Monday, January 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసామ్రాజ్యవాదానికి లొంగిన మోడీ

సామ్రాజ్యవాదానికి లొంగిన మోడీ

- Advertisement -

మరో హిట్లర్‌గా ట్రంప్‌
ఎర్రజెండా వందేండ్ల ప్రయాణం మహత్తరం : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

ఖమ్మం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

అమెరికా సామ్రాజ్యవాద శక్తికి ప్రధాని మోడీ లొంగిపోయారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా మనదేశం అంతర్జాతీయ స్థాయిలో తనకున్న గౌరవాన్ని కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో హిట్లర్‌లా మారారని దుయ్యబట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ శాసించటమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ప్రదర్శనను, అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. క్యూబా, డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, వెనిజులా, పాలస్తీనా, నేపాల్‌ దేశాల కమ్యూనిస్టు వర్కర్స్‌ పార్టీల ప్రతినిధులు ఈ సభకు హాజరై, అభినందన సందేశాలను వినిపించారు.

సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అమర్‌జిత్‌ కౌర్‌, రామకృష్ణ పాండ, అన్ని రాజా, పల్లా వెంకట్‌ రెడ్డి, పి.సందోష్‌ ప్రకాశ్‌, కె.రామకృష్ణ, గిరిశ్‌ శర్మ, కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.నారాయణ, కేరళ రాష్ట్ర కార్యదర్శి బొనొయ్ విశ్వం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజా ప్రసంగిస్తూ… దేశ స్వాతంత్య్రోద్యమంలో, ఆ తర్వాత నవ భారత నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన భారత కమ్యూనిస్టు పార్టీ వందేండ్లు పూర్తి చేసుకోవడం గొప్ప చరిత్రని తెలిపారు. అందులో భాగస్వాములైన ప్రతి కమ్యూనిస్టుకు ఇది గర్వకారణమని ఆయన ఉద్ఘాటించారు. వందేండ్ల ప్రయాణం మహత్తరమైనది.. గొప్ప త్యాగాలతో కూడుకున్నదని చెప్పారు. మరోవైపు స్వాతంత్య్రోద్యమంతో ఎలాంటి సంబంధమూ లేకుండా, వలస పాలకులతో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌ వందేండ్ల ఉత్సవాలు పూర్తి చేసుకోవడం చరిత్రలో వైరుధ్యమని ఎద్దేవా చేశారు.

మరో పోరాటం అవసరం…
భారతదేశ స్వాతంత్య్రం కోసం, దాని పరిరక్షణ కోసం కమ్యూనిస్టులు పోరాడారని రాజా గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటం అనంతరం నవ భారత నిర్మాణంలో కూడా కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. నేటి మోడీ సర్కార్‌ ఆశ్రిత పెట్టుబడిదారులకు లొంగిపోయిందని చెప్పారు. ఇది దేశానికి తీవ్ర నష్టమని హెచ్చరించారు. అందువల్ల కమ్యూనిస్టులుగా మరోసారి దేశ రక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలిచిన రెండు పార్టీలు కాంగ్రెస్‌, సీపీఐ వందేండ్లు పూర్తి చేసుకున్నాయని తెలిపారు. దేశ చరిత్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఏంటని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. స్వాతంత్య్ర పోరాటంలో మీరు పాల్గొన్నారా? అని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలను నిలదీశారు. వలస పాలకులతో వారు చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అదే వలస పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించినందుకు సీపీఐ, కాంగ్రెస్‌ గర్వపడుతున్నాయని చెప్పారు.

ట్రంప్‌ బెదిరిస్తే.. అదిరేది లేదు…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే కమ్యూనిస్టులుగా చూస్తూ ఊరుకోబోమని రాజా హెచ్చరించారు. వెనిజులాపై ట్రంప్‌ యుద్ధం ప్రకటించారని.. ఎన్నికైన, సార్వభౌమ దేశాధ్యక్షుణ్ని, ఆయన సతీమణిని అపహరించుకుని వెళ్ళారని మండిపడ్డారు. మున్ముందు మెక్సికో, కొలంబియా, క్యూబా దేశాల సంగతి చూస్తానంటూ ట్రంప్‌ బెదిరిస్తున్నారని అన్నారు. వెనిజులా పరిణామాలపై భారతదేశం స్పందించకపోవటం దారుణమని విమర్శించారు. రష్యా నుంచి భారతదేశం చమురు కొనొద్దంటూ ట్రంప్‌ శాసిస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాజా నిలదీశారు. అమెరికా సామ్రాజ్యవాద శక్తికి లొంగిపోవద్దని ఆయనకు హితవు పలికారు.

పాలస్తీనా బాధలు వర్ణనాతీతం…
పాలస్తీనాలో ప్రజల బాధలు, కష్టాలు ఊహకందని విధంగా ఉన్నాయని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి మహిళలు, చిన్నారులను ఇజ్రాయిల్‌ బలగాలు ఊచకోత కోస్తున్నాయని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయిల్‌కు ట్రంప్‌ మద్దతు ఇస్తున్నాడని తెలిపారు. పాలస్తీనా అంశానికి, రెండు దేశాల విధానానికి అనుకూలంగా ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని, యూఎన్‌ చార్టర్‌ అంతర్జాతీయ చట్టాలను ట్రంప్‌ తృణీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసపాలన కాలంలోనే పాలస్తీనాకు గాంధీ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఆంగ్లేయులకు బ్రిటన్‌, ఫ్రెంచ్‌ వారికి ఫ్రాన్స్‌ మాదిరిగానే అరబిక్‌ మాట్లాడే వారికి పాలస్తీనా చెందుతుందంటూ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. పాలస్తీనా విమోచన నాయకుడు యాసర్‌ అరాఫత్‌ మన దేశానికి ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. భారత ప్రభుత్వం, ఇక్కడి ప్రజలు కూడా పాలస్తీనాకు సంఘీభావంగా ఉండేవారని తెలిపారు. అందుకు భిన్నంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం వ్యవహరించటం శోచనీయమని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -