– ఉపాధిహామీ నిర్వీర్యం తగదు
– కార్మికుల శ్రమను దోచుకునేందుకే ఇలాంటి విధానాలు
– ‘వీబీ జీ రామ్ జీ’ని రద్దు చేయాలి.. రేపు చట్టం ప్రతుల దహనం: వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పేదలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని, ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చే జీ రామ్ జీ బిల్లును రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లతో పాటు రైతులకు నష్టం కలిగించే నల్ల చట్టాలనూ రద్దు చేయాలని కోరారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావుతో కలిసి వెంకట్ మాట్లాడారు. 2005లో వామపక్ష పార్టీల ఎంపీల మద్దతుతో వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసిన ఫలితంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం కారణంగా దేశంలో కోట్లాదిమంది నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరికిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయిందని అన్నారు. గ్రామీణ ప్రాంత కూలీలకు కొంత ఉపశమనం లభించిందని చెప్పారు. అటువంటి చట్టాన్ని మార్చి దాని స్థానంలో మోడీ ప్రభుత్వం జీ రామ్ జీ పథకాన్ని తీసుకురావడం సహేతుకం కాదన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్‌లో పెట్టిన వికసిత్ భారత్ రోజ్ గార్ మిషిన్ అనే పథకం ద్వారా కూలీలకు 60 రోజులు పని దినాలు తగ్గించారన్నారు. దీనికి 90 శాతం కేంద్రం బడ్జెట్ కేటాయించాలి కానీ 60శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించటంతో రాష్ట్రాలపై భారం పడుతోం దన్నారు. దీని కారణంగా చట్టం బదులు పథకంగా బిల్లు మారిందన్నారు. ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడిందని తెలిపారు. దేశంలో 35 కోట్ల మంది ఉన్న వ్యవసాయ కూలీలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని, ఒకవైపు యంత్రాలు వచ్చి పనులు కోల్పోతున్నారని తెలిపారు. మరోవైపు ఉపాధి చట్టం షరతులు విధించటం సరైనది కాదన్నారు. వెంటనే వీబీజీ రామ్‌జీ బిల్లును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం రద్దును నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 26వ తేదీన నిరసన కార్యక్రమాలు, జనవరి 8 నుంచి 19 వరకు గ్రామ గ్రామాన ప్రచార జాతాలు, 19న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. వీటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, నాయకులు పొన్నం వెంకటేశ్వర రావు, మెరుగు సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, నాయకులు యర్రా శ్రీనివాసరావు, తుమ్మా విష్ణు పాల్గొన్నారు.
పేదలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ నిర్ణయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



