Wednesday, January 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ధ లేదు!

గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ధ లేదు!

- Advertisement -

వ్యవసాయంలో మొత్తం విలువ జోడింపు (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌-జివిఏ) మార్చినెలతో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల రేటు కేవలం 0.8శాతమే అని గతేడాది 10.4శాతం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గటమే అని చెబుతున్నారు. దేశమంతటా దాదాపు అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి పంటల ఉత్పత్తులు పెరిగినప్పటికీ జివిఏ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. రైతాంగ ఆదాయాల రెట్టింపు, కనీస మద్దతు ధరల పెంపుదల, ఎగుమతి అవకాశాల కల్పన వంటి ఎన్ని కబుర్లు చెప్పినా నరేంద్రమోడీ పాలనలో పరిస్థితి దిగజారింది. రైతాంగం మీద కక్షగట్టినట్లుగా అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మొత్తంగా రైతుల ఆదాయాలు పడిపోయాయి, కనీస మద్దతు ధరల నిర్ణయమే లోపభూయిష్టమైతే ఈ ఏడాది ప్రతి పంటనూ అంతకంటే తక్కువ ధరలకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. వివిధ రంగాల జివిఏల తీరుతెన్నులు చూసినపుడు యుపిఏ పాలనలో 2011-12లో వ్యవసాయ రంగ వాటా 18.53 శాతం ఉండగా 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఐదేండ్ల సగటు 18.57 శాతం ఉంది, తర్వాత ఇంకా పడిపోయిందనే అంచనాలు వెలువడుతున్నాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత అన్నప్పటికీ పారిశ్రామిక రంగ జివిఏ ఐదేండ్ల సగటు 27.56శాతం ఉంది, అదే 2011-12లో 32.5 శాతం ఉంది. సేవా రంగంలో ఐదేండ్ల సగటు 53.85కాగా 2011- 12లో 48.97శాతం ఉంది, ఒక్క సేవారంగంలో మాత్రమే పెరుగుదల ఉంది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల దిగజారుడు కారణంగానే ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల గురించి మోడీ మౌనంగా ఉంటున్నారు.
2025 డిసెంబరు 26వరకు ఉన్న వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రధాన పంటలైన మొక్కజొన్న,వేరుసెనగ, సోయా, పత్తి, కందులు, పెసలు, మినుముల వంటి వాటి ధరలు కనీస మద్దతు కంటే 5.30శాతం తక్కువ ఉన్నట్లు నమోదైంది.వివిధ పంటలకు కనీసంగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు రైతులు నష్టపో యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగు దల రేటుతో పోలిస్తే వ్యవ సాయ రంగం తక్కువగా ఉండటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగు తుండటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధనా మండలి (ఐసిఆర్‌ఐఇఆర్‌) ఇటీవలి విధాన పత్రంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఒక వ్యవసాయ కుటుంబ సగటు ఆర్జన 2012-13లో రూ.6,426 ఉంటే 2024-25లో రూ.19, 696గా ఉంది. ద్రవ్యోల్బ ణానికి అనుగుణంగా సవరిస్తే నిజ పెరుగుదలరూ.12,173గా తేలింది. దేశంలో 2014-15 నుంచి 2024-25 వరకు జిడిపి వార్షిక వృద్ధి రేటు ఆరుశాతంపైగా ఉండగా వ్యవసాయం నాలుగు శాతమే ఉంది. జనాభాలో 46శాతం మందికి జీవనాధారంగా ఉన్న ఈ రంగంలో ఇంత తక్కువ వృద్ధి సహజంగానే గ్రామీణ భారతంలో వినియోగ వృద్ధి మీద ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాలు-గ్రామీణ ప్రాంతాల మధ్య వినియోగంలో తీవ్ర అంతరం ఉండగా గ్రామీణంలో వ్యవసాయ కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. అనేక పథకాలతో ఉద్దరిస్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఉన్న పరిస్థితి ఇది.అవేవీ పారిశ్రామిక వస్తువులకు గిరాకీని పెంచలేక పోయాయి.

పంటల ద్వారా వచ్చే రాబడి కంటే పశుపోషణ ద్వారా ఎక్కువగా ఉన్నట్లు కూడా సర్వేలు చెబు తున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదంటూ అనేక మంది విముఖత చూపుతున్నారు, ఇతర జీవనోపాధివైపు మరలుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించేందుకు పూనుకు న్నందున పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, రోడ్లు, పంటల ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేని కారణంగా టమాటా, ఉల్లి, పండ్లు, బంగాళా దుంపల వంటి ఉత్పత్తుల్లో ఐదోవంతు వృధా అవుతున్నాయి, ఆ మేరకు నష్టాలను రైతులే భరిస్తున్నారు. బీమా కూడా లేదు.
ప్రభుత్వ విధానాలు అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేవిగా ఉండాలి.మొత్తంగా చూసినపుడు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అనుసరిస్తున్న పద్దతుల మీద ఏకాభిప్రాయం లేదు. ఇదే సమయంలో తగ్గుదల రైతాంగాన్ని, యావత్‌ గ్రామీణ ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నది, వ్యవసాయదారులను ఫణంగా పెడుతున్నది. ప్రపంచంలో బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న చైనా(14.5 కోట్ల టన్నులు)ను వెనక్కు నెట్టి మనదేశం(15 కోట్ల టన్నులు) ప్రథమ స్థానానికి చేరటం తమ ఘనతే అని కేంద్ర ప్రభుత్వం, అధికార బీజేపీ స్వంతడబ్బా కొట్టుకుం టున్నాయి. రైతులకు దక్కిందేమిటన్నది ప్రశ్న. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే కంపెనీలు కిలో రూ.33కు అటూ ఇటూగా ధరల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు. నిజంగా కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ధర గిట్టుబాటు అవుతుందా ? ఎగుమతులకు గ్రేడ్‌ ఏ రకాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే, వర్తమాన సంవత్సరానికి కేంద్ర ప్రభు త్వం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రూ.2,389గా ఉంది. మరోవైపు వినియోగదారులు 45 నుంచి 55 రూపాయలకు కిలోబియ్యం కొంటున్నారు. అంటే అటు రైతులను ముంచి ఇటు వినియోగదారుల జేబులు కొట్టి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తున్నాం. పప్పు, నూనె గింజల్లో స్వయం పోషకత్వం సాధించాలని సంకల్పాలు చెప్పుకోవటం తప్ప తగిన ప్రోత్సాహం, అధిక దిగుబడి వంగడాల మీద పరిశోధనా లేదు. మూడు దశాబ్దాల క్రితం నామమాత్రంగా ఖాద్య తైలాలను దిగుమతి చేసుకోనే వారం, ఇప్పుడు అరవై శాతం అవసరాలు విదేశాల నుంచే తీర్చు కుంటున్నాం. అదానీ వంటి దిగుమతి కంపెనీల లాభాలను కాపాడటానికే ఈ రంగంపై మోడీ సర్కార్‌ శ్రద్ద చూపటం లేదు. నూనెగింజల ఉత్పత్తి పెంచాలంటూ 2024లో జాతీయ పథకాన్ని ప్రారంభించారు, కళ్లు తెరవటానికి పదేండ్లు పట్టింది.మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాల మాదిరే ఇది కూడా మారనుందా? మరోవైపు ముడి పామాయిల్‌ దిగుమతులపై పన్ను మొత్తాన్ని 20 నుంచి పది శాతానికి తగ్గించారు. కొనుగోలు శక్తి లేక తలసరి ఖాద్యతైల వినియోగం తక్కువగా ఉండబట్టి గానీ లేకుంటే దిగుమతులు మరింతగా పెరిగి ఉండేవి.

వేరుశనగ దేశం మొత్తంలో మూడోవంతుకు పైగా గుజరాత్‌లో సాగు చేస్తారు. మొత్తం నూనె గింజల సాగులో మూడు దశాబ్దాల క్రితం 38శాతంగా ఉన్న వేరుశనగ ఇప్పుడు 28శాతానికి పడిపోయింది. పొద్దుతిరుగుడు ఆరు నుంచి 0.5శాతానికి దిగజారింది. సోయాబీన్‌, ఆవ నూనె సాగు పెరిగింది.వేరుశనగలో నూనె 48-50శాతం వరకు ఉంటుంది, అదే సోయాలో 18-20శాతమే, అందువలన సోయా పెరిగినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆవు పేడ, మూత్రాల్లో ఏముందని పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి మేలు చేసే నూనె గింజల దిగుబడిని పెంచే రకాల అభివృద్ధి పట్ల లేదు. వేరుశనగ దిగుబడి హెక్టారుకు మన దేశంలో 2.08టన్నులు(2023) కాగా చైనాలో 3.98, అమెరికాలో 4.19 టన్నులు ఉంది. ఇటు ధరలు లేక అటు అధిక దిగుబడి వంగడాలు లేకుండా దేశం కోసం, ధర్మం కోసం పాలన అంటే ప్రయోజనం ఏముంది! గుజరాత్‌ వేరుశనగ సాగులో ఒక నిలకడ లేదు. గడచిన రెండు దశా బ్దాలలో అక్కడ కూడా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.ఎందుకు రైతులు వేరే పంటలకు వెళతారంటే వేరుశెనగ గిట్టుబాటు కాకపోవటమే. నిజానికి నరేంద్రమోడీకి గుజరాత్‌ రైతుల మీద అయినా శ్రద్ద, రైతాంగానికి గిట్టుబాటయ్యే చర్యలు తీసుకొని ఉంటే మొత్తంగా సాగు ఇంకా పెరిగి ఉండేది, దిగుమతుల భారాన్ని తగ్గించి ఉండేది, అధిక దిగుబడి వంగడాల అభివృద్ధి జరిగి ఉండేది. ఇటీవలి కాలంలో బీజేపీ రెండింజన్ల పాలిత రాష్ట్రాలతో సహా అన్ని చోట్లా రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొన్నది. దేశీయంగా ఉత్పత్తిని పెంచటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా దిగుమతులు నిలిపి వేయటమే దీనికి కారణం. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించలేని ప్రభుత్వం డబులింజన్‌ పేరుతో ప్రగల్భాలు పలకడం సమంజసమేనా?

– సత్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -