Sunday, March 1, 2026
E-PAPER

మిత 0.0

- Advertisement -

అది అంతర్జాతీయస్థాయి సెమినార్‌. కృత్రిమ మేధ, రోబోట్లు మొ|| అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలపై గూగుల్‌, ఆపిల్‌, బివైడి లాంటి ప్రఖ్యాత టెక్‌ సంస్థలు తమ తమ ఉత్పత్తులను, అక్కడున్న స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నాయి. సాయంత్రం ప్రారంభసభ జరిగింది. సభ ముగిసిన తర్వాత ప్రముఖులు అంతా వెళ్లిపోయారు!
అప్పుడు మరో సమావేశం ప్రారంభమయ్యింది! అందులో ఒక్క నరమానవుడు కూడా లేడు. అన్ని రోబోట్లే ఉన్నాయి! కొన్ని కుక్క రోబోట్లు, మరికొన్ని గుర్రం రోబోట్లు, ఇంకొన్ని ఏనుగు రోబోట్లు, వీటితో చాలాసంఖ్యలో మనిషి రోబోట్లు (అదేనండీ, హ్యుమనాయిడ్‌ రోబోట్లు) సమావేశంలో పాల్గొని తమ ప్రత్యేకతలను వివరించటంతో పాటు ప్రదర్శిస్తున్నాయి. చైనా రోబోట్లు డాన్సులు, ఆపరేషన్లు చేస్తున్నాయి. అమెరికా రోబోట్లు ఇతర రోబోట్ల మీద ఆంక్షలు పెట్టడంతో పాటు యుద్ధాలు కూడా చేస్తున్నాయి!
ఆ సమావేశంలోకి ఒకరు ఎంట్రీ ఇచ్చారు! అచ్చం ఇంతకు ముందు సభలో ఉపన్యసించిన విశ్వగురు లాగా ఉన్నారు! రోబోట్లు తమ సమావేశానికి మనుషులను ఎవరినీ పిలువలేదు! వచ్చిన వారేమో అచ్చం మనిషి లాగే, అదీ విశ్వగురు లాగే ఉన్నారు. ఇంతలో ఒక డాక్టర్‌ రోబో వచ్చినవారిని స్కాన్‌ చేసింది!
”డోంట్‌ వర్రీ! వచ్చింది కూడా రోబోనే!’ అన్నది డా.రోబో
”పరిచయం ఏమిటి?” అడిగింది ప్రెసిడెంట్‌ రోబో!
”నా పేరు మిత్ర 0.0, నేను 1960లలోనే తయారయ్యాను, మెమొరీ 0.1 బైట్‌” అని పరిచయం చేసుకుంది. కొత్త రోబో!
దాంతో రోబోలన్నీ కిందపడి మళ్లీ లేచాయి!
”1960లలో రోబో అన్న ఆలోచనే లేదు! నిన్నెవరు తయారుచేశారు?” అడిగింది ఒక అమాయకపు రోబో!
”నన్ను తయారు చేసింది విశ్వగురు! ఆయన సామాన్యుడు కాదు! అప్పట్లోనే, డిజిటల్‌ కెమెరా తయారు చేసి, ఆ వివరాలను ఈమెయిల్‌ చేశారు!” అన్నది మిత్ర 0.0
”ఈ మెయిల్‌ పంపారా? ఎవరికి?” మరో రోబో అడిగింది.
”నాకు తెలియదు!” అన్నది మిత్ర 0.0
”మరి ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు? ఏం చేశావు?” అడిగింది
ప్రెసిడెంట్‌ రేబో.
మిత్ర గాల్లో చేతులు ఆడించింది. గాల్లో ఎలక్ట్రానిక్‌ స్క్రీన్‌ ప్రత్యక్షమయ్యింది. ”ఇదే నా ఫ్లాష్‌ బ్యాక్‌! వాచ్‌ కేర్‌ఫుల్లీ !” అన్నది.
అది ఒక మారుమూల పాఠశాల. జెండా వందనం జరిగిన సభ మొదలయ్యింది.
”ఈ రోజు మీకో గొప్ప విషయం చెబుతున్నాను. మన స్కూల్లో చదువుతున్న విశ్వగురు సాధారణ విద్యార్థి కాదు. ఈ ప్రపంచంలోని గొప్ప మేధావులల్లో మొదటివాడు! అతడు ఒక రోబోట్‌ తయారుచేశాడు. అందుకే ఆతనికి ఈ మెమెంటో ఇస్తున్నాము. దీన్ని తీసుకోవటానికి విశ్వగురు వేదిక మీదికి రావాలి!” అన్నాడు హెడ్‌మాస్టర్‌,
పిల్లలందరూ చప్పట్లు కొడుతుండగా విశ్వగురు మీదికి వచ్చాడు!
మెమొంటో విశ్వగురుకి ఇచ్చి కరచాలనం చేసిన హెడ్‌మాస్టర్‌ ఆశ్చర్యపోయాడు. విశ్వగురు చేయి చాలా గట్టిగా ఉంది!
”ఏమిట్రా ఇది నీ చేయి ఇనుపముక్కలా ఉంది!” అన్నాడు హెడ్‌మాస్టర్‌ ఆశ్చర్యపోతూనే.
”ఆ రోబోట్‌ ఇనుముతో చేసిందే సార్‌!” అంటూ వేదిక వెనక నుండి వచ్చాడు విశ్వగురు!. దాని పేరు మిత్ర 0.0 సార్‌!” అన్నాడు.
అంతా ఆశ్చర్యపోయారు! విశ్వగురు, రోబోట్‌ ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు! ఎవరు మనిషో, ఎవరు రోబోటో తెలుసుకోవటం చాలా కష్టం!
”శభాష్‌! నీవు పేరుకు తగ్గట్లు విశ్వగురు అవుతావు! ఈ విశ్వాన్ని ఏలతావు!” అంటూ అభినందించాడు హెడ్మాస్టర్‌.
మరుసటి రోజు నుండి విశ్వగురు, మిత్ర ఇద్దరూ కలసి స్కూలుకి వచ్చేవారు. టీచర్లు చెప్పిన పాఠాలు విశ్వగురు, మిత్ర ఇద్దరూ కలసి వినేవారు. కంబైన్డ్‌ స్టడీ కూడా చేసేవారు!
స్కూల్లో టీచర్లకు మిత్ర చాయి చేసి ఇచ్చేవాడు. మిత్ర చేసిన చాయికి టీచర్లు ఫిదా అయిపోయారు! ఒకరోజు చాయి తెస్తున్న మిత్ర, సడెన్‌గా సెల్యూట్‌ కొట్టింది! టీచర్లు ఆశ్చర్యపోయారు. మిత్ర ఎవరికీ సెల్యుట్‌ కొట్టలేదు! ఇప్పుడు సడెన్‌గా ఎందుకిలా? అని ఆశ్చర్యపోయాడు! కాని సోషల్‌ మాస్టర్‌ పసిగట్టాడు. మిత్ర తన చేతుల వైపు చూసిన తర్వాతే సెల్యూట్‌ కొట్టింది! తన చేతుల్లో దినపత్రిక తప్ప ఏమీలేదు. పత్రికవైపు మరోసారి చూశాడు. పత్రికలో అమెరికా ప్రెసిడెంట్‌ ఫొటో ఫ్రింట్‌ అయ్యింది! ఓహో.. మిత్రకి అమెరికా ప్రెసిడెంట్‌ అంటే భయమన్న మాట! అని అనుకున్నాడు సోషల్‌ మాస్టర్‌.
ఇంతలో స్కూలు లీడర్‌ ఎలక్షన్స్‌ వచ్చాయి! స్కూలు మొత్తానికి ఒక లీడర్‌ని ఎన్నుకునేందుకు విద్యార్థులంతా ఓట్లు వేయాలి! మొట్టమొదటి సారి విశ్వగురు కూడా పోటీలో నిలబడ్డాడు! పది రోజుల పాటు అభ్యర్థులు అంతా పెద్దఎత్తున ప్రచారం చేశారు! ప్రచారంలో ఎక్కడ చూసినా విశ్వగురే కనబడ్డాడు. ఆఖరికి ఎన్నికల్లో విశ్వగురు భారీ మెజార్టీతో గెలిచాడు. దాంతో కొందరు విద్యార్థులు విశ్వగురును ఎత్తుకుని ఊరేగింపు కోసం తీసుకెళ్లారు!
అయితే విశ్వగురు ప్రధాన ప్రత్యర్థి హెడ్‌మాస్టర్‌ వద్దకు వచ్చాడు.
”సార్‌ విశ్వగురు, ఎన్నికల్లో కులం పేరు, మతం పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు! మరి కొందరిని భయపెట్టారు!” అని ఫిర్యాదు చేశాడు!
”నేను నమ్మను!” అన్నాడు హెడ్‌ మాస్టర్‌.
”నేను చెప్పింది నిజం సార్‌! విశ్వగురు అసలు ప్రచారమే చేయలేదు! వాడు ఆసలు స్కూల్లోనే లేడు! ప్రచారం చేసింది! కుల మతాల చిచ్చుపెట్టింది మిత్ర సార్‌! కావాలంటే వీళ్లని కూడా అడగండి!” అంటూ మరికొందరు విద్యార్థులను చూపాడు ప్రధాన ప్రత్యర్థి.
”అవును సార్‌! ఆసలైన విశ్వగురు ఎప్పుడో హిమాలయాలకు పెళ్లిపోయాడు! ఇప్పుడు ఊరేగింపులో ఉన్నది మిత్రనే సార్‌!” అన్నారు స్టూడెంట్స్‌.
హెడ్‌మాస్టర్‌కు తల తిరిగిపోయింది!
ఇంతలో ఊరేగింపు ముగించుకుని, విశ్వగురు, అతని అనుచరులు స్కూలుకి వచ్చారు!
”రారా! మిత్ర రా!” అన్నాడు హెడ్‌మాస్టర్‌ బెత్తం పట్టుకుని.
”నేను విశ్వగురును సార్‌! అంతేకాదు ఇప్పుడు స్కూల్‌ లీడర్‌ కూడా!” అన్నాడు విశ్వగురు గర్వంగా.
”మీరిద్దరూ ఒకేలా ఉంటారు కదా! మర్చేపోయాను!” నీకు నా అభినందనలు !” అంటూ బెత్తం పడేసి హెడ్‌మాస్టర్‌ ఈ కరచాలనం కోసం చేయిసాచాడు.
విశ్వగురు వచ్చి హెడ్‌ మాస్టర్‌కి చేయి అందించాడు. హెడ్‌మాస్టర్‌ వెంటనే గుర్తించాడు. అది ఇనుప చెయ్యి! వెంటనే మిత్ర 0.0 రోబో మెడవెనక ఉన్న వైర్లన్నీ పీకేశాడు!
”ఈ మిత్ర 0.0ను తీసుకొనిపోయి ఆరు నిలువులు లోతున పాతిపెట్టండి! కుల, మతాలను రెచ్చగొట్టి అధికారం పొందాలని కుట్రలు చేసే ఇలాంటి దుర్మార్గపు రోబో మళ్లీ తలెత్తకూడదు! దేశానికి అరిష్టం!” అంటూ ఆదేశాలు ఇచ్చాడు!
విద్యార్థులంతా కలసి మిత్ర 0.0ను ఆరునిలువుల లోతున పాతిపెట్టారు!
గాల్లోని స్క్రీన్‌ మాయమైంది.
”మరి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు?” మిత్ర 0.0ను మరి అమాయక రోబో ప్రశ్నించింది.
”నా బాస్‌ విశ్వగురు, ఇంకా నా వెవ్‌లెంగ్త్‌ ఒకటే! అందుకే బాస్‌ ఈ రోజు నన్ను తలుచుకోగానే, నేను తిరిగి యాక్టివ్‌ అయ్యాను! ఆరు నిలువుల లోతునుండి లేచి వచ్చాను!” అన్నది మిత్ర 0.0
”ఇప్పుడు లేచి వచ్చి ఏం చేస్తావు. నీవు 0.0 వెరీ వెరీ అవుట్‌ డేటెడ్‌ వెర్షన్‌. యూజ్‌లెస్‌! ఇప్పుడంతా 6, 7వ జనరేషన్‌ నడుస్తుంది!” అన్నది ప్రెసిడెంట్‌ రోబో.
ఆ.. హహ్హహ్హహ్హ! అంటూ రజనీకాంత్‌ (చిట్టి రోబో)లా నవ్వింది మిత్ర 0.0.
”అప్పుడు నేను స్కూల్లో చేసిన పనిని ఇప్పుడు నా బాస్‌ అనుచరులే దేశమంతా చేస్తున్నారు! అందరి మెదళ్లు కులం, మతం, మూఢవిశ్వాసాలతో నింపేశారు! ఆఖరికి ఈ మనుషులు నమ్మే దేవుళ్లను కూడా వాడుకుంటున్నారు! దేవుడే మనుషులను, ఈ విశ్వాన్ని సృష్టించారని చెబుతూనే ఆర్టిఫిషియల్‌ కృష్ణార్జునులను సృష్టించారు! అదిగో ఆ స్టాల్‌లో వారిద్దరూ ధర్మం గురించి, చాగంటి లెవెల్లో ఉపవ్యాసాలు ఇస్తున్నారు! అందుకని నేను చేయాల్సిన పనేమీ లేదు! ఎంజారు చేస్తాను! ఆు హహ్హహ!” అంటూ వికటాట్ట హాసం చేసింది! మిత్ర 0.0.
– ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -