దళిత వ్యక్తిని కొట్టిచంపిన గ్రామస్తులు
రాయ్ బరేలి : ఉత్తరప్రదేశ్ యోగి అదిత్యనాథ్ పాలనలో మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని రాయ్ బరేలి జిల్లాలో 40 ఏండ్ల దళిత వ్యక్తిని కొంత మంది గ్రామస్తులు దారుణంగా కొట్టి చంపారు. దొంగగా అనుమానిస్తూ గ్రామస్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దళిత వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని ఉంచహర్ అనే నగర పంచాయితీలో ఈ నెల 1 రాత్రి జరిగిన ఈ మూక దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో దళిత వ్యక్తిని గ్రామస్తులు తీవ్రంగా కొడుతున్న దృశ్యం స్పష్టంగా ఉంది. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో మృతి చెందిన దళిత వ్యక్తిని హరిఓం వాల్మీకిగా గుర్తించారు. ఈ ఘటన గురించి జిల్లా ఎఎస్‌పి సంజీవ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ఈ నెల 2 ఉదయం ఉంచహర్‌లోని రైల్వే ట్రాక్‌కు సమీపంలో ముందుగా వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు.
తదుపరి విచారణలో ఇదే ప్రాంతంలో ఒక వ్యక్తిని దొంగగా అనుమానించి కొంతమంది కొట్టిచంపినట్లు వెల్లడయిందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఇప్పటి వరకూ ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి తనిఖీలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అలాగే, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ముగ్గురు పోలీసుల్ని రాష్ట్ర డీజీపీ సస్పెండ్ చేశారు. ఈ మూకహత్యను రాయ్ బరేలి ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మూకదాడిని దేశ రాజ్యాంగం, దళితులపై జరిగిన నేరంగా విమర్శించారు. మన దేశం, సమాజంపై ఒక మచ్చగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో దళితులు, గిరిజనులు, ముస్లింలు, బీసీలు, పేదలు లక్ష్యంగా మారారని, విద్వేషం, హింస, మూకదాడులు అధికారాన్ని అనుభవిస్తున్నాయని విమర్శించారు. హరిఓం వాల్మీకి కుటుంబాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పరామర్శించారు.
రాయ్ బరేలిలో మూక హత్య
- Advertisement -
- Advertisement -