Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుకార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ

కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– సీపీఐ రాష్ట్ర మహాసభలో సౌహార్ధ సందేశం


గాజులరామారంలో ఘనంగా ప్రారంభమైన మహాసభ

నవతెలంగాణ – జగద్గిరిగుట్ట
కేంద్రంలోని మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, గాజులరామారంలోని మహారాజా ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 19 నుంచి 22 వరకు జరుగుతున్న సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలో బుధవారం ఆయన సౌహార్ధ సందేశం ఇచ్చారు. సామ్రాజ్యవాదుల ముందు ప్రధాని మోడీ మోకరిల్లుతున్నారని, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి పార్లమెంట్‌లో అడ్డుకుంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు అందించకపోవడంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రామిక, కార్మిక, కర్షక వర్గాల పక్షాన నిలబడడేది కమ్యూనిస్టులేనని ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసిస్తున్నారన్నారు. పేద ప్రజల అండ ముమ్మాటికీ ఎర్రజెండా అని, ఆ దిశగా సీపీఐ, సీపీిఐ(ఎం) ఐక్య ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళదామని, బూర్జువా పార్టీలను కాలగర్భంలో కలిపేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలోని 140 కోట్ల ప్రజలను మోసం చేస్తున్న మోడీ సర్కార్‌ త్వరలోనే తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలను పంచిన ఘనత కమ్యూనిస్టులదేనన్నారు. కులమతాల పేరుతో దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న బీజేపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని చెప్పారు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్‌ను మట్టి కరిపించిన చరిత్ర కమ్యూనిస్టులదేనన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ వంటి ధరలు పెరగడంతో పేద, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని గద్దెదించేందుకు కమ్యూనిష్టులు సిద్ధంగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీలతోనే కాలయాపన చేసి అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. దోచుకో.. దాచుకో అన్న చందంగా రాష్ట్రాన్ని పాలించి అప్పుల మయంగా మార్చిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఒకటి రెండు హామీలు మినహాయించి అన్ని పథకాలూ గాలికి వదిలేసారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనపైనా ప్రజలు, రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. కమ్యూనిస్టుల విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైనా ఉందని స్పష్టం చేశారు.
అంతకుముందు గాజులరామారం షాపూర్‌ చౌరస్తా నుంచి సీపీఐ జాతీయ, రాష్ట్ర, జిల్లాల నేతలు, కార్యకర్తలు భారీ ప్రదర్శనగా మహాసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ మహాసభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, జాతీయ నాయకులు కె.నారాయణ, అజీజ్‌ పాషా, కొత్తగూడెం శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సినీ నటుడు, నిర్మాత మాదాల రవి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.యూసుఫ్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి సత్యంతోపాటు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad