– విద్యుత్ సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించండి
– ఐఎస్‌ఓ 9000 సర్టిఫికెట్ పొందడం అభినందనీయం : టీజీఎస్పీడీసీఎల్ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంగళవారంనాడిక్కడి ప్రజాభవన్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా ఎక్కడైనా ట్రిప్ అయితే వెంటనే ఆ సమాచారం కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చేలా ఫీడర్ ఔటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఎఫ్‌ఓఎమ్‌ఎస్)ను త్వరగా అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. డిస్కం పరిధిలోని 6,500 ఫీడర్లలో, 5,500 ఫీడర్లలో ఎఫ్‌ఓఎమ్‌ఎస్‌ను అమల్లోకి తెచ్చామనీ, మిగిలిన ఫీడర్లలోనూ ఈ టెక్నాలజీని త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్, వినియోగదారులకు మెరుగైన సేవలు, కార్యాలయంలో ఫైళ్ల పరిష్కారం వేగవంతంగా జరగడం వంటి పలు అంశాల ప్రాతిపదికగా డిస్కంకు ఐఎస్‌ఓ 9000 సర్టిఫికెట్ రావడం పట్ల అయన సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ సిబ్బంది కోసం ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను పరిశీలించాలని చెప్పారు. 108 అంబులెన్స్ తరహాలో విద్యుత్ శాఖలో 1912 నంబర్‌కు ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రత్యేక వాహనంతో సమస్యలు ఉన్నచోట క్షణాల్లో పరిష్కారాలు చేపడుతున్నారని తెలిపారు. విద్యుత్‌శాఖ అందిస్తున్న సేవలపై వినియోగదారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఇంథనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్, టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ ముషారఫ్ ఫరూఖీ తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES