– ‘మిషన్ సుదర్శన చక్ర’ పేరిట ఆయుధ వ్యవస్థ ఏర్పాటు
– ఆపరేషన్ సిందూర్‌లో రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ
– నిరుద్యోగులకు స్టైఫండ్… కంపెనీలకు ప్రోత్సాహకాలు
– దీపావళి బహుమతిగా జీఎస్టీలో సంస్కరణలు
– స్వావలంబన సాధించాలని పిలుపు
– ఎర్రకోట ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రశంసలు
– వలసవాదులపై మండిపాటు
న్యూఢిల్లీ : భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలోని ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా దేశీయ తయారీ రంగంలో పెరుగుతున్న సంక్షోభంపై నెలకొన్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేస్తూ అనేక కార్యక్రమా లను ప్రకటించారు. ఇవి వినియోగాన్ని పెంచుతాయని, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాయని తమ ప్రభుత్వం విశ్వసిస్తోందని చెప్పారు. మోడీ తన ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గురించి వివరించారు. తద్వారా పాకిస్తాన్‌తో సైనిక ఘర్షణ సమయంలో సాయుధ దళాలకు స్వేచ్ఛ కల్పించారా లేదా అనే విషయంపై నెలకొన్న వివాదాన్ని చల్లార్చేందుకు యత్నించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ ప్రభుత్వం సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కల్పించడమే కాకుండా ఆపరేషన్ సందర్భంగా సైనిక లక్ష్యాలను నిర్ణయించుకు నేందుకు వారికి అధికారం ఇచ్చిందని తెలిపారు.
అణు బ్లాక్‌మెయిలింగ్‌ను సహించం
పాక్ అణు బ్లాక్ మెయిలింగ్‌ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు సిందూ నదీ జలాల విడుదలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ నీరు, రక్తం కలిసి ప్రవహించలేవన్న విషయాన్ని పొరుగు దేశానికి గట్టిగా గుర్తు చేశామని చెప్పారు. దాడులకు శత్రవులు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు, వాటిని తిప్పికొట్టేందుకు ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరిట శక్తివంతమైన ఆయుధ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ‘2035 నాటికి దేశంలోని బహిరంగ ప్రదేశాలన్నింటినీ భద్రతా కవచం నీడన చేరుస్తాం. శ్రీకృష్ణ భగవానుని సుదర్శన చక్రం దారిని మేము ఎంచుకున్నాం’ అని మోడీ అన్నారు.
నిరుద్యోగులకు వరాలు
మోడీ తన ప్రసంగంలో నిరుద్యోగ యువత కోసం అనేక పథకాలు ప్రకటించారు. ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు పొందడం కోసం నిరుద్యోగులకు స్టైఫండ్ ఇస్తామని, మరింత మందికి ఉపాధి కల్పించడానికి కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. ఈ రోజు నుంచే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రారంభిస్తున్నామని అంటూ ప్రయివేటు రంగంలో మొదటిసారి ఉద్యోగం కోరుకునే వారికి రూ. పదిహేను వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. రాబోయే దీపావళి రోజు ప్రభుత్వం తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను ప్రారంభిస్తుందని, వీటి వల్ల సామాన్య ప్రజలు, ఎంఎస్‌ఎంఈలు, దేశీయ తయారీ రంగంపై పన్ను ఒత్తిళ్లు తగ్గుతాయని అన్నారు. ‘అది మీకు దీపావళి బహుమతి. కొత్త జీఎస్టీ సంస్కరణలు భారతీయులు ప్రతి రోజూ వినియోగించే వస్తువులపై పన్నుల్ని తగ్గిస్తాయి’ అని చెప్పారు.
గోడలా నిలబడతా
పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ తమ హయాంలో రెండు కోట్ల మంది ‘లఖ్‌పతి దీదీలు’ అయ్యారని చెప్పుకొచ్చారు. ట్రంప్ విధించిన భారీ సుంకాలు భారత్ మెడపై కత్తిలా వేలాడుతున్న సమయంలో మోడీ ‘ఆత్మనిర్భరత’ ‘దేశీయ ఉత్పత్తుల వినియోగం’ వంటి ప్రభుత్వ పదబంధాలను మరోసారి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పక్షాలనూ కోరారు. ‘రైతులు, పశు పోషకులు, మత్స్యకారులకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. వారి ప్రయోజనాలను దెబ్బతీసే ఏ విధానమైనా దానికి వ్యతిరేకంగా మోడీ ఓ గోడలా నిలబడతాడు. రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో భారత్ ఎన్నటికీ రాజీ పడబోదు’ అని స్పష్టం చేశారు. అయితే ఆయన తన ప్రసంగంలో ఎక్కడా ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలను ప్రస్తావించలేదు. సౌర, హైడ్రోజన్, అణు రంగాల్లో చేపట్టిన అనేక చర్యల ద్వారా ఇంధన ఉత్పత్తిని పెంచే దిశగా భారత్ ముందుకు సాగుతోందని అంటూ స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని మోడీ నొక్కి చెప్పారు. అంతరిక్షం, కీలకమైన ఖనిజ రంగాల్లో కూడా భారత్ పురోభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలను విమర్శించబోనని చెబుతూనే వాటిపై మోడీ ఆరోపణలు సంధించారు. గత ప్రభుత్వాలు సెమీ-కండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేక పోయాయని ఎత్తిపొడుస్తూ తమ ప్రభుత్వం ఏకంగా నాలుగు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.
ప్రపంచంలో ఆర్‌ఎస్‌ఎస్ అతి పెద్ద ఎన్జీఓ
మోడీ తన ప్రసంగం ప్రారంభంలో హిందూత్వ సిద్ధాంతవేత్త శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. గతంలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేసినప్పుడు కూడా ఆయన శ్యాం ప్రసాద్ ముఖర్జీని గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ముఖర్జీ తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ప్రపంచంలో అతి పెద్ద ఎన్జీఓగా ఆర్‌ఎస్‌ఎస్ కొనసాగుతోందని చెప్పారు. జాతి నిర్మాణం కోసం ఆ సంస్థ అంకితమైందని తెలిపారు.
ముస్లింలపై అక్కసు
ఒక పక్క దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలలో బెంగాలీ భాష మాట్లాడే నిరుపేద ముస్లింలు పోలీసుల అమానుష అణచివేతలకు గురవుతుంటే ప్రధాని మాత్రం వారిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలో ప్రవేశించే వలసదారులు భారత జనాభా కూర్పును మార్చేందుకు దూరాలోచనతో కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ దానిని అదుపు చేసేందుకు విశేషాధికారాలు కలిగిన ‘జనాభా మిషన్’ను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. చొరబాట్ల ద్వారా జనాభా కూర్పునకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ మిషన్‌ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
రిటైర్‌మెంటును అడ్డుకునేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రశంసలుొ కాంగ్రెస్ ఎద్దేవా
తన రిటైర్‌మెంటును అడ్డుకోవడానికే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. 75 సంవత్సరాల వయసుకు చేరిన రాజకీయ నాయకులు పదవుల నుంచి పక్కకు తప్పుకోవాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ ఇటీవల సూచించారు. ఈ నేపథ్యంలో మోడీ పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ ఇటీవలి కాలంలో పదే పదే సూచిస్తోంది. మోడీ సెప్టెంబర్ 17వ తేదీన 75వ సంవత్సరంలోకి అడుగు పెడతారు. మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ స్పందిస్తూ ‘సెప్టెంబర్ 17న తనను రిటైర్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రధాని మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రసన్నం చేసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదని, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమం వంటి నిరసనలకు అది దూరంగా ఉండిపోయిందని తెలిపారు.
‘ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్ 1925కు ముందు కాంగ్రెస్ నిరసనల్లో భాగస్వామి అయ్యారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటీష్ వారితో పోరాటంపై కాకుండా సాంస్కృతిక జాతీయతావాదంపై దృష్టి సారించారు’ అని ఠాకూర్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో లేదా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీతో పోలిస్తే ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ముప్పేమీ ఉండదని బ్రిటీష్ వారి రికార్డులలో ఉన్నదని తెలిపారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చేరవద్దని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ గోల్వాల్కర్ తమ సభ్యులకు సలహా ఇచ్చారని చెప్పారు. ‘వలసవాదంపై పోరాడడం ఆర్‌ఎస్‌ఎస్ వారసత్వం కాదు. తోటి భారతీయుల మధ్య విద్వేషాన్ని, విభజనను వ్యాప్తి చేయడమే దాని ఉద్దేశం. మహాత్మా గాంధీని మన నుంచి దూరం చేసింది ఈ సిద్ధాంతమే’ అని ఠాకూర్ ఆరోపించారు.
ట్రంప్ పేరెత్తని మోడీ
- Advertisement -
- Advertisement -