న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. మోడీ రాజనీతిజ్ఞత, ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పురస్కారాన్ని అందజేశామని ఘనా తెలిపింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామనీ మహామా బుధవారం మోడీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విషయాన్ని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఈ పురస్కారం పొందడం గౌరవంగా, గర్వంగా భావిస్తున్నానని మోడీ తెలిపారు. ‘140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను వినమ్రంగా ఈ పురస్కారాన్ని అంగీకరిస్తున్నాను. రెండు దేశాల యువత ఆకాంక్షలకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు దీనిని అంకితం చేస్తున్నాను. ఘనా, భారత్ మధ్య నెలకొన్న చారిత్రక సంబంధాలకు, సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలకు, భిన్నత్వానికి ఈ పురస్కారం అంకితం’ అని వివరించారు.
ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని మోడీ చెప్పారు. భారత్-ఘనా స్నేహాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ ఘనా ప్రజల పక్షానే నిలుస్తోందని, ఆ దేశానికి విశ్వసనీయమైన, అభివృద్ధి భాగస్వామిగా కొనసాగుతుందని అన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ముందుగా మోడీ ఘనా చేరుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో భారత్ నుండి ఘనాకు ప్రధాని స్థాయి పర్యటన జరగడం ఇదే మొదటిసారి.