– దగ్గరుండి పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ – కామారెడ్డి : ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువులో బుధవారం ముందస్తు వరద సహాయక చర్యలపై సమగ్ర మాక్ డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పర్యవేక్షించారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సమన్వయంతో, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్‌లో వరద పరిస్థితుల్లో రక్షణ చర్యలు, శాఖల మధ్య సమన్వయం, స్పందన సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించే విధానాలను రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్ల సహాయంతో ప్రదర్శించారు.
మొత్తం 12 శాఖలు – అగ్నిమాపక, పోలీస్, వైద్య, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నాయి. మొత్తం 187 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ విపత్తు సమయంలో శాఖల మధ్య సమన్వయం, తక్షణ స్పందన, ప్రజల అవగాహన అత్యంత కీలకమని తెలిపారు. మాక్ డ్రిల్‌ల ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెంపొందించడం అవసరమని, విపత్తు సంభవించినప్పుడు భయపడకుండా సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించవచ్చని అన్నారు.
మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు ప్రమాద సమయంలో సురక్షిత ప్రాంతాలకు తరలే విధానం, వరదలు, తుఫానుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిక్కుకుపోయిన వారిని రక్షించే పద్ధతులు, అత్యవసర సేవలను సంప్రదించే విధానం, గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించే విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలు, ఆస్తులను రక్షించుకోవాలని సూచించారు. ఇటువంటి మాక్ డ్రిల్లు ప్రజలకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించి, విపత్తుల సమయంలో సమర్థంగా స్పందించే సామర్థ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డిప్యూటీ కమాండర్ డోల్ సింగ్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం, జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ హిమబిందు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



