మాకు హామీ ఇచ్చారు..ట్రంప్ ప్రకటన వినియోగదారుల ప్రయోజనమే ముఖ్యం : భారత్
రష్యా నుంచి చమురును కొనుగోలు చేయబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే అది ఎప్పుడు జరిగేదీ ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ పని ఇప్పటికిప్పుడు జరగదని, కొంత సమయం పడుతుందని, ఆ ప్రక్రియ మొదలైందని అన్నారు.ట్రంప్ తన ఓవల్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయకుండా ఇక చైనాను కూడా ఆపాల్సి ఉన్నదని చెప్పారు. రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌లో అది సాగిస్తున్న యుద్ధానికి మద్దతు ఇస్తోందని, దీనిపై తాము అసంతృప్తితో ఉన్నామని తెలిపారు.
వాషింగ్టన్/న్యూఢిల్లీ : చమురు, గ్యాస్ దిగుమతుల విషయంలో వినియోగదారుల ప్రయోజనాలకే తాము ప్రాధాన్యత ఇస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ట్రంప్ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ ‘చమురు, గ్యాస్‌ను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. ఇంధన ధరలు స్థిరంగా ఉండవు కాబట్టి దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తాము. మా దిగుమతి విధానాలను ఈ లక్ష్యమే నిర్దేశిస్తుంది. ఇంధన ధరలు స్థిరంగా ఉండేలా చూడడం, సరఫరాలు సజావుగా జరిగేలా చూడడం…ఇవే మా ఇంధన విధానపు జంట లక్ష్యాలు’ అని చెప్పారు.
ఇంధన కొనుగోలును పెంచుకోవాలని అనేక సంవత్సరాలుగా భావిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఈ విషయంలో పురోగతి కన్పిస్తోందని తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతోందని, చర్చలు నడుస్తున్నాయని అన్నారు. అమెరికా ఆంక్షలను లెక్కచేయకుండా రష్యా నుంచి కేంద్ర ప్రభుత్వం చమురును కొనుగోలు చేస్తుండడంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ అదనంగా పాతిక శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే.
ప్రధాని భయపడ్డారు : రాహుల్ గాంధీ
ట్రంప్‌ను చూసి ప్రధాని నరేంద్ర మోడీ భయపడ్డారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయబోమని మోడీ తనకు హామీ ఇచ్చారంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ఎన్ని అవమానాలు ఎదురవుతున్నప్పటికీ ట్రంప్‌కు మోడీ అభినందన సందేశాలు పంపుతూనే ఉన్నారని ఎత్తిపొడిచారు. ‘ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం చమురును కొనుగోలు చేయబోదని ట్రంప్ ప్రకటించారు. అలా ప్రకటించేందుకు మోడీ ఆయన్ని అనుమతించారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురవుతున్నప్పటికీ ట్రంప్‌కు మోడీ అభినందన సందేశాలు పంపుతూనే ఉన్నారు.
అమెరికాలో మన ఆర్థిక మంత్రి జరపాల్సిన పర్యటనను రద్దు చేశారు. శాంతి సదస్సుకు గైర్హాజరు అయ్యారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ట్రంప్ వాదనతో విభేదించలేదు. వీటన్నింటినీ చూస్తుంటే ఆయన ట్రంప్‌ను చూసి భయపడుతున్నట్లే కన్పిస్తోంది’ అని అన్నారు. దేశ పరువు ప్రతిష్టలతో మోడీ రాజీ పడ్డారని కాంగ్రెస్ మండిపడింది. వ్యక్తిగత సంబంధాలను పెంచుకోవడానికి ప్రపంచ దేశాలతో భారత సంబంధాలకు నష్టం కలిగించవద్దని ప్రధానికి హితవు పలికింది. భారత్‌కు రష్యా ఎప్పుడూ సన్నిహిత భాగస్వామిగానే ఉంటోందని గుర్తు చేసింది.