బీహార్ వలసకార్మికులపై డీఎంకే వేధింపులకు పాల్పడుతోందని విద్వేష వ్యాఖ్యలు
తీవ్రంగా ఖండించిన స్టాలిన్
శతృత్వాన్ని రెచ్చగొట్టే బదులు సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచన
ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్, సీపీఐ(ఎం)
ఎన్డీఏ మ్యానిఫెస్టో విడుదల
న్యూఢిల్లీ : తమిళనాడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషం చిమ్మారు. బీహార్‌కు చెందిన వలస కార్మికులపై డీఎంకే వేధింపులకు పాల్పడుతోందని విద్వేష వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతాల చిచ్చుపెట్టడానికి మోడీ ప్రయత్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాగట్‌బంధన్‌కు చెందిన పార్టీలు బీహార్‌కు చెందిన వలస కార్మికులపై వివక్షకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీహార్ ప్రజలను తమ రాష్ట్రంలోకి అనుమతించమని బహిరంగంగా ప్రకటించారని మోడీ చెప్పారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులు కూడా బీహార్ ప్రజలను అవమానించారని అన్నారు. తమిళనాడులోని డీఎంకే కూడా ఇదే చేస్తోందని వ్యాఖ్యానించారు. బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికులను డీఎంకే వేధిస్తుందని అంటూ విష బీజాలను నాటడానికి మోడీ ప్రయత్నించారు. బీహారీలను అవమానించి, వేధించిన నాయకులను ఇప్పుడు మహగట్‌బంధన్ తరుపున ప్రచారానికి తీసుకొస్తున్నారని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ చేసిన విషపూరిత వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ప్రజల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టే బదులు, దేశ సంక్షేమంపై దృష్టి పెట్టాలని మోడీకి స్టాలిన్ సూచించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో స్టాలిన్ పోస్టు చేశారు. అలాగే మోడీ ప్రసంగం క్లిప్‌ను స్టాలిన్ షేర్ చేశారు. ప్రధాని వ్యాఖ్యలను ”ప్రతీకారపూరితంగా” స్టాలిన్ అభివర్ణించారు. ఎన్నికల్లో లబ్ది కోసమే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రాంతీయ ఉద్రిక్తతలను లేవనెత్తడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల కోసం తమిళ ప్రజలపై బీజేపీ ”దురుద్దేశం” ప్రదర్శిస్తోందని, ప్రధాన మంత్రి మోడీ ‘చౌకబారు రాజకీయాలు’ చేయడం మానుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ‘ఈ దేశ ప్రజలందరీకి ప్రధానమంత్రిగా గౌరవనీయమైన స్థానంలో ఉన్నానని, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన బాధ్యతకు తగిన గౌరవాన్ని పొగొట్టుకుంటున్నానని మోడీ తరచు మరచిపోతారు’ అని స్టాలిన్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘బహుళ సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం గురించి గర్వించే గొప్ప భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, తమిళులు, బీహార్ ప్రజల మధ్య శత్రుత్వాన్ని సృష్టించే విధంగా ప్రవర్తించడం వంటి చౌకబారు రాజకీయాలను ఆపాలని, దీనికి బదులుగా దేశ సంక్షేమంపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి, బీజేపీ నాయకులను నేను కోరుతున్నాను’ అని స్టాలిన్ తెలిపారు. బీహార్‌లోని మహగట్ బంధన్‌కు డీఎంకే మద్దతు ఇస్తోంది. ప్రచారం కోసం స్టాలిన్ పాట్నా కూడా వెళ్లారు. ప్రధాని వ్యాఖ్యలను కాంగ్రెస్, సీపీఐ(ఎం) కూడా తీవ్రంగా ఖండిచాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడు ప్రజలపై బీజేపీ నాయకులు నిందలు వేయడం సహజంగా మారిందని కాంగ్రెస్ నాయకులు, విరుదునగర్ ఎంపీ బి.మాణికం ఠాగూర్ విమర్శించారు. మధురైలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని తన విద్వేష వ్యాఖ్యలకు గాను తమిళనాడు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలను విభజించడం అనేది ఆర్‌ఎస్‌ఎస్ డీఎన్‌ఏలోనే ఉందని, ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలను ‘తమిళనాడు ప్రజలపై విద్వేషపూరిత, అవమానకరమైన వ్యాఖ్యలు’గా సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బీహార్‌లో రాజకీయ లబ్ది కోసమే మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రకటనలో తెలిపారు. ‘బీజేపీ ప్రభుత్వ విజయాల బలంతో ఓట్లు అడగలేని ప్రధాని మోడీ పదే పదే విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు ముస్లింలపై, కొన్నిసార్లు క్రైస్తవులపై, ఇప్పుడు తమిళలపై. ఈ రకమైన వ్యాఖ్యలు ఆయన నిర్వహిస్తున్న ప్రధాని పదవికి తగనిది’ అని పేర్కొన్నారు. ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీహార్ యువతకు కోటి ఉద్యోగాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ తన మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. పాట్నాలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య వంటి హామీలు ఇచ్చారు.
ఏడాదికి రూ.లక్ష వరకు సంపాదించేలా కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మారుస్తామని, మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగే, ఈబీసీలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేలు (మూడు విడతల్లో) పెట్టుబడి సాయం వంటి హామీలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం కూడా ఇందులో ఉన్నాయి.



