– సిద్ధాంతాన్ని చంపేయడం అమిత్ షా తరం కాదు
– క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు గిరిప్రసాద్‌్ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
– మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా?
– వామపక్ష లౌకిక శక్తుల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
– ఖమ్మంలో గిరిప్రసాద్ వర్థంతి సభ
నవతెలంగాణ-ఖమ్మం
క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరుగా దివంగత సీపీఐ నేత, సాయుధ పోరాట యోధులు నల్లమల గిరిప్రసాద్ నిలిచారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. తుదిశ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం పరితపించిన మహౌన్నతుడని కొనియాడారు. గిరిప్రసాద్ 29వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని గిరిప్రసాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రిక్కాబజార్ హైస్కూల్ గ్రౌండ్‌లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో సంక్లిష్ట పరిస్థితి నెలకొన్నదని, మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. అమిత్ షా ప్రకటించినట్టుగా మావోయిస్టు నిర్మూలన 2026 మార్చి 31 కాదు కదా ఎన్నటికి అది సాధ్యం కాదని చెప్పారు. సిద్ధాంతాన్ని ఆచరిస్తున్న కొంత మందిని హత్య చేయడం సాధ్యమేమో కాని, సిద్ధాంతాన్ని చంపేయడం అంత తేలిక కాదని, అదే సమయంలో మావోయిస్టులు సైతం తమ పంథాను మార్చుకోవాలన్నారు. నాడు సాయుధ పోరాటంలో వేల మందిని హతమార్చారని గిరిప్రసాద్‌ని సైతం హతమార్చాలని ప్రయత్నించినప్పుడు తుపాకి గుండుకు ఎదురొడ్డి నిలిచారని అన్నారు. తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు చెబుతున్నా ఎందుకు చర్చలు జరపడం లేదన్నారు. ప్రశ్నించే వారిని చంపేస్తూ నియంత పాలన వైపు మోడీ అడుగులేస్తున్నారని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. తాము యుద్ధం వద్దంటే దేశ ద్రోహులన్నారని, మరి యుద్ధం ఆపిన మోడీ సర్కార్‌ను ఏమనాలని ప్రశ్నించారు.
ఈ దేశ రాజ్యాంగానికి బీజేపీ వైపు నుంచి మాత్రమే ప్రమాదం పొంచి ఉందన్నారు. 29 మంది ఆర్ధిక టెర్రరిస్టుల్లో 28 మంది గుజరాత్ వారేనని, అందులో ఏడుగురు మోడీ ఇంటి పేరు కలిగిన వారేనని అన్నారు. వామపక్ష లౌకికశక్తుల ప్రత్యామ్నాయం మాత్రమే దేశ సార్వభౌ మాధికారాన్ని, సమగ్రతను కాపాడగలదన్నారు.
మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా? : కూనంనేని
మావోయిస్టులు ఈ దేశ పౌరులు కారా, శాంతి చర్చలకు సిద్ధమంటే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. నేరస్తులు, ఆర్థిక అరాచకవాదులు సమాజంలో పెద్ద మనుషులుగా చెలమణి అవుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజరు సైతం మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదంటున్నారని, పని చేయాలనుకున్న ఆలోచనను, సిద్ధాంతాన్ని చంపేయడం ఎవరి తరం కాదన్నారు. డిసెంబరు 26న సీపీఐ శత వసంతాల ముగింపు సభ ఖమ్మంలో జరగనుందని, దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ మహ్మద్ మౌలానా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కి సాబీర్ పాషా తదితరులు ప్రసంగించారు.
ట్రంప్ ముందు మోకరిల్లుతున్న మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES