– ప్రపంచ శాంతికి ట్రంప్ ద్రోహం : సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అలీనోద్యమాన్ని తుంగలో తొక్కిన మోడీ ప్రభుత్వం అమెరికాకు దాసోహం అంటోందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో జరిగిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) రాష్ట్ర సమన్యయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ రచించిన ‘ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం’ అనే పుస్తక పరిచయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోని ఖనిజ సంపద, చమురు నిక్షేపాలపై అధిపత్యం కోసమే అమెరికా యుద్ధాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రపంచ శాంతే శాశ్వత ఎజెండా అని ఆయన పునరుద్ఘాటించారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ప్రపంచ శాంతికి భగం వాటిల్లిందని విమర్శించారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధాలను నివారించి, ఆయుధాలకు వ్యయం చేసే డబ్బును ప్రజల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. శాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతున్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశానికి ఐఎఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షత వహించగా, ఐప్సో జాతీయ నాయకులు కె. యాదవరెడ్డి, ఐప్సో నాయకులు ఓబేదుల్లా కోత్వాల్, డాక్టర్ డి.సుధాకర్, పి.ప్రేమ్ పావని తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాచం సత్యనారాయణ, పడాల నళిని, రాంచంద్రారెడ్డి, పోలగాని రవికిషోర్, అరసం నాయకులు రాపోలు సుదర్శన్, బొమ్మగాని నాగభూషణం, జీఎస్ రిటైర్డ్ అధికారి లక్ష్మయ్య, నాయకులు నరేంద్ర ప్రసాద్, కె.శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అమెరికాకు మోడీ ప్రభుత్వం దాసోహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



