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా, సీనియర్ నాయకులు రంగారావు, వివిధ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ గెలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES