Friday, April 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదేశ సార్వభౌమత్వంపై మాట్లాడే అర్హత మోడీకి లేదు

దేశ సార్వభౌమత్వంపై మాట్లాడే అర్హత మోడీకి లేదు

- Advertisement -

ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును రివ్యూ చేయాలి
రిజర్వేషన్లను మతంతో అనుసంధానించడం అభ్యంతరకరం
రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి
కేరళంలో మూడోసారి ఎల్‌డీఎఫ్‌ గెలుపు ఖాయం
మంత్రి పొంగులేటిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ట్రంప్‌ అపరిచితుడిగా మారిపోతున్నారు :జూలకంటి

నవతెలంగాణ-సూర్యాపేట
ఇరాన్‌పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ఖండించలేని మోడీ ప్రభుత్వానికి దేశ సార్వభౌమత్వంపై మాట్లాడే అర్హత లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మధ్యప్రాశ్చంలో దాడులపై స్పందించకుండా రాజ్యాంగ విలువలను మోడీ కాలరా స్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలన్నారు. అదే విధంగా ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్లు, మత మార్పిడి అంశంపై సుప్రీం తీర్పు సరికాదన్నారు. రిజర్వేషన్లను మతంతో అనుసంధానం చేయడం పూర్తిగా అభ్యంతరకరమని తెలిపారు. గౌరవ న్యాయస్థానం ఈ తీర్పును వెంటనే రివ్యూ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, మతానికి, రిజర్వేషన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొనాలని సూచించారు.

దశాబ్దాలుగా దళితులు ఎదుర్కొంటున్న అంటరానితనం, సామాజిక వివక్ష, ఆర్థిక, విద్య, వెనుకబాటుతనం నుంచి బయటపడేందుకు రాజ్యాంగం ప్రత్యేక హక్కుగా రిజర్వేషన్‌ కల్పించిందని వివరించారు. ఇవి మతానికి సంబంధించినవి కాదని, సామాజిక న్యాయం సాధించడానికి తీసుకున్న చారిత్రాత్మక చర్య అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అందులో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని, కొన్ని అసలు అమలుకే నోచుకోలేదని జాన్‌వెస్లీ అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం అన్ని హామీలనూ అమలు చేశామని కేరళం వెళ్లి గొప్పలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు అవాస్తవాలతో పార్టీ బలపరచుకోవాలని చూస్తున్నారని, కానీ ప్రజలు నమ్మరని అన్నారు. కేరళంలో వామపక్ష ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

పిట్టల దొరలా ట్రంప్‌ :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ పిట్టలదొరలా వ్యవహరిస్తూ అపరిచితుడుగా మారిపోతున్నాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. రైతాంగం ఆరుకాలం కష్టపడి పండించిన పంటను ఐకేపీ కేంద్రాలకు, మిల్లులకు తరలిస్తే మద్దతు ధర కరువైందన్నారు. తేమ, బెరుకులు సాకుతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌లో చెప్పినవన్నీ వెంటనే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్‌ రావు, నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి ఉన్నారు.

నాదర్గుల్‌ భూములపై విచారణ జరపాలి
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లో 320 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆక్రమించారన్న ప్రచారం నేపథ్యంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. వాస్తవాలను వెలికి తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -