Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబ్రిక్స్‌ సదస్సుకు మోడీ దూరం

బ్రిక్స్‌ సదస్సుకు మోడీ దూరం

- Advertisement -

ట్రంప్‌ ఆగ్రహాన్ని చల్లార్చేందుకేనంటున్న పరిశీలకులు
న్యూఢిల్లీ : వారం రోజుల క్రితం తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సుకు హాజరై చైనా, రష్యా అధ్యక్షులు జిన్‌పింగ్‌, పుతిన్‌తో కలివిడిగా తిరుగుతూ కరచాలనాలు, ఆలింగనాలతో హడావిడి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం జరగబోయే బ్రిక్స్‌్‌ దేశాల వర్చువల్‌ సదస్సుకు మాత్రం దూరంగా ఉండబోతున్నారు. అమెరికా తీసుకున్న టారిఫ్‌ చర్యలపై షాంఘై సదస్సులో చర్చ జరిగిన విషయం తెలిసిందే. బ్రిక్స్‌్‌ సదస్సులో కూడా ఈ అంశమే ప్రధానంగా చర్చకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మోడీ దీనికి గైర్జాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
బ్రిక్స్‌ సమావేశం సోమవారం వర్చువల్‌గా జరగబోతోంది. దీనికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్‌ హాజరవుతారు. ఈ భారీ సదస్సు నాయకుల స్థాయిలో జరుగుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ విలేకరులకు చెప్పారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో చైనా, రష్యా దేశాలతో సంబంధాలను విస్తృతం చేసుకోవాలని భావించిన ప్రధాని మోడీ షాంఘై సదస్సులో ఆయా దేశాల అధినేతలకు స్నేహహస్తాన్ని చాపారు. బ్రిక్స్‌ సదస్సుకు మోడీ ఎందుకు హాజరు కావడం లేదనే విషయంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. షాంఘై సదస్సులో భారత్‌, రష్యా, చైనా దేశాల నేతలు కలివిడిగా వ్యవహరించడం ట్రంప్‌కు ఏ మాత్రం రుచించడం లేదు. భారత్‌, రష్యా దేశాలను చైనాకు కోల్పోయామని, ఆ మూడు దేశాల మైత్రి చిరకాలం వర్థిల్లాలని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ట్రంప్‌ ఆగ్రహాన్ని కొంతమేరకైనా చల్లార్చడానికే బ్రిక్స్‌ సదస్సుకు మోడీ దూరంగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ట్రంప్‌ టారిఫ్‌ విధానంపై చర్చించడానికి బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా బ్రిక్స్‌ నేతల వర్చువల్‌ సదస్సును ఏర్పాటు చేశారు. బ్రిక్స్‌కు ప్రస్తుతం బ్రెజిల్‌ అధ్యక్షత వహిస్తోంది. చైనా, రష్యా, ఇరాన్‌ కూడా అందులో సభ్య దేశాలే. లూలా గత నెలలో మోడీతో టెలిఫోన్‌లో సంభాషించారు. ట్రంప్‌ విధించిన సుంకాల ప్రభావంపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్యం, ఇంధన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad