న్యూఢిల్లీ : నూతన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)తో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్, క్యాబినెట్ సెక్రెటేరియట్‌లు కలిగి ఉన్న సేవా తీర్థ కాంప్లెక్స్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం రైసినా హిల్‌లోని సౌత్‌బ్లాక్‌లో ఉన్న పీఎంఓను ఈ కాంప్లెక్స్‌కు తరలించనున్నారు. అలాగే, ఢిల్లీలో వివిధ ప్రదేశాల్లో ఉన్న క్యాబినెట్ సెక్రెటేరియట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్‌ను కూడా ఈ కాంప్లెక్స్‌కు తీసుకొస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్ణణ వ్యవహారాల శాఖా మంత్రి మనోహర్ లాల్, పీఎంఓలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో సేవాతీర్థ్ కాంప్లెక్స్‌లో శిలాఫలకాన్ని మోడీ ఆవిష్కరించారు. దీనిపై దేవనాగరి లిపిలో ‘పౌరుడు దేవునితో సమానం’ అని నినాదం రాసి ఉంది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పార్లమెంట్‌తో సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలను మార్చడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్‌ను కొత్త భవనంలోకి మార్చిన సంగతి తెలిసిందే. సెంట్రల్ సెక్రెటేరియట్ భవనాల పేరును కర్తవ్య భవన్, రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చింది. ప్రధానమంత్రి అధికారిక నివాసం ఉన్న రేస్ కోర్స్ రోడ్డును లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చింది. అలాగే, రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌లు, రాజ్ నివాస్‌లను లోక్ భవన్, లోక్ నివాస్‌లుగా మార్చింది.



