హక్కులు హరిస్తే సహించం
హెచ్చరించిన శ్రామికలోకం
ఎస్వీకే నుంచి ఇందిరా పార్కు వరకు మహాప్రదర్శన
హైదరాబాద్‌లో భారీగా తరలొచ్చిన కార్మికులు
ఉపాధ్యాయ, ఉద్యోగ, కర్షక, ప్రజా సంఘాల సంఘీభావం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మోడీ ఖబడ్దార్. ..కార్మికుల హక్కుల్ని హరిస్తే చూస్తూ ఊరుకోం. సత్తా ఏంటో చూపిస్తాం. లేబర్ కోడ్‌లతో కార్మికులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా బీఎంఎస్ సమ్మెలో ఎందుకు పాల్గొనడం లేదు? రాజకీయ లాభం కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెడతారా? కార్మికుల్లారా? ఆలోచించండి. ఏ చిన్న సమస్య వచ్చినా మీపక్షాన నిలబడి కొట్లాడుతున్నదెవరో గుర్తించండి. రాజకీయంగా చైతన్యం కండి. మీ కోసం కొట్లాడేవాళ్లను చట్టసభలకు పంపండి. ఎర్రజెండా పార్టీల పుట్టుకే కార్మిక వర్గం కోసం. మీపక్షాన నికరంగా కొట్లాడేది వారేననే విషయాన్ని గుర్తించడం వరకే పరిమితం కాకండి. రాజకీయ చైతన్యం కండి. ఓటుతో కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న పాలకులు బుద్ధి చెప్పండి’ అని కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల మహాప్రదర్శన నిర్వహించారు. అందులో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
మహిళా కార్మికులు కూడా పెద్ద ఎత్తున తరలొచ్చారు. కొందరు కార్మికులు బైకులపై ప్రదర్శనగా వచ్చారు. ‘లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు నశించాలి’ అంటూ కార్మికులు నినదించారు. పది గంటల పనివిధానాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఇందిరా పార్కు వద్ద జరిగిన సభలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. మహా ప్రదర్శన ముందు భాగంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, బీఆర్‌టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ఐన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.డీ.చంద్రశేఖర్, హెచ్‌ఎమ్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, టీయూసీఐ కార్యదర్శి ఎస్.ఎల్.పద్మ, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వీఎస్.బోస్, బీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారన్న, ఏఐయుటీయూసీ రాష్ట్ర ఇన్‌చార్జి భరత్, ఎస్‌కేఎం తెలంగాణ కన్వీనర్లు టి.సాగర్, పశ్యపద్మ, భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బి.పద్మ, ఐఎఫ్‌టీయూ నేత అనురాధ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, నాయకులు కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు. సమ్మెకు సంఘీభావంగా ప్రదర్శనలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రజనీకాంత్, టి.నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆనగంటి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు సంఘీభావంగా టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు.
ప్రదర్శననుద్దేశించి కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. పార్లమెంట్‌లో మందబలముందని మోడీ సర్కారు ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదనీ, ప్రజా, కార్మిక క్షేత్రంలో వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రెండు కార్మిక కోడ్‌లను తామూ వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బీఎంఎస్ సమ్మెలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. కార్మిక సంఘాలు ఐక్యత కోసం పనిచేయాలిగానీ…విడగొట్టడం కోసం కాదని చెప్పారు. కార్మికులకు నష్టం జరుగుతున్నా పట్టని కార్మిక సంఘం ఎందుకు అని నిలదీశారు. పది గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తుంటే, ఫిక్స్‌్‌డ్ టర్మ్ ఎంప్లారుమెంట్ విధానాన్ని తెరపైకి తేవడం దుర్మార్గమని విమర్శించారు. దేశంలోని రైతులకు నష్టం చేకూర్చేలా ఇతర దేశాల నుంచి ఇష్టానుసారంగా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం దారుణమని విమర్శించారు. ఇక్కడి రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. ఇదంతా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే కుట్రలో భాగమేనని చెప్పారు. అమెరికాలో ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతిచ్చిన పెట్టుబడిదారులు ఎలన్‌మస్క్ ఇప్పుడు ఆయన్ను వ్యతిరేకిస్తూ పార్టీ పెట్టారని గుర్తుచేశారు. మనదేశంలో మోడీ సర్కారుకు ఆర్థిక మద్దతిస్తున్న అంబానీ, అదానీలు కూడా రానున్న కాలంలో మాకే అధికారం కావాలనే డిమాండ్ కూడా చేస్తారని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు రాయితీలిచ్చి పేదలపై భారాలు మోపడాన్ని తప్పుబట్టారు.