న్యూఢిల్లీ : తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సు గురించి యూరోపియన్ నాయకులతో ప్రధాని మోడీ గురువారం ఫోన్ ద్వారా చర్చించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో ఈ చర్చలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘విశ్వాసం, భాగస్వామ్య విలువలు, భవిష్యత్‌పై ఏక ధృక్పధంపై నిర్మించబడిన బలమైన, సన్నిహిత సంబంధాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తులు భారత్-ఈయూ పంచుకుంటాయి’ అని ప్రకటన తెలిపింది. అలాగే గురువారం చర్చల్లో ప్రపంచ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడం, ప్రపంచ స్థిరత్వాన్ని పెంపొందించడం, పరస్పర శ్రేయస్సును ప్రోత్సహించడంలో భారత్-ఈయూ వూహాత్మక భాగస్వామ్యం పాత్రను నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావించారని ప్రకటన తెలిపింది. తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సును భారత్‌లో ముందస్తుగానే నిర్వహించడం గురించి ఈ చర్చలు జరిగాయి. మరిన్ని చర్చలు జరపడానికి నాయకులు అంగీకరించారు. అలాగే, ఈ సదస్సు కోసం నాయకులను మోడీ భారత్‌కు ఆహ్వానించారు.