Saturday, March 21, 2026
E-PAPER
Homeజాతీయంవాహనదారులకు మోడీ సర్కారు షాక్‌

వాహనదారులకు మోడీ సర్కారు షాక్‌

- Advertisement -

ప్రీమియం పెట్రోల్‌ ధర పెంచిన కేంద్రం
లీటర్‌పై రూ.2.35 మేర పెంపు

న్యూఢిల్లీ : భారత్‌లోని వాహనదారులకు మోడీ సర్కారు షాక్‌ ఇచ్చింది. ప్రీమియం పెట్రోల్‌ ధరను రూ.2.35 మేర పెంచింది. ప్రస్తుతం సాధారణ పెట్రోల్‌ ధరలను పెంచనప్పటికీ.. ప్రీమియం పెట్రోల్‌ ధరలను పెరిగిన క్రమంలో ఇతర ఇంధన ధరలను సైతం మోడీ సర్కారు పెంచుతుందనే ఆందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం పెరిగిన ప్రీమియం పెట్రోల్‌ ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఈ పెంపు వెనక ఎలాంటి కారణాన్నీ పేర్కొనకపోయినప్పటికీ.. ఇరాన్‌-యూఎస్‌ వివాదం నడుమ ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్‌ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.

కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పటికే వంట గ్యాస్‌ ధరలను పెంచి మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిన విషయం విదితమే. వివరాళ్లోకెళ్తే… వంటగ్యాస్‌ ధరల పెంపు తర్వాత ఇప్పుడు పెట్రోల్‌ వంతు వచ్చింది. స్పీడ్‌, పవర్‌ వంటి ప్రీమియం పెట్రోల్‌ ధరలను కంపెనీలు పెంచేశాయి. స్పీడ్‌, పవర్‌ పెట్రోల్‌ లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకు పెంచినట్టు హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థలు ప్రకటించాయి. ప్రాంతాన్ని బట్టి లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.2.09 నుంచి రూ.2.35 వరకు పెరుగుతుందని తెలిపాయి. సవరించిన ధరలను శుక్రవారం నుంచే అమలులోకి తీసుకొచ్చినట్టు తెలిపాయి.

తాజా పెంపుతో ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.111.68 స్థాయిలో ఉన్న ప్రీమియం పెట్రోల్‌ లీటరు ధర రూ.113.77కు చేరినట్టు తెలుస్తోంది. అయితే, డీలర్‌ కమీషన్‌ వేర్వేరుగా ఉండడం వల్ల ఇది ప్రాంతాల వారీగా మారుతుంటుంది. సాధారణ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతథంగానే ఉన్నాయి. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ పవర్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎక్స్‌ పీ 95 వంటి బ్రాండెడ్‌ ప్రీమియం పెట్రోల్‌ ధర పెరిగింది. ఢిల్లీ మార్కెట్‌ ధరల ప్రకారం స్పీడ్‌ పెట్రోల్‌ బీఎస్‌-6 ధర రూ.2.09 మేర పెరిగి రూ.112.92కు చేరినట్టు తెలుస్తోంది. సాధారణ పెట్రోల్‌ బీఎస్‌ 6 ధర రూ.103.81 గా ఉంది. డీజిల్‌ ధర లీటరుకు రూ.90.35 వద్ద ఉంది.

ఇక హైదరాబాద్‌లో ఈ ధరలు కనిష్టంగా రూ.2.26 మేర పెరిగినట్టు పెట్రోల్‌ డీలర్స్‌ చెప్తున్నారు. అయితే ట్రాన్స్‌పోర్టేషన్‌ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని చెప్తున్నారు. ఇరాన్‌తో యూఎస్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్రమవుతోంది. ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడిన క్రమంలో దేశంలో చమురు కొరత ఏర్పడింది. దీంతో దేశంలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రీమియం పెట్రోల్‌ ధరలను పెంచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 115 డాలర్లు దాటిన క్రమంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు వాహనదారులకు బదిలీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సాధారణ, ప్రీమియం మధ్య తేడా ఏంటి?
పెట్రోల్‌ గ్రేడ్‌ను దాని ఆక్టేన్‌ వాల్యూ ఆధారంగా వర్గీకరిస్తారు. భారత్‌లో సాధారణ పెట్రోల్‌ ఆక్టేన్‌ విలువ 87గా ఉంటుంది. ఇక ప్రీమియం పెట్రోల్‌ ఆక్టేన్‌ వాల్యూ 91గా ఉంటుంది. హై ఆక్టేన్‌ ఉన్న ఇంధనం ఎక్కువ కంప్రెషన్‌ రేషియోను కలిగి ఉంటుంది. దీంతో వాహనంలోని ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసే టైంలో ఎక్కువ ఇంధనం తీసుకోదు. అంతేకాకుండా కార్బన్‌పై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. శక్తిమంతమైన ఇంజిన్లు కలిగిన స్పోర్ట్స్‌ కార్లు, బైకులు, సూపర్‌ కార్ల వంటి వాటికి ఈ ప్రీమియం పెట్రోల్‌ ఉత్తమంగా చెబుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -