సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
హుజూర్‌నగర్‌లో బైక్ ర్యాలీ
నవతెలంగాణ-హుజూర్‌నగర్
దేశవ్యాప్తంగా 9వ తేదీన చేపట్టనున్న సార్వత్రిక సమ్మెతో మోడీ ప్రభుత్వానికి దిమ్మ తిరగాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సమ్మె విజయవంతం కోసం సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణ కేంద్రంలో సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంపద మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వ రంగంలో ఉన్న వివిధ కంపెనీలను పూర్తిగా బడా కార్పొరేట్ చేతుల్లో పెడుతోందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంపదను దోచి ముగ్గురు, నలుగురు చేతిలో పెడుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాత్రం విఫలమైందన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్ర ప్రభుత్వాలను పెట్టే కార్యక్రమాలు సాగిస్తోందన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి సమ్మెతో కండ్లు తెరిపించాలని అన్నారు. సమ్మెలో వ్యాపార వర్గాలు, ఉద్యోగస్తులు, రైతు, కూలీలు, సకలజనులు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శీలం శ్రీను, ఎలుక సోమయ్యగౌడ్, జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాశం వెంకటనారాయణ, రేపాకుల మురళి, చిన్నం వీరమల్లు, తురక వీరయ్య, పిట్టల నాగేశ్వరరావు, రేపాకుల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
సమ్మెతో మోడీ ప్రభుత్వానికి దిమ్మతిరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES