Wednesday, March 4, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ సర్కార్‌ మౌనం దారుణం

మోడీ సర్కార్‌ మౌనం దారుణం

- Advertisement -

ఇరాన్‌ ప్రజలకు సంఘీభావం తెలపాలి
అమానవీయ దాడులను ఖండించాలి
ట్రంప్‌ చేతిలో కీలుబొమ్మ మన ప్రధాని : బృందాకరత్‌
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడికి వ్యతిరేకంగా వామపక్షాల నిరసన

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడి పట్ల మోడీ సర్కార్‌ మౌనం దాల్చడం దారుణమని సీపీఐ(ఎం) సీనియర్‌ నేత బృందాకరత్‌ విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ భీకర దాడి, ఇరాన్‌ సుప్రీం ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా మంగళవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌ వద్ద వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. ప్లకార్డులు చేతబూని అమెరికా, ఇజ్రాయిల్‌ అమానవీయ చర్యలను ఖండిస్తూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిని ఎండగడుతూ నినాదాలు హోరెత్తించాయి. మోడీ సర్కార్‌ మౌనాన్ని ప్రశ్నించాయిు. ఈ క్రూరమైన దాడికి వ్యతిరేకంగా ప్రధాని నిలబడాలని, ఇరాన్‌ ప్రజలకు సంఘీభావం తెలిపాలని, మాన వీయతను ప్రదర్శించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్‌ నేత బృందాకరత్‌ మాట్లాడుతూ మోడీ ట్రంప్‌ కీలుబొమ్మ అని అన్నారు. ఇరాన్‌లో జరుగుతున్నది పిల్లల ఊచకోత అని తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీ మౌనం లొంగుబాటు, దాడులకు నాయకత్వం వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను ఒప్పుకుంటున్నట్టేనని విమర్శించారు. ”అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సామ్రాజ్యవాద గూండాయిజం, ఇరాన్‌పై దాడి వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు. ”నెతన్యాహు రక్తంతో తడిచిన చేతులను ప్రధాని మోడీ పట్టుకుని ఇది దేశ ప్రజల గొంతు అని అన్నారు. ఇది ప్రజల గొంతు ఎలా అవుతుంది? ఒక జాతి నిర్మూలనకు సహాయం చేయడానికి మీరు ఇజ్రాయిల్‌కు వెళ్లారు” అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయిల్‌ నుంచి తిరిగి వచ్చిన 24 గంటల్లోపే ఇరాన్‌పై దాడి జరిగిందని బృందాకరత్‌ తెలిపారు. ”దాడికి ఆమోద ముద్ర వేయడానికి మీరు అక్కడికి వెళ్లారా? ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రితో కలిసి గాజాను పూర్తగా నాశనం చేయాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు. అమెరికా, జియోనిస్ట్‌ ఇజ్రాయిల్‌ బెదిరింపులకు వ్యతిరేకంగా మేము మా గొంతులను వినిపిస్తున్నాం. దేశ విదేశాంగ విధానానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ప్రధాని మోడీ విదేశీ సంబంధాలను జాతీయ సార్వ భౌమాధికారం కోణంలో చూడాలి” అని ఆమె అన్నారు. ”ట్రంప్‌నకు తలవంచి, ఇరాన్‌పై దాడి పట్ల మౌనంగా ఉండటం సామ్రాజ్యవాద అనుకూల విదేశాంగ విధానమని విమర్శించారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య మాట్లాడుతూ దేశ ప్రజలు ఈ యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. ”గత నాలుగు రోజులుగా ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోంది. చర్చలు జరుగు తున్నాయి.

కానీ అమెరికా, ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై దాడి చేశాయి. గత సంవత్సరం 12 రోజుల యుద్ధాన్ని మనం చూశాం. ఇప్పుడు అది ప్రాంతీయ యుద్ధంగా మారే దిశగా కదులుతోంది” అని అన్నారు. ”యుద్ధాన్ని ఆపడానికి, శాంతిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో దేశానికి ఎటువంటి పాత్ర లేదని నిర్ధారించుకోవడం మన బాధ్యత” అని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌ అమాయక పిల్లలను చంపాయని, స్కూల్‌పై బాంబు దాడి జరిగిందని తెలిపారు. ఇది ఇండియాపై కూడా ప్రభావం చూపుతుందని, ఎందుకంటే చాలా మంది భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో పని చేస్తున్నారని అన్నారు. ఈ నిరసనలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌. అరుణ్‌ కుమార్‌, కేంద్ర కమిటీ సభ్యులు కె. హేమలత, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అరురాగ్‌ సక్సేనా, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అమర్‌జిత్‌ కౌర్‌, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎస్‌ యూసీఐ, సీజీపీఐ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరసన భగ్నానికి సంఘ్‌ పరివార్‌ యత్నం
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా తలపెట్టిన నిరసనను భగం చేసేందుకు సంఘ్‌ పరివార్‌ ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు అవమానిస్తున్నారని అడుగుతూ బీజేపీ కార్యకర్తలు పోటీగా నిరసనకు దిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -