Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుట్రంప్‌ గులాంలా మోడీ

ట్రంప్‌ గులాంలా మోడీ

- Advertisement -

– అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం
– కార్పొరేట్‌ సన్యాసి రాందేవ్‌బాబా
– బనకచర్ల ప్రాజెక్టును ఆపాలి :సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భారత్‌కు తలవంపులు తెచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గులాంలా మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇజ్రాయిల్‌కు మద్దతు ఇవ్వాలనీ, పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవద్దంటూ అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులను లూటీచేసిన 28 మంది విదేశాలకు పారిపోయారని అన్నారు. లలిత్‌మోడీ, విజరుమాల్యా లండన్‌లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని చెప్పారు. అమెరికాలో విద్యార్థులు, ఉద్యోగులను ట్రంప్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రష్యా, ఇరాన్‌ తక్కువ ధరకు ఆయిల్‌ విక్రయిస్తామంటే కొనుగోలు చేయనివ్వడం లేదన్నారు. పాడిచ్చేరి ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్నా లెఫ్లినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అక్కడ సీఎంకు కనీసం క్లర్క్‌ను కూడా బదిలీ చేసే అధికారం లేదన్నారు. తమిళనాడు, కేరళలలో గవర్నర్లు మంత్రివర్గ నిర్ణయాలను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా కట్టడి చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.

నక్సలైట్లు యుద్ధం ఆపిన వారిని కేంద్రం చంపుతున్నదని అన్నారు. శాంతిచర్చలకు సిద్ధమంటూ ప్రకటించినా ఆపరేషన్‌ కగార్‌ను ఆపడం లేదన్నారు. ఫ్యాక్షనిస్టు తరహాలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చేఏడాది మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించారని చెప్పారు. నక్సలిజాన్ని చంపడం మోడీ, అమిత్‌ తపస్సు చేసినా సాధ్యం కాదన్నారు. ఆయుధాలు వదిలేస్తే చర్చలంటున్నారనీ, మణిపూర్‌లో కుకీలకు ఆయుధాలు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. అడవుల్లో ఖనిజ సంపద కోసమే మావోయిస్టులు, గిరిజనులను చంపుతున్నారని విమర్శించారు. రాందేవ్‌బాబా కార్పొరేట్‌ సన్యాసి అని అన్నారు. విశాఖలో భూములు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. హార్స్‌లీహిల్స్‌ భూములను కట్టబెట్టాలని చూస్తున్నదని చెప్పారు. చంద్రబాబు ఓవరాక్షన్‌ వల్లే బనకచర్ల వివాదం తలెత్తిందన్నారు. రూ.80 వేల కోట్ల అంచనాతో చేపట్టే ఈ ప్రాజెక్టు రూ.రెండు లక్షల కోట్లకు చేరుతుందన్నారు. జలవివాదాలు తేలేవరకు ఈ ప్రాజెక్టును ఆపాలని డిమాండ్‌ చేశారు.
282 జీవోను రద్దు చేయాలి : కూనంనేని
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. అక్కడ కాళేశ్వరం సహా అన్ని విషయాలపై అభిప్రాయాలను చెప్పాలని కోరారు. కాళేశ్వరం నిర్మాణం పెద్ద తప్పిదమని విమర్శించారు. మిగులుజలాలపై వాటా తేలే వరకు బనకచర్ల ప్రాజెక్టును ఆపాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఏపీకి చెందిన ఐదు ఊర్లను తెలంగాణకు వదిలేయలన్నారు. పనిగంటలను ఎనిమిది నుంచి పదికి పెంచడం సరైందికాదని చెప్పారు. 282 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 150 ఏండ్ల కింద చికాగోలో జరిగిన పోరాటం ఫలితంగా కార్మికులు ఎనిమిది పని గంటల హక్కును సాధించుకున్నారని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీల దోపిడీకి కార్మికులు బలవుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్డ విషయమని అన్నారు. తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి అమలు చేస్తే బాగుంటుందని చెప్పారు. ప్రధాని మోడీ బ్యాంకులను ముంచిన కార్పొరేట్ల పక్షమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కళవేణి శంకర్‌, పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఎం బాలనర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. కల్లీ కల్లు ఘటనలో పలువురు మరణించడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. కల్లు పేరుతో కృత్రిమ పానీయాల తయారీని నిరోధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -