మేం మాటల మనుషులం కాదు.. చేతల మనుషులం : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
యుద్ధం వేళ కీలక కామెంట్స్
న్యూఢిల్లీ : భారత ప్రధాని మోడీ, తాను మాటల మనుషులంకాదని, చేతల మనుషులమని అమెరికా అధ్య క్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాట చాలా మంది ఇతర దేశాల అధినేతలకు వర్తించదని అన్నారు. భారత్‌తో బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
పశ్చిమాసియా ఉద్రికతలు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోన్న తరుణంలో అమెరికా నుంచి ఈ స్పందన వచ్చింది. ఇదిలావుంటే రెండురోజుల క్రితం కూడా ప్రధాని మోడీ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం విదితమే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతపైనా చర్చలు జరిపారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ఫోన్ సంభాషణపై మోడీ కూడా స్పందించారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ మద్దతుగా ఉంటుందని స్పష్టంచేశారు.



