అమెరికాతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఎవరూ సమర్ధించజాలనిది. కాని ఏదో విధంగా దాన్ని సమర్ధించుకోడానికి మోడీ బృందం నానా తిప్పలూ పడుతోంది. అందుకోసం ఒకదానివెంట మరొకటిగా అర్ధం, పర్ధం లేని వాదనలను ముందుకు తెస్తోంది. జొన్నలు, సోయా చిక్కుళ్లు, డి.డి.జి.లు (డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్-వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ధాన్యాల నుండి ఇథనాల్‌ను వెలికితీసిన తర్వాత మిగిలిన భాగం) వంటివి అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం వలన పశువుల మేత ఖరీదు తగ్గిపోతుందని, ఆ విధంగా రైతులకు ఈ ఒప్పందం ఉపయోగకరంగా ఉంటుందని చేస్తున్న వాదన వాటిలో ఒకటి. అంటే ఈ ధాన్యాల దిగుమతి వలన దేశీయంగా వాటి ధరలు తగ్గిపోతాయని చెప్తూ ఆ విధంగా తగ్గిపోవడం మంచిదేనంటోంది ప్రభుత్వం. అసలు ఏ దేశమైనా దిగుమతుల మీద సుంకాలను ఎందుకు విధిస్తుంది? ఎప్పుడు విధిస్తుంది? ఆ దిగుమతయ్యే సరుకుల ధరలు అవే సరుకులను దేశీయంగా ఉత్పత్తి చేసినప్పుడు వాటికి నిర్ణయించే ధరల కన్నా తక్కువగా ఉన్నప్పుడే వాటి దిగుమతుల మీద సుంకాలను విధిస్తుంది.
దిగుమతి చేసుకున్న సరుకులు దేశీయ ఉత్పత్తులకన్నా చౌకగా దొరుకుతాయి గనుక దిగుమతి చేసుకుంటేనే ప్రజలకు ఎక్కువ ప్రయోజనకరమని ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదనే గనుక సరైనది అయితే అప్పుడు ఏ దిగుమతి మీదా ఎటువంటి సుంకమూ విధించకూడదు కదా? అసలు దిగుమతుల మీద సుంకాలు ఎందుకు విధిస్తారు? అలా సుంకాలు విధించినందువలన దేశీయంగా ఆ సరుకులను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. అందువలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ సరుకుల అమ్మకాల ద్వారా దేశీయ ఉత్పత్తిదారుల ఆదాయాలు పెరుగుతాయి. దాంతో అనేక ఇతర సరుకులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుంది. ఆ సరుకులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన అదనపు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. చౌకగా లభిస్తాయన్న పేరుతో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటే అప్పుడు ఈ ఆదాయాలు, ఉపాధి అవకాశాలు బయట దేశాలకు పోతాయి.
ఇదికాక మరొక కారణం కూడా ఉంది. సరుకులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలంటే అందుకు విదేశీ మారకద్రవ్యం అవసరం. మనకు విదేశీ మారకద్రవ్యం నిల్వలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. అందుచేత వీలైనన్ని సరుకులను దేశీయంగా ఉత్పత్తి చేసుకోగలిగితే విదేశీ మారక నిల్వలను కరిగిపోకుండా నిలుపుకోగలుగుతాం. మరి చౌకగా లభించే దిగుమతులను ఉపయోగించి తక్కువ ధరలకే ఇక్కడ సరుకులను ఉత్పత్తి చేయగల అవకాశాలను మనం ఎందుకు వదులుకోవాలి? అన్న ప్రశ్న తలెత్తుతుంది(పశువుల మేతకు ముడిసరుకుగా ఉపయోగించే జొన్నలు, సోయా చిక్కుళ్లు, వగైరా తక్కువ ధరకే దొరికితే అప్పుడు పాడి, మాంసం, పౌల్ట్రీ రంగాలలో ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్మగలుగుతారు). అయితే ఇలా చౌకగా అమ్మడానికి వీలుగా ఆ ముడిసరుకులను దిగుమతి చేసుకోవడం ఒక్కటే ఇందుకు పరిష్కారం కాదు. వాటికి ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటించి దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహం అందించవచ్చు. అప్పుడు దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విదేశీ మారకద్రవ్యాన్ని కూడా పదిలంగా ఉంచుకోవచ్చు.
చాలాకాలం నుంచీ అమెరికా చేస్తున్నది ఇదే. తన వ్యవసాయ రంగానికి అమెరికా అందించే సబ్సిడీ చాలా భారీగా ఉంటుంది. మొత్తం ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ పంటల విలువలో సగానికి పైబడి వారికి సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తోంది. అమెరికాలో రైతుల సంఖ్య చాలా తక్కువ కనుక వారికి ఈ సబ్సిడీని నేరుగా నగదు రూపంలోనే బదిలీ చేస్తోంది. అదే సమయంలో ఇండియా వంటి ఇతర దేశాలు తమ రైతాంగానికి అందించే సబ్సిడీలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అటువంటి సబ్సిడీలు మార్కెట్‌లో అనవసర జోక్యాన్ని పెంచి ధరల నిర్ణయ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తాయంటూ వాదిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తమ రైతులకు భారీగా సబ్సిడీలు అందిస్తాయి. ఆ దేశాలు తమ రైతులకు సబ్సిడీలు ఇస్తే అది ప్రోత్సాహకం. మన దేశం ఇస్తే అది మార్కెట్‌లో అనుచిత జోక్యం అన్నది అగ్రదేశాల వాదన. ఉదాహరణకు పత్తి సాగును తీసుకుందాం. ఇప్పటికే పత్తి మార్కెట్ మనదేశంలో కుంగిపోయి వుంది. రానున్న కాలంలో దిగుమతులు వచ్చిపడతాయన్న ముందస్తు అంచనా ఈ మార్కెట్‌ను మరింత కుంగదీస్తోంది.
ఈ పత్తిని అమెరికాలో పండించే రైతు ప్రతీ ఒక్కరికీ సగటున 1,27,000 డాలర్లు సబ్సిడీ ఇటీవలి వరకూ ఇచ్చారు. బ్రెజిల్ దీనిమీద ఫిర్యాదు చేస్తే కొద్దిగా తగ్గించారు. ఇప్పుడు కూడా అమెరికాలో పత్తిరైతు సగటున కనీసం ఒక కోటి రూపాయల మేరకు సబ్సిడీ పొందుతున్నాడు. ఆ దేశంలో పత్తిరైతులు కేవలం 27వేల మంది మాత్రమే ఉన్నారు. అందుచేత వారికి నేరుగా ఆ సబ్సిడీని నగదు రూపంలో అందించడం ఆ ప్రభుత్వానికి కష్టమేమీ కాదు. ఇప్పుడు మనం గనుక చౌకగా లభించే సరుకులనన్నింటినీ దిగుమతి చేసుకోవడమే మంచిది అన్న వాదనను అంగీకరిస్తే అప్పుడు మనదేశంలో ఆదాయాలు తగ్గిపోతాయి., ఉపాధి అవకాశాలు కుంగిపోతాయి., పైగా మన ఆహార భద్రత కూడా దెబ్బతింటుంది. అమెరికా నుండి, ఇ.యు దేశాల నుండి ఆయా ప్రభుత్వాలందించే భారీ సబ్సిడీల దన్నుతో మన దేశానికి వచ్చిపడే ఆహార ధాన్యాల దిగుమతులతో పోటీ చేయలేక ఆహార ధాన్యాల సాగు చేస్తున్న కోట్లాదిమంది మన రైతాంగం చితికిపోతారు.
ఇలా అమెరికా నుండి దిగుమతులకు తలుపులు తెరచినందువల్ల మన భారతీయ సరుకులకు అమెరికాలో ప్రవేశం లభిస్తుందని, అమెరికన్ మార్కెట్ పరిమాణం 30 ట్రిలియన్ డాలర్ల బ్రహ్మాండమైన సైజుతో ఉందని, అందులోకి ప్రవేశించడం అంటే మన పంట పండినట్టేనని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం చెప్తున్న 30 ట్రిలియన్లు అమెరికా జీడీపీకి సంబంధించినది. ఇకవేళ ఇండియా అమెరికన్ మార్కెట్లోకి విజయవంతంగా ప్రవేశించగలిగినా, ఆ మార్కెట్లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చేజిక్కించుకోగలుగుతుంది. ప్రభుత్వం వాదన చూస్తుంటే భారీ ఆర్థిక వ్యవస్థ ఉన్న ఏ దేశంతోనైనా ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ ఒప్పందంలో ఎన్ని ప్రతికూల షరతులు వున్నప్పటికీ. మనకు లాభసాటిగానే పరిణమిస్తుందన్నట్టు అనుకోవాలి! ఈ మధ్య ప్రభుత్వం కొత్త ఎత్తుగడ పన్నింది. రైతులను చీల్చి వారి వ్యతిరేకతను నీరుగార్చాలని అది ప్రయత్నిస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు ప్రధానంగా పండించే గోధుమ, వరి పంటల జోలికి అమెరికా ఒప్పందం రాలేదు కనుక వారెవరూ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించకూడదని ప్రభుత్వం చెప్తోంది. అంటే జమ్ముకాశ్మీర్‌లో పళ్లతోటల రైతులు నష్టపోయినా, మహారాష్ట్రలో పత్తి రైతులు నష్టపోయినా ఉత్తరప్రదేశ్ రైతులు పట్టించు కోకూడదని అంటోంది.
ఇది కేవలం రైతులను చీల్చి వారి ఐక్యతను భగం చేసే కుట్ర మాత్రమే కాదు, రైతులకు వారి స్వంత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని, ఈ దేశంలో బాధ్యత కల పౌరులుగా వారు ఆలోచించనవసరం లేదని, ప్రజాస్వామ్య స్పందన వారికి ఉండనవసరం లేదని మోడీ ప్రభుత్వం చెప్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ పౌరుడూ తక్కిన వారందరి మంచి చెడ్డలను కూడా పట్టించుకోవాలి. వారి ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యలనైనా అడ్డుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న అర్థరహిత వాదనలు ఎలా ఉన్నా, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక ”అసమాన ఒప్పందం” అన్నది వాస్తవం. దీన్ని మన దేశ ప్రజలమీద ట్రంప్ ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోంది. ట్రంప్ మెప్పు పొందడం ప్రధానంగా భావిస్తున్న మోడీ ప్రభుత్వం అందుకు వంత పాడుతోంది. అయితే, ఇప్పుడు అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ సుంకాలు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు చెప్పింది. తన ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధించే అధికారం ట్రంప్‌నకు లేదని, అమెరికన్ పార్లమెంటుకు మాత్రమే ఉన్న అధికారాలను ట్రంప్ తన చేతుల్లోకి తీసుకోకూడదని ఆదేశించింది.
ఈ తీర్పు ఒక విధంగా మన దేశానికి దక్కిన మంచి అవకాశం. ఈ అసమాన ఒప్పందం నుండి బైట పడడానికి అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు ఆధారం కాగలదు. కనీసం ఇప్పుడైనా మోడీ ప్రభుత్వం ఈ ఒప్పందం నుండి బైటపడకపోతే ఈ దేశ ప్రజానీకం మోడీ ప్రభుత్వాన్ని క్షమించదు. మన ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి వ్యూహం కూడా సవ్యంగా లేదు. ఎగుమతులను పెంచుకోడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్న వ్యూహంతో ప్రభుత్వం అమెరికాతో మాత్రమే కాక, ఇయు దేశాలతో, బ్రిటన్‌తో, యు.ఎ.ఇతో, మరికొన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పం దాలను ఒకదాని తర్వాత ఒకటిగా చేసుకుంటోంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితి మాత్రం ఈ వ్యూహానికి అనుగుణంగా లేదు. ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకూ కుదించుకుపోతోంది. ఈ సమయంలో ఒక దేశం తన ఎగుమతులను పెంచుకుని లాభపడాలంటే మరికొన్ని దేశాలు దాని వలన నష్టపోవలసిందే. అందువలన ఈ వ్యూహం మూడవ ప్రపంచ దేశాల మధ్య ఒక తీవ్ర పోటీ నెలకొనడానికి దారితీస్తుంది. అంతేకాక, దీనివలన మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
ఎగుమతులను పెంచుకోవా లంటే ముందు బహుళజాతి కంపెనీల ప్రవేశానికి మనదేశం పూలబాటవేయాలి. ఒకసారి ప్రవేశించాక ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సైతం ఆ బహుళజాతి కంపెనీల ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే నడుచుకోవాలి. అంతేకాక, ఎగుమతుల వల్ల కొద్ది రంగాలకు ప్రయోజనం కలిగినా, అనేక ఇతర రంగాలకు పెరిగిన విదేశీపోటీ కారణంగా నష్టం వాటిల్లుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం అనుసరిం చాల్సిన సమతుల్య అభివృద్ధి వ్యూహం ఎలా ఉండాలి? మూడవ ప్రపంచంలోని తక్కిన దేశాలకు నష్టదాయకమైన దిశలో పోటీకి దిగే బదులు దేశీయంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం మీద దృష్టి పెట్టడం ప్రధానంగా ఉండాలి.
వ్యవసాయ రంగంలో సాధించే అభివృద్ధి మొత్తం దేశాభివృద్ధికి దారితీస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాలంలో మన దేశం ఇటువంటి వ్యూహాన్నే అనుసరిస్తూ వచ్చింది. ఆ వ్యూహం వలన మన దేశపు జీడీపీ వృద్ధిరేటు మందకొడిగానే ఉండిపోయిందని వాదించేవాళ్లు ఉన్నారు. అలా మందకొడితనం లేకుండా జీడీపీ వృద్ధివేగం పుంజుకోవాలంటే భూ సంస్కరణలను, భూ ఉత్పాదకతను పెంచే ఇతర చర్యలను ప్రభుత్వం చేపట్టడం పరిష్కారం. అప్పుడు వ్యవసాయ రంగం వృద్ధి వేగం పుంజుకుంటుంది. దానితోబాటు మొత్తం దేశ ఆర్థిక వృద్ధీ వేగాన్ని అందుకుంటుంది. అయితే, నయా ఉదారవాద విధానాల బాట పట్టిన తర్వాత ఈ వ్యూహాన్ని విడిచిపెట్టి చాలా నష్టపోయాం. మన దేశం ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంతమేలు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



