– నాలుగు లేబర్ కోడ్‌లతో తీవ్ర నష్టం
– రైతులకు నష్టం చేసేలా విత్తన చట్ట సవరణ
– వాటిని రద్దు చేసేవరకూ ఉద్యమం : సంగారెడ్డిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
– రాష్ట్రవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలపై ప్రజాసంఘాల నిరసనలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
కార్మికులు, రైతులు, కూలీలపై మోడీ ప్రభుత్వం పగబట్టిందని.. వారి హక్కులను కాలరాసి కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మండిపడ్డారు. రైతులకు నష్టం చేసేలా విత్తన చట్ట సవరణ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డిలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నుంచి ఐబీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. మహాత్మాగాందీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీబీ రాంజీ పేరుతో ఆ చట్టాన్ని బలహీనం చేశారని, ఇది చాల దారుణమైన విషయమని అన్నారు. కొత్తం చట్టంతో 40శాతం రాష్ట్రం, 60శాతం కేంద్రం పరిధిలోకి తెచ్చిందన్నారు. దీంతో రాష్ట్రాలపై మరింత భారం పడి.. కార్మికులకు నష్టం జరుగుతుందన్నారు. నూతనంగా అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్‌లతో.. కార్మికులు తిరగి బానిసలుగా మారే ప్రమాదమున్నదన్నారు. కనీసం సంఘాలు కూడా పెట్టుకునే అవకాశం లేకుండా చేశారన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలో సీఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య పాల్గొని మాట్లాడారు. సూర్యాపేటలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. హుజూర్‌నగర్ పట్టణకేంద్రంలో నూతన చట్టం ప్రతులను దహనం చేశారు. నల్లగొండలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలకేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని ప్రజా పోరాటాలతోనే కాపాడుకోవాలని నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జీ రామ్ జీ బిల్లు పత్రాలను దహనం చేశారు.
లేబర్ కోడ్లు, వీబీ రాంజీ ఉపాధి చట్టం, విద్యుత్ సవరణ చట్టాలను తక్షణమే ఉపసంహరించాలని మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో నల్లజెండాలతో నిరసన చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలం ఎల్లమ్మ రంగాపూర్‌లో ఉపాధి హామీ కూలీలతో గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు నారాయణపేట్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గద్వాల జిల్లా మనవపాడు మండలం పోతలపాడులో ఉపాధి కూలీలు నిరసన చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్ నుండి మదర్ తెరిసా సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచిప్పులలో బిల్లు ప్రతులను దహనం చేశారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నల్ల జెండాలతో మంచికంటి భవన్ నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కార్మికులు, రైతులు, కూలీలపై పగబట్టిన మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



