Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeసోపతిఆధునిక మహాతత్వ గీతం

ఆధునిక మహాతత్వ గీతం

- Advertisement -

One good thing about music, when it hits you, you feel
no pain. It heals the soul and brings people together
– Bob Marley, Jamaica Singer.

ప్రపంచ ప్రసిద్ధ గాయకుడు బాబ్‌ మార్లే చెప్పినట్టు పాటకు ప్రాణముండాలి. అది మన పంచేంద్రియాలకు పచ్చిగా తాకాలి. పాటకు హృదయాలను కదిలించే బలం ఉండాలి. అది నిరాశ ఆవరించి ఎడారిలా మారిన మనిషి లోపల సెలయేళ్ళను పారించాలి. పాట మనిషి అంతరంగాన్ని పదునెక్కించాలి. చీకటితో మూసుకున్న మనో నేత్రాలను విప్పారించి వేల కాంతులు ప్రసరింపజేయాలి.

పాట నిన్నూ, నన్నూ, ప్రతి ఒక్కరిని కదిలించి, ఒక్కటిగా నడిపించాలి. అట్లా నడిపించే పాటే మహాతత్వ గీతం అవుతుంది. ఇప్పుడు అట్లా మహాతత్వ గీతమై తెలుగు నేలంతటా వినబడుతున్న పాట ”శిలా నీవే శిల్పి నీవే, శిల్పం నీవే సష్టిలో/ నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో” ఈ పాట రాసినది ప్రజాకవి జయరాజు. అద్భుతంగా పాడినది విజరు జేసుదాసు. మ్యూజిక్‌ అందించినది బల్లేపల్లి మోహన్‌. నిర్మాత బొమ్మక్‌ మురళి. ఈ పాట యూట్యూబ్‌లో ప్రధానంగా అయిదు ఛానల్స్‌లో అప్లోడ్‌ చేయబడి ప్రజలకు చేరువైంది. జయరాజు ఛానల్‌లో పదకొండు లక్షల ముప్పై నాలుగు వేలమంది చూడగా, బల్లేపల్లి మోహన్‌ ఛానల్‌లో పదిహేను లక్షల నలభై వేలమంది చూశారు. బివినాయక్‌ అఫిషియల్‌ ఛానల్‌లో ఆరు లక్షల యాభై వేల మంది, సాయి డ్రీమ్స్‌ ఇన్‌ రియాలిటి అనే ఛానల్‌లో మూడు లక్షల నలబై ఎనిమిది వేలమంది చూడగా, బొమ్మకు మీడియాలో అరవై వేలమంది చూశారు. ఇంకా కొన్నిటిలో కలిపి ఇలా మొత్తంగా నాలుగు మిలియన్ల మంది ఈ పాటకు యూట్యూబ్‌లో అభిమానులు ఉన్నట్టు రికార్డ్‌ అయింది. ఇది అంత సామాన్య విషయమేమి కాదు. ఎందుకంటే సోషల్‌ మీడియాలో ఎక్కువ వ్యూస్‌ రావాలంటే నాలుగు నిమిషాలకు మించిన నిడివి ఉండకూడదని సామాజిక మాధ్యమాల నిపుణులు చెప్పేమాట. కానీ ఇరవై మూడు నిముషాలు సుదీర్ఘంగా కొనసాగే ఈ తత్వగీతంకు ఆన్‌లైన్‌లో ఇన్ని వ్యూస్‌ రావడం, ఇంతమంది అభిమానులవడం ఒక బిగ్‌ రికార్డ్‌ అనే చెప్పాలి. అంతే కాదు వాగ్గేయకారుడిగా జయరాజు ఈ పాటను ప్రత్యేకంగా ఇరవైకి పైగా సభల్లో ఆలపించారు.


పాట కవులందరు రాసినట్టు నాలుగైదు చరణాలతోనో, ప్రజా వాగ్గేయకారులంతా కైగట్టినట్టు పది, పన్నెండు చరణాలకో పరిమితమైన పాట కాదు. ఒక పల్లవి, ఇరవై అయిదు చరణాలతో మానవ తత్వాన్ని సమాజ గమనాన్ని ఇరువాలు, మూడు చాల్లు దున్నిన పాట ఇది. విన్న ప్రతి వారిలో తాత్విక గింజలు నాటే పాట ఇది. వింటున్న కొద్ది ఒక చోట వ్యక్తిత్వ వికాసగీతంలా వినిపిస్తే, మరో చోట ప్రకృతి గీతంలా వినిపిస్తుంది. ఒక చరణంలో సామాన్య శాస్త్రంలా, ఇంకో చరణంలో సమాజ పరిణామాక్రమంలా తోస్తుంది. అట్లా అన్నీ కలిపి చూసినప్పుడు ఒక తత్త్వగీతమై మేల్కొల్పుతుంది. ఒకవైపు చెట్టు చేమ, పుట్ట మట్టి, కొండ కోన, కొమ్మ రెమ్మ ఇలా ఈ అవనిపై గల సకల జీవుల ఆంతర్యాన్ని విప్పి చెప్పాడు. మరోవైపు ఈ పుడమి అమ్మతనాన్ని, పాలుగారే చెట్టు తల్లి గుణం, ఆ తల్లుల ఆవేదనను, ప్రతీ మనిషి సంవేదనను, బతుకు అర్థాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ తాత్విక గానం చేశాడు. ఈ ఒక్క పాటలో మానవ జీవితంలోనీ అన్ని పార్శ్వాలను తడిమాడు. పంచేంద్రియాల పదునై, పచ్చని ప్రకృతి అదునై, కృష్ణ గోదావరి మధ్యనున్న పాటల పరివాహక ప్రాంతాల చదునై ఈ తత్త్వగీతాన్ని నిలబెట్టాడు. కోయిల రాగంలా, తుమ్మెదల నాదంలా, నెమలి నాట్యంలా, తేనె మధురిమలా ఈ పాటను ప్రజల మెదళ్ళలోకి ఎక్కించాడు ప్రజాకవి జయరాజు.

వివిధ మత గ్రంథాలు పుట్టుక గురించి ఏవో కట్టుకథలు బోధిస్తాయి. అతీత శక్తుల గురించి, దైవం, దెయ్యం గురించి పుక్కిటి పురాణాలు చెప్తూ నిరంతరం భయంలో, అజ్ఞానంలో ఉంచాయి. వాటి ప్రచారకులు ఈ భూమి మీద మానవుని పాత్ర నిమిత్త మాత్రమని మనుషుల కళ్ళకు మాయ పొరలు తొడుగుతూ వచ్చారు. పూర్వ జన్మ, పునర్‌ జన్మల మూఢత్వానికి మానవ మేధను బంధీని చేశారు. ఆ బోధనలకు భిన్నంగా ”పుడమిలో ఆణువణువు నీదే/ పరవశించుట నేర్చుకో/ జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో” అంటూ పునర్జన్మని నమ్మేవారి అనే పిచ్చి నమ్మకాలపై తన పల్లవిని జ్ఞానాయుధం చేసి ఎక్కుపెట్టాడు. సష్టిలో శిలా, శిల్పం, శిల్పి అన్నీ మనిషే. మనిషికి ముందు వెనుక ఏ అతీత శక్తి లేదు. కాబట్టి మానవుడు తన జీవితాన్ని అపురూప శిల్పంగా, స్మారక చిహ్నం (Monument) గా మలుచుకొని, ఓ మహోన్నత వ్యక్తిగా చరితలో నిలిచిపోమంటున్నాడు జయరాజు. నుదిటి నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారని ఋగ్వేదంలో రాసిన పురుషసూక్తంను ధ్వంసం చేసి, నిజాన్ని నిలబెట్టేందుకు అక్షర క్షిపణులను విసిరాడు ఈ ప్రజాకవి. ”ప్రకతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు, జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణా కాదు, జీవితంలోని ప్రతి కోణాన్నీ చూపించలేనిది సాహిత్యమే కాదు” అంటాడు ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. సరిగ్గా ఆయన మాటల సారాన్ని తత్వగీతంలో ఆవిష్కరించాడు జయరాజు.

”పాడిపంటలు పసిడిరాసులు ఆలమందలు పాలధారలు/ గరకపువ్వులు గడ్డిపాన్పులు తుమ్మెదలు తూనీగనవ్వులు/ ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో/ జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలెందుకో” అంటూ మన చుట్టూ ఉన్న అద్భుత సంపదలు, సకల జీవరాసులు, వింతలు, విశేషాలు, ఎంత చూసినా తనివి తీరని అందమైన ప్రకతి కళ్ల ముందున్నాయంటున్నాడు. ఆ విషయం మర్చిపోయి కొంతమంది స్వార్థపరులు సష్టించిన కత్రిమ సంపద కోసం పరుగులు పెడుతూ జీవితాన్ని ఆస్వాదించలేని యాంత్రికతను జయరాజు ప్రశ్నిస్తూ, మనల్ని కూడా ప్రశ్నించుకోమంటూ ప్రకతి గానాన్ని ఆలపిస్తున్నాడు. భూమి మీద కురిసే పండు వెన్నెలను, ఆకాశంలో నడిచే నిండు పున్నమిని, విశ్వంలో విరబూసిన సింగిడి వెలుగుల్ని దర్శించడం, ప్రకృతిలో లీనమవడమే మనిషి పుట్టుకకు దక్కిన భాగ్యమంటూ అమూల్యమైన తాత్వికత మూట విప్పి మనముందు కుప్పబోశాడు. లేని స్వర్గ నరకాల కోసం బతుకులో మతం మత్తు కాకుండా, జ్ఞానపు వత్తి వెలిగించుకోమంటున్నాడు. ప్రాకతికంగా జీవించడంలో ఉండే మధురిమను ఆస్వాదించమని హితబోధ చేస్తున్నాడు తత్వగీతాకారుడు జయరాజు .
”నీటిలో మన జన్మ ఉన్నది/ నిప్పులో చైతన్యమున్నది/ గాలిలో మకరందమున్నది/ భూమిపైనే జీవమున్నది” అంటూ విశ్వంలోని ఎన్నో గెలాక్సీల్లో ఉన్న ఒక కోట్లాది అగ్నిగోళాల్లో ఒకటైన సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమి అనే ఈ గ్రహంపైనే నీరు, గాలి ఉన్నదనే సైన్స్‌ను అత్యంత సరళంగా, అందరికి అర్థమయ్యే రీతిలో తన పాట ద్వారా విడమర్చి చెబుతున్నాడిక్కడ. నీటిలోని కణాలు, గాలిలోని తేమ వల్లనే జీవం ఏర్పడింది. నిప్పు వల్లే ఆ జీవులకు మెదడు వికసించి మానవజాతికి చైతన్యం కలిగిందనే డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతాన్ని ఒక్క చరణంలో వ్యక్తం చేశాడు. కొండంత సష్టి మర్మాన్ని ఇలా నాలుగు లైన్లలో విప్పి చెప్పే నేర్పుగల పాటగాడు, విజ్ఞానవేత్త జయరాజు.

”ప్రకతే మన పంచ ప్రాణం/ ప్రకతే మన కన్నతల్లి… ప్రకతి విధ్వంసమైతే/ ప్రాణ మాగేనో” అనే చరణం, అలాగే ”కొట్టినా నీ మేలు మరవని/ గట్టి గుణమీ చెట్టులో/ ఆకు తెంచితే పాలుకారే/ అమ్మతనమీ కొమ్మలో” అనే ఈ రెండు చరణాలలో ప్రకతే మన జీవనాధారమని, ప్రకతి సకల జీవకోటి పుట్టుకకు కేంద్రం కనుకనే ప్రకతిని కన్నతల్లి అంటున్నాడు కవి. ఈ ప్రకతిలో ఒక్క మనిషే కాకుండా ఎన్నో జీవరాశులున్నాయని, వాటన్నింటికి ప్రకతిపై సమాన హక్కు ఉందంటున్నాడు. ప్రకతిలో చెట్టును కొట్టినా, ఆకు తెంపినా పాలు కారుతుంది తప్ప పగపట్టదని, పైగా క్షమించే సుగుణముందనే ప్రకతి తత్వాన్ని ఓ ప్రకతి తాత్వికుడిగా మానవ మస్తిష్కాల్లోకి ఒంపుతున్నాడు జయరాజు. అదే సమయంలో కన్నతల్లి లాంటి కారడవుల (Deep forestను మైనింగ్‌ కోసం కార్పోరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దంటున్నాడు. అడవికి ఆదరువు అయిన ఆదివాసీలు సంతాల్‌, గోండు, కోయ, కొలామ్‌, చెంచు లాంటి ఆదిమ జాతులు అంతరిస్తాయని, కొండ కోన, కొమ్మ రెమ్మ, చెట్టు పుట్ట, మన్ను దన్నుతో పాటు అనేక జీవరాసులు అంతమవుతాయని గుండెపగులుతున్నాడు కవి. ప్రకతిని కాపాడి, పర్యావరణాన్ని రక్షించాలనే మానవ కర్తవ్యాన్ని ప్రకతి కవిగా గొంతెత్తి పాడుతున్న తెలంగాణ ఖలీల్‌ జిబ్రాన్‌ జయరాజు.

”తల్లిదండ్రులు భార్యపిల్లలు/ అన్నదమ్ములు అక్కచెల్లెలు/ కొడుకులు కోడళ్ళు వాళ్ల/ మనవలు మునిమనమరాళ్ళు/ పాతతరమే కొత్తతరముగా ప్రతిఫలిస్తుందో” అనే ఈ చరణంలో మానవ సమాజపు తరతరాల గమనాన్ని, పునరుత్పత్తి పరంపరల చరిత్రను వివరించాడు. ఇందులో అంతర్లీనంగా గొప్ప ప్రకతి సూత్రం ఇమిడి ఉంది. ఈ చరణం వింటున్నప్పుడు తత్వశాస్త్రంలో కారల్‌ మార్క్స్‌ చెప్పిన ‘నెగేషన్‌ ఆఫ్‌ ది నెగేషన్‌’ అనే గతితార్కిక సూత్ర సమాజ పరిణామగతి స్ఫురణలోకి వస్తుంది. ”గాయపడకుండా హదయం గేయమవుతుందా/ కలత పడకుండా మెదడు కావ్యమౌతుందా/ ఆటుపోటులు ఎదురుదెబ్బలు లేనిజీవితమున్నదా/ ఓర్పును చవి చూడకుండా మార్పుకు తావున్నదా” అనే చరణంలో కవి హదయం గాయ పడిన సంవేదనలోంచే గేయం పుట్టుకొస్తుందంటున్నాడు. ఎన్నో ఉలి దెబ్బలు తింటేనే శిల అద్భుతమైన శిల్పంగా రూపొందుతుంది. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా మనిషి ధైర్యం సడలకుండా ముందుకు సాగాలని ఆత్మ విశ్వాసం నింపుతున్నాడు. యువతకు వ్యక్తిత్వ వికాస స్ఫూర్తిని పెంపోందిస్తున్నాడు కవి. పుట్టుకకు లక్ష్యం ఉండాలని, దానికోసం నిరంతర సాధన చేయాలని, బతుకు అర్ధం తెలుసుకోవాలని యువజనానికి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు కవి జయరాజ్‌.

”దేవుడిని చేసింది నీవు/ దైవముగ కొలిచింది నీవు/ మతములను సష్టించి/ జనుల మతులను మార్చింది నీవు/ మానవత్వమే మనిషికీ మతము కావాలో/ మనుషులంతా ఒక్కటేనని హితము పలకాలో” అనే చరణంలో మనిషి పుట్టిన తర్వాతే దేవుడు పుట్టాడని తేటతెల్లం చేశాడు. ఇంకా చెప్పాలంటే దేవుడిని మనిషి పుట్టించాడే తప్ప దేవుడు మనిషిని దేవుడు సష్టించలేదని కుండబద్దలు కొట్టినట్టు కైగట్టాడు. అజ్ఞానంలో నుండి పుట్టిన దేవుడు, మతం అనే భావనలను క్రమంగా దోపిడికి, వ్యాపారానికి, రాజకీయాలకు ఆలవాలంగా చేసుకుని జనాలను మందబుద్ధులను చేస్తూ, మనుషులను అంతం చేస్తున్నారని జయరాజు ఈ పాటలో ఆవేదన చెందుతున్నాడు.

మానవులంతా ఒక్కటేనని, మానవత్వమే మనిషికి హితమని చాటి చెబుతున్నాడు. ”ధనము ఒక్కటే చాలదు/ నీ గుణమును సరి చేసుకో” మని హితవు పలుకుతున్నాడు. మనిషి ఆస్తిపాస్తుల అగాథంలో పడి, స్వార్ధపు అనారోగ్యంలో కొట్టుమిట్టాడుతూ, గొప్పలు చూపించుకుంటూ గప్పాలు కొడుతూ, స్నేహాన్ని, సహాయం చేసే గుణాన్ని, స్పందించేతనాన్ని కోల్పోతున్నాడని జయరాజు ఆందోళన పడుతున్నాడు. ”పాడిపంటలు కల దేశం/ పస్తులతో అల్లాడు తరుణం/ పేదలే నిరుపేదలై/ ధనవంతులే ధనవంతులై/ ఆకలితో జనమొక్కటైతే ఆగమేనోరు/ అంతరాలు లేని లోకమే శాంతివనమోయీ” సంపద వికేంద్రీకరణకి బదులుగా వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే వారి వద్ద మాత్రమే కేంద్రీకతం కావడం వలన ఆకలి మంటలు పెరిగి, అగ్రహాంతో తిరగబడే జనాగ్రహాగ్నిలో అంతరాల లోకం దగ్ధమై, ఓ బుద్ధుడు, మార్క్స్‌లు కలగన్న సమసమాజమనే శాంతిలోకం ఏర్పడటం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ తత్వగీతాన్ని ముగించాడు జయరాజు. ఇది నిజంగా ఈ కాలపు మహాతత్వగీతం. అందరూ వినాల్సిన, ప్రతీ ఒక్కరి ఇంట్లో వినబడాల్సిన పాట. అందరం తప్పక విందాం. జయహో ప్రజాకవి, జయహో తత్వకవి జయరాజు.
– ఏ. విజయ్ కుమార్‌, 9573715656

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad