Wednesday, July 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్న మోడీ సర్కార్‌

దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్న మోడీ సర్కార్‌

- Advertisement -

విదేశీయుల పేరుతో ప్రజలపై దాడులు
గురుకులాల్లో సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌. వీరయ్య
నవతెలంగాణ-గోదావరిఖని

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో భయానకమైన పరిస్థితులను కల్పిస్తున్నదన్నారు. విదేశీయులనే పేరుతో ఎవరిని వేధించదలచుకుంటే వారిపై దాడులు చేస్తున్నదని, ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ లాంటి చోట్ల ఈ దాడులు మొదలయ్యాయని, ఇది దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 40, 50 ఏండ్ల నుంచి ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్న వారిని సైతం ఐడెంటిటీని నిరూపించుకోవాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నదని, లేకుంటే వారు దేశభక్తులే కాదని కేసు పెట్టేందుకు సైతం వెనకాడటం లేదని విమర్శించారు. రుజువు చేసుకోవడానికి ఏ ఆధారాలు కావాలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోందని, జనన ధ్రువీకరణ పత్రంతో పాటు తలిదండ్రుల ధ్రువీకరణ పత్రాలు సైతం ఉండాలని చెబుతున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని తెలిపారు. బీహార్‌లో ఓటర్ల లిస్టును అప్డేట్‌ చేస్తున్నామన్న పేరు మీద పెడుతున్న నిబంధనలు ప్రమాదకరమైనవిగా ఉన్నాయని అన్నారు. 2003లో ఓటర్ల లిస్టులో పేరున్న వారిని ఒదిలేసి కొత్తగా చేరిన వారిని వారి భారతీయతను నిరూపించుకోవాలని అనడం ఎంతవరకు సబబని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని, పంట సీజన్‌ ప్రారంభంలోనే స్టాక్‌ పెట్టాల్సింది పోయి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేదని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో గురుకుల పాఠశాలల్లో ఎలాంటి పరిస్థితులున్నాయో ఇప్పుడూ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక మంది పిల్లలు ఫుడ్‌ పాయిజన్‌ వల్ల అస్వస్థతకు గురవుతున్నారని, అన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నామంటున్న అధికారులు ఎందుకు ఈ విషయంపై ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాలను కాపాడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వై యాకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, ఎం.రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు మెండే శ్రీనివాస్‌, మేదరి సారయ్య నాయకులు ఆరెపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -