సీఎం రేవంత్‌రెడ్డికి సమయమివ్వని కేంద్ర మంత్రులు
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని భావించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని, తద్వారా ఆయా ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరినట్టు తెలిసింది. ముఖ్యంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హౌం శాఖ మంత్రి అమిత్ షా, ఆ శాఖ సెక్రెటరీ, పట్టణాభివద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర మంత్రుల సమయాన్ని సీఎంఓ కోరింది. అయితే ఏ మంత్రిత్వ శాఖ కూడా సీఎం అపాయింట్మెంట్‌పై స్పందించలేదు. ఢిల్లీలో బాంబు బ్లాస్ట్, దేశ వ్యాప్త ఉగ్రవాదుల పేలుళ్ల కుట్రలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఆయా శాఖల్లో ప్రాజెక్ట్ లు, ఇతర అంశాలపై సమీక్షలు, ఇతర కీలక మీటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. దీంతో వేరే అంశాలపై ఎవరికి సమయం ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో… కీలకమైన యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్ షిప్ ఫోరం (యూఎస్‌ఐఎస్పీఎఫ్) సమ్మిట్‌ను పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి… సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.



