‘మగవాళ్లు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా.. ఆడపిల్లలు మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి.. ఆడపిల్లలు నేర్చుకుంటే.. ఆ కళను తమ పిల్లలకు కూడా నేర్పిస్తారు.. దాంతో ఈ కళ అందరి నాలుకల మీద నాట్యమాడుతుంది. తరతరాలు బతికి ఉంటుంది’ అంటారు ప్రముఖ ఒగ్గు కళాకారిణి ఒగ్గు మల్లారి. ఈ మాటలు చాలు కళపట్ల ఆమెకున్న మమకారాన్ని తెలిపేందుకు. అలాంటి కళాకారిణి ఈ నెల 7వ తేదీన మరణించారు. ఈ సందర్భంగా ఆమె కళా జీవితం గురించి క్లుప్తంగా…
అమ్మల నుంచే ఏదైనా నేర్చుకుంటాం. అది ఆటైనా, పాటైనా అమ్మే ఆది గురువు. ఈ పురుషాధిక్య సమాజంలో ఓవైపు అమ్మలకు అంటుగట్టిన వర్గం మరోవైపు పోచమ్మ, మైసమ్మ, వీరనాగమ్మ అంటూ అమ్మలను కొలిచే మూలవాసుల వర్గం. అమ్మలే పూజల్లో ప్రధాన పాత్ర వహించి, పూజలు చేసి, శిగాలుగే(నాట్యమాడే) సంస్కృతి బహుజనుల్లో ఉంది. పురుషులకు సమానంగా నాగండ్లు పట్టి, గొర్లను కాసి, పని పాటల్లో ఆడమగ తేడా లేకుండా సాగిపోయిన గొప్పతత్వమున్న సామాజిక వర్గం నుంచి వచ్చి ఒగ్గుకళను ప్రదర్శించి ఆ పరంపరం కొనసాగించిన తల్లి జమ్మ మల్లారి.
పురుషులతో సమానంగా…
స్త్రీలను అబలలని, వంటింటి కుందేళ్ళుని.. వాళ్ళను,వాళ్ళ హక్కులను కాలరాసిన ఒక సమాజపు వైఖరి బహుజనుల్లో కూడా ఆవహించిన ఈ సందర్భంలో ఆడ పిల్లలకు ఆటపాటలెందుకని నిందించే కుసంస్కార లోకాన్ని ఎంతో ధైర్యంగా ఎదిరించారు. పురుషాధిక్య సమాజాన్ని, తన జాతిని, తననుతాను ఛేదించుకొని శివుని చేతిలో ఉన్న (డమరుకం) ఒగ్గును చేతబట్టి పురుషులతో సమానంగా ప్రదర్శనలు ఇచ్చిన సాహసి. తెలంగాణ ప్రాంతంలో ఒగ్గు కథది ప్రత్యేకమైన జీవం. ఈ కళలో చుక్కా సత్తయ్య, మిద్దె రాములు, బాల సిద్దులు వంటి వారు ప్రసిద్ధులు. ఆ కోవలోకే వస్తారు జమ్మ మల్లారి. ఓకే ఒక్క ఒగ్గు కళాకారిణి. చిందు బాగోతానికి ఎల్లమ్మ ఎట్లనో ఒగ్గుకథకు జమ్మ మల్లారి అటువంటివారు.
తండ్రి వారసత్వంగా…
జమ్మ మల్లారి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో జమ్మ గుండాలు, చెన్నమ్మ దంపతులకు గొర్లు కాసుకునే కురుమ కుటుంబంలో ఆరుగురు కుమార్తెలు ముగ్గురు కొడుకుల తోడ జన్మించారు. తండ్రి గుండాలు ఒగ్గు బీర్ల కళాకారుడు. ఊరూరు తిరుగుతూ మల్లన్న బీరన్నల పట్నాలు వేస్తూ, పండుగలు చేస్తూ, లగ్గాలు జరిపిస్తూ, ఒగ్గు కథలు చెప్పేవాడు. జమ్మ మల్లారి తండ్రితో పాటు వెళ్ళి అప్పుడప్పుడు డోలు కొడుతూ, తాళాలు వాయిస్తూ, పదంల పదం కలిపి కోరస్ ఇస్తూ ఉండేది. అలా ఒగ్గు కథ మీద ప్రేమ పెంచుకొని ఒగ్గు కథను నేర్చుకున్నారు. తండ్రి కూడా బిడ్డ ఆసక్తిని గమనించి కళను నేర్పించాడు.
ప్రత్యేక గుర్తింపు
అట్లా ఒగ్గు కథను నేర్చుకున్న జమ్మ మల్లారి.. ఒగ్గు మల్లారిగా రూపాంతరం చెందారు. తన పదహారేండ్ల వయసులోనే తానే స్వయంగా ఒగ్గు కథను ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. పట్నాలు కూడా వేశారు. ఒగ్గు కళా రంగాల్లో తొలి ప్రదర్శన ఇచ్చిన స్త్రీగా నిలిచారు. పురుషులకు ధీటుగా ధోవతి కట్టుకొని, చొక్కా ధరించి, ఎర్ర రుమాలు నెత్తికి చుట్టీ, భుజాన గొంగడేసుకుని డోలు దరువులేస్తూ ఎంతో అద్భుతంగా మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ కథలు చెప్పేవారు. బీరప్ప కథలో కామరతి వేషం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. జమ్మ మల్లారి ఒగ్గు కథ వినడం కోసం రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చేవారు.
ఓ ధిక్కార స్వరం
తొలి చెమట బీరప్ప, మలి చెమట మల్లన్న ఒగ్గు కథలు గానం చేస్తూ వీరశైవతత్వ సాలును ఆమె కొనసాగించారు. తను నమ్మిన బాటలో ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జీవితాంతం గడిపారు. ఈ అసమ సమాజాన్ని పట్టించుకోకుండా ఒగ్గు కథను ఆరున్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా చెప్పిన ఆమె గొంతుక ఓ ధిక్కార స్వరం. తెలంగాణ జానపద చరిత్రలో ఆమెది ఓ చెరిగిపోని అధ్యాయం. ఒగ్గు కథలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 2020లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. హైదరాబాద్‌లో రవీంద్రభారతిలో ఉమెన్ అచీవర్ అవార్డు అందుకున్నారు. ఇటువంటి ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి.
ఆదర్శ జీవితం
తన జీవితమంతా ఒగ్గు కళకే అంకితం చేసిన ఏకైక కళాకారిణి జమ్మ మల్లారి. అలాంటి గొప్ప కళాకారిణి తన 80 ఏండ్ల వయసులో ఈ నెల 7వ తేదీన తన తుదిశ్వాస విడిచారు. నేటి మహిళలు వాళ్ళు నమ్మిన దాన్ని సాధించుకోవడంలో ఒగ్గు మల్లారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ బిడ్డ ఆశను, ఆశయాన్ని గమనించి తండ్రి ఎటువంటి అరమరికలు లేకుండా కూతురికి ఒగ్గు కథను నేర్పించి సహకరించిన గుండాలు తీరును ఈ సమాజంలోని తల్లితండ్రులందరికీ స్ఫూర్తిదాయకం. ఇలా పిల్లల ఇష్టాయిష్టాలను గుర్తించి సరైన దారిలో నడిపే వారు ఎన్ని విజయాలైనా సాధిస్తారు అనడానికి ఈ తండ్రీ కూతుళ్లు ఓ నిదర్శనం.
– చిక్కొండ్ర రవి, 9502378992



