ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సదానందంగౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ట్రెజరీల ద్వారా వేతనాలను చెల్లించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సదానందంగౌడ్ మాట్లాడుతూ మోడల్ స్కూల్స్ ఆవిర్భావం నుంచి ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇటీవల బదిలీలు మినహా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పారు. సకాలంలో వేతనాలు సైతం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అమలు చేసిన మాదిరిగా 010 హెడ్ కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులు, మెడికల్ రీయింబర్స్ మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు. మరణించిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులకు పదోన్నతులను కల్పించాలని అన్నారు. 2019లో ఎస్టీయూటీఎస్‌కు అనుబంధంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, మోడల్ స్కూల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ విఠల్, బత్తిని సత్యనారాయణ గౌడ్, జిల్లా, రాష్ట్ర బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ టీచర్లకు ట్రెజరీ ద్వారా వేతనాలివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



