Monday, February 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీమార్క్‌..ధరాభారం

మోడీమార్క్‌..ధరాభారం

- Advertisement -

జీఎస్టీ శ్లాబుల కుదింపు ఉత్తిదే
ముడిసరుకుల ధరలకు రెక్కలు
రేట్లు పెంచకతప్పదంటున్న ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు
శ్లాబుల కుదింపు తర్వాత ఇప్పటికే 35 శాతం పెరిగిన ధరలు
సామాన్యులపై ఆర్థిక పిడుగు
కుడిచేత్తో ఇచ్చి… ఎడమచేత్తో లాక్కుంటున్న కేంద్రం

ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి

కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాక్కోవడం ప్రధాని నరేంద్రమోడీకి వెన్నతోపెట్టిన విద్య! వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్ని కుదించి, ప్రజలకు అవసరమైన వస్తువుల ధరలు గణనీయంగా తగ్గించేశామని ప్రచారం చేసుకున్నారు. ఈ మేరకు అనేక ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎమ్‌సీజీ) సంస్థలు ప్రధాని నరేంద్రమోడీ పెద్దసైజు ఫోటోలు పత్రికల్లో ప్రచురించి, తమ ఉత్పత్తుల రేట్లు తగ్గిస్తున్నామని అర్భాటంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. 2025 సెప్టెంబర్‌ 22 నుంచి సవరించిన జీఎస్టీ శ్లాబులు అమల్లోకి వచ్చాయి. నవంబర్‌ వరకు కొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. వాటిని చూపే ఎఫ్‌ఎమ్‌సీజీలు ప్రధాని మోడీకి ప్రచారాన్ని కల్పించాయి. కానీ డిసెంబర్‌ నుంచి సీన్‌ మారింది. క్రమంగా ఒక్కో వస్తువు ధర పెరగడం ప్రారంభమైంది. జీఎస్టీ శ్లాబుల్ని కుదించిన కేంద్ర ప్రభుత్వం డాలర్‌తో రూపాయి మారకాన్ని బలపర్చలేకపోయింది. ఫలితంగా రూపాయి విలువ రోజురోజుకూ పతనం అయ్యి, ప్రస్తుతం ఒక డాలర్‌తో రూపాయి మారకం రూ.93కి పడిపోయింది.

ఫలితంగా దిగుమతి వస్తువులతో పాటు, స్వదేశంలో ముడిసరుకుల ధరలు పెరిగాయి. దీనితో ఎఫ్‌ఎమ్‌సీజీలు తమ ఉత్పత్తుల ధరల్ని ఇప్పటికే గణనీయంగా పెంచేశాయి. మరోసారి 5 నుంచి 10 శాతం వరకు పెంచుతామని ప్రకటించాయి. మరి ప్రధాని మోడీ చేసిన జీఎస్టీ శ్లాబుల కుదింపు ప్రయోజనాలు సామాన్యులకు చేరినట్టా… లేదా…అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రధాని మోడీ జీఎస్టీ శ్లాబుల్ని కుదించి, రూపాయి పతనాన్ని నిలువరించలేకపోవడంతో మళ్లీ సామాన్యులపై ధరల భారం తప్పట్లేదు. విచిత్రంగా గత జీఎస్టీ శ్లాబులకంటే, ఇప్పుడు ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. జీఎస్టీ శ్లాబుల కుదింపునకు ముందు, ప్రస్తుత మార్కెట్‌ ధరలు, ఎఫ్‌ఎమ్‌సీజీలు పెంచాలని భావిస్తున్న ధరలతో పోలిస్తే వినియోగదారులపై అతి భారీగా ఆర్థికభారం పడబోతోంది.

ఎఫ్‌ఎమ్‌సీజీల వాదన
నిత్యావసర వస్తువుల ధరల పెంపు తప్పదని ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు స్పష్టంచేస్తున్నాయి. ఆ మేరకు ఇప్పటికే దేశవ్యాప్తంగా నిత్యావసర వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎమ్‌సీజీ) ధరల పెంపుపై ప్రధాన కంపెనీలు, పరిశ్రమలు సంకేతాలు ఇచ్చాయి. కనీసం 5 నుంచి 10 శాతం వస్తువుల ధరల్ని పెంచుతామని చెప్తున్నాయి. ముడి సరుకు ధరల పెరుగుదల, రవాణా వ్యయాల భారంతో పాటు రూపాయి మారకం విలువలో మార్పులు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నాయి.

ఇవీ కారణాలు
ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు ధరలు పెంచేందుకు పలు కారణాలను చూపుతున్నాయి. ప్రధానంగా పామ్‌ఆయిల్‌, ప్యాకేజింగ్‌ ప్లాస్టిక్‌, పేపర్‌, గోధుమలు, చక్కెర వంటి ముడి సరుకుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎడిబుల్‌ ఆయిల్స్‌ (వంటనూనెలు), పాలు, ధాన్యాల ధరల మార్పు కంపెనీలపై ఒత్తిడిని పెంచిందని చెప్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ సహా అన్నింటి ధరలు పెరిగాయి. ఫలితంగా రవాణా చార్జీలు పెరిగాయి. గ్రామీణ మార్కెట్లకు సరకు సరఫరా ఖర్చు పెరిగింది. ప్లాస్టిక్‌, కార్టన్‌, అల్యూమినియం ఫాయిల్‌ ధరలు పెరగడంతో ప్యాకేజింగ్‌ వ్యయం 8 నుంచి 12 శాతం వరకు పెరిగిందని గణాంకాలు చెప్తున్నాయి.

ప్రధానంగా దిగుమతి ముడి సరుకులపై ఆధారపడే కంపెనీలకు డాలర్‌ పెరగడం వల్ల అదనపు ఖర్చు పెరిగింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల దేశంలోకి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఆ స్థాయిలో ఎగుమతులు లేకపోవడం గమనార్హం. సహజంగా దిగుమతులు రూపాయిల్లో ఉంటే, చెల్లింపులు డాలర్లలో చేయాలి. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు రూ.93 గా ఉంది. అలాగే కార్మికుల వేతనాలు, గిడ్డం గి నిర్వహణ వ్యయాలు కూడా పెరిగాయని ఎమ్‌ఎమ్‌సీజీలు చెప్తున్నాయి. దీన్ని నియంత్రించకుంటే సామాన్యుల బడ్జెట్‌ చితికిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.

పెరిగేది ఇలా..
పరిశ్రమ అంచనాల ప్రకారం సబ్బులు, షాంపూల ధరలు 5 నుంచి 8 శాతం పెరుగుతాయి. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, బిస్కెట్లు 6 నుంచి 10 శాతం, వంటనూనెలు, మసాలా ఉత్పత్తులు 8 నుంచి 15 శాతం, డిటర్జెంట్లు, క్లీనింగ్‌ ఉత్పత్తులు 4 నుంచి 7 శాతం చొప్పున పెరుగుతాయని మార్కెట్‌ విశ్లేషకులు చెప్తున్నారు. జీఎస్టీ శ్లాబుల కుదింపునకు ముందు, ప్రస్తుత ధరలు, పెరిగే ధరలతో పోలిస్తే అనేక వస్తువుల ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -