Saturday, July 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీ ఫండ్స్‌ గేమ్‌...

మోడీ ఫండ్స్‌ గేమ్‌…

- Advertisement -

– రాష్ట్రాల ఖజానాపై పెను భారం
– కేంద్ర ప్రాయోజిత వాటాలకు కత్తెర
– రూపాయి ఖర్చు చేయాలన్నా సవాలక్ష ఆంక్షలు
– కేంద్ర నిధుల విడుదలలో ఉద్దేశపూర్వక జాప్యం
– వాటిని ఎండగట్టడంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
– ఆరు హామీల అమల్లో ఆర్థిక కష్టాలకు ఇవీ కారణమే!
– 2014 తర్వాత మున్సిపాల్టీల స్థాయికి దిగజారిన రాష్ట్రప్రభుత్వాలు

కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాగేయడం పక్కా కార్పొరేట్‌ వ్యాపార కళ. దానిలో ప్రధాని నరేంద్రమోడీ ఆరితేరిపోయారు. ఇదే వ్యాపార సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న రకరకాల ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాలను భారీగా పెంచేసి తొండాటకు దిగారు. ఆ మధ్య రేషన్‌ షాపుల్లో ప్రధాని మోడీ ఫోటో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రంలో హడావిడి చేసిన విషయం తెలిసిందే. అలాగే కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నారనీ, అక్కడ కూడా ప్రధాని ఫోటోలు ఉండాల్సిందేనని ఈ మధ్యే కేంద్రమంత్రి అయిన బండి సంజరు చాలాసార్లు చాలా వేదికలపై ఉపన్యాసాలు దంచి కొట్టారు. ఇక మరో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి… అసలు మోడీ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని దబాయిస్తూనే ఉన్నారు. అయితే వీళ్లెవరూ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో కేంద్ర వాటాలు తగ్గి, రాష్ట్ర వాటాలు ఎలా పెరిగాయనే విషయాల్ని మాత్రం ప్రస్తావించట్లేదు. అవి జనానికి చెప్తే, ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా ఆర్థిక లూటీ చేస్తున్నారో తేలిపోతుంది. ఈ దుర్నీతిని ఎండగట్టడంలో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌పార్టీ వెనుకబడిందనే చెప్పాలి. 2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల పరిస్థితి మున్సిపాల్టీలకంటే అధ్వాన్నంగా మారింది. ప్రతి అవసరానికీ ఢిల్లీ నుంచి దేహీ అని అడుక్కునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వాలు దిగజారాయి. ఆర్థిక పరమైన అధికారాలన్నింటినీ కేంద్రం తన వద్దే ఉంచేసుకొని, రాష్ట్రాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది.
బీవీఎన్‌ పద్మరాజు
కేంద్ర ప్రాయోజిత పథకాల (సెంట్రల్లీ స్పాన్షర్‌డ్‌ స్కీమ్స్‌ -సీఎస్‌ఎస్‌)కు చెందిన నిధులను తమ అవసరాల కోసం తాత్కాలికంగా వాడుకునే వెసులుబాటు గతంలో రాష్ట్రాలకు ఉండేది. ఆ అవకాశాలకు మోడీ సర్కారు కత్తెర వేసింది. స్పర్శ్‌ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ (ఆర్‌బీఐ ద్వారా ఆన్‌లైన్‌ అకౌంటింగ్‌) ద్వారా మాత్రమే ఆ నిధులను వినియోగించాలనే నిబంధన విధించింది. ఫలితంగా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు సీఎస్‌ఎస్‌ నిధులను వాడుకునే సౌకర్యాన్ని కోల్పోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని నిర్ణీత సమయంలో వాడుకోకపోతే 12 నుంచి 15 శాతం వడ్డీ చెల్లించాలనే షరతులు విధించింది. ఇవన్నీ రాష్ట్ర అర్థిక స్థితికి గుదిబండగా మారాయి. సమీకృత శిశుఅభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) కింద గతంలో అంగన్‌వాడీలు, మహిళా శిశు సంరక్షణ కార్యక్రమాలకు కేంద్రం 90 శాతం నిధులు చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా 10 శాతం నిధులను చెల్లిస్తే సరిపోయేది. కానీ ఎన్డీయే సర్కారు ఆ వాటాలను 60 శాతం (కేంద్రం), 40 శాతం(రాష్ట్రాలు)గా మార్చేసింది. ఇది కూడా రాష్ట్ర ఖజానాపై పెను భారాన్ని మోపుతున్నది. సర్వ శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)లో 65-35 శాతాలుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 60-40 శాతాలుగా మార్చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎమ్‌జీఎస్‌వై) కింద గతంలో 90 శాతం నిధులను కేంద్రం, 10 శాతం నిధులను రాష్ట్రాలు కేటాయించేవి. ఇప్పుడు ఆ నిష్పత్తి 60-40 శాతాలుగా కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన (నేషనల్‌ రూరల్‌ లివింగ్‌హుడ్‌ మిషన్‌)కు సంబంధించి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75-25 శాతం వాటాలను చెల్లించేవి. మోడీ సర్కారు వచ్చాక కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాల వాటాను 40 శాతానికి పెంచింది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ పరిస్థితి కూడా ఇదే. రాష్ట్రాల్లో పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన గ్రీన్‌ రెవల్యూషన్‌ కృషోన్నతి యోజన పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వమే వందశాతం నిధులను ఖర్చు చేసేది. ఇప్పుడు వాటిలో 40 శాతం నిధులను రాష్ట్రాలు విధిగా భరించాలని మోడీ సర్కారు షరతు విధించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో (కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రాకముందు) సెస్‌ల రూపంలో కేంద్రానికి రూ.లక్ష కోట్లు సమకూరేవి. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 9.3 శాతంగా నమోదైంది. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఈ పదేండ్ల కాలంలో సెస్‌ల రూపంలో కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.5 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంత భారీ స్థాయిలో సెస్‌లు పెంచారు. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 21 శాతంగా ఉంది. ఈ సొమ్ములోంచి కేంద్రం రాష్ట్రాలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వట్లేదు.

సీఎం దూకుడు పెంచాల్సిందే…
సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాలు, సమీక్షల్లో ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. ఆయన ఈ షరతుల అమలుపై తన సన్నిహితులు, కీలక నేతల దగ్గర ప్రస్తావిస్తూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటిపై దూకుడుగా వ్యవహరించేందుకు వ్యక్తిగతంగా, పార్టీపరంగా వెనుకాడుతున్నారు. ‘నన్ను కోసినా ఇంతకంటే ఎక్కువ చేయలేను…’ అని ఆ మధ్య ఓ బహిరంగ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం గత బీఆర్‌ఎస్‌ హయాంలో చేసిన అప్పులు, వాటి వడ్డీలు చెల్లించేందుకే సరిపోతోందని ఇటీవలే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్‌ మహేంద్రదేవ్‌ ముందు కూడా చెప్పుకొచ్చారు. దానితో పాటు ‘మీ ఆదాయాలు, అప్పులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి మీరు మాట్లాడుతున్నారు.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, అప్పులు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల గురించి నేనెవరికి చెప్పుకోవాలి…’ అంటూ ఇటీవల తనను కలిసిన ప్రతిపక్ష నేతలతో కూడా సీఎం తన ఆవేదన, ఆందోళనా వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాలపై ఆయన పలు సందర్భాల్లో, వేర్వేరు వేదికల మీద తన అభిప్రాయాలను విస్పష్టంగానే ప్రకటించారు. అందుకు కారణమైన గత బీఆర్‌ఎస్‌ పాలకులపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వకుండా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడకుండా వివక్షను ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాత్రం ఆశించిన స్థాయిలో ఆయన నుంచి ప్రతిఘటన రావట్లేదనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. రాష్ట్రానికి జరుగుతున్న ఆర్థిక అన్యాయం, సంస్కరణ పేరుతో కేంద్రం విధిస్తున్న షరతులపై ఆయన బీజేపీ, మోడీ సర్కార్‌పై మరింత బలమైన అస్త్రశస్త్రాలు సంధించాల్సిన సమయం అసన్నమైందనేది రాజకీయ విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. దీనివల్ల మోడీ సర్కార్‌ పాలనా సంస్కరణల వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయని భావిస్తున్నారు. ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

సంస్కరణల పేరుతో…
ఈ సుంకాల పెంపు మిగతా రాష్ట్రాలతోపాటు తెలంగాణకూ తీవ్ర ప్రతిబంధకంగా మారింది. రాష్ట్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి కోత పడుతోంది. రాష్ట్రాల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్న కేంద్రం, వాటిని తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలంటే సంస్కరణలు అమలు చేయాలనే షరతులు విధిస్తుంది. ఈ సంస్కరణలన్నీ ప్రజలపై భారాలు మోపేవీ, ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటుపరం చేసేలా ఉండటంతో అనేక రాష్ట్రాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. దీనితో అలాంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం కోతలు విధిస్తున్నది. కేంద్రం సంస్కరణల పేరుతో విధిస్తున్న షరతుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నూతన విద్యా విధానం అమలు వంటివి అనేకం ఉన్నాయి. ఇలాంటివి అమలు చేస్తేనే కేంద్రం నుంచి నిధులు, పాత బకాయిలు ఇస్తామని మోడీ సర్కారు తెలంగాణ ప్రభుత్వం మెడపై కత్తి పెట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -