కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు అమలు
కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ప్రచారం :విలేకరుల సమావేశంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదనీ, ఆ విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో వారు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ బిల్లు, లేబర్ కోడ్‌లు, విద్యుత్ సవరణ బిల్లు, సీడ్ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ – రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు-2025 (వీబీజీ-రామ్‌జీ బిల్లు)ను తీసుకురావడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి, దాని స్థానంలో జీ-రామ్-జీ అనే సంక్షిప్త నామాన్ని తీసుకురావడాన్ని వారు వ్యతిరేకించారు. దీని వెనుక ఒక దురుద్దేశముందని తెలిపారు. ప్రతిపాదిత బిల్లు అసలు చట్టంలోని నిబంధనలను నీరుగార్చటానికి , దాని ద్వారా హామీ ఇచ్చిన పని హక్కును పరిమితం చేయడానికి దారితీస్తుందని తెలిపారు. ఈ మోసపూరిత బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ చట్టమనేది వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల పోరాటాల ఫలితంగా వచ్చిందని గుర్తు చేశారు. ఏడాది పొడవునా వర్తించే డిమాండ్ ఆధారిత చట్టంగా దాన్ని మలచటంలో వామపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని తెలిపారు. వ్యవసాయ పనులు లేనప్పుడు, కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో, పనికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ అనేది డిమాండ్ ఆధారితమైనది కాబట్టి, దాన్ని పరిష్కరించేందుకు తగిన బడ్జెట్ కేటాయింపులను పెంచటం తప్పనిసరని తెలిపారు. ‘వ్యవసాయ పనుల గరిష్ట కాలంలో’ పనిని నిషేధించటం చివరికి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ లక్ష్యాన్ని నిరర్థకం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు కార్మిక వ్యతిరేక చట్టాల మాదిరిగానే ఉంటుందని తెలిపారు. ఇది చాలా మంది గ్రామీణ కార్మికులను ఉపాధి అవకాశాల నుంచి తొలగిస్తుందనీ, చివరకు వలసలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తరతరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్‌లను తీసుకురావటం ద్వారా కేంద్రం బడా కార్పొరేట్లకు మేలు చేకూర్చుతున్నదని విమర్శించారు. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రైతాంగానికి, నిరుపేదలకు ఇస్తున్న క్రాస్ సబ్సిడీని ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతున్నదని తెలిపారు. రైతాంగ పోరాట ఫలితంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాల అమలులో భాగంగానే నూతన విత్తన బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనీ, విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ దుష్ట చర్యకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు, కార్మికులు, మహిళలు , యువజన సంఘాలు కలిసిరావాలని కోరారు. వాహన ర్యాలీలు, గ్రామస్థాయి వరకు పాదయాత్రలతో సహా ప్రచార కార్యక్రమాల్లో కార్మికులు, రైతులు , వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, ఆర్ సుధా భాస్కర్, కోశాధికారి వంగూరు రాములు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



