నెరవేరని కేంద్రం హామీలు
సరిహద్దు ప్రాంతంపై పాలకుల చిన్నచూపు
ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు
న్యూఢిల్లీ : అది హిమాలయాలలోని ఓ ఎత్తయిన ప్రదేశం. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన అద్భుత ప్రాంతం. అదే లడఖ్. అయితే ఇప్పుడు ఆ ప్రదేశం ప్రాణాంతకమైన హింస కారణంగా ప్రశాంతతను కోల్పోయింది. స్వయం ప్రతిపత్తి కోసం గత వారం చెలరేగిన నిరసనలు ప్రజలు, పోలీసులకు మధ్య ఘర్షణలకు దారితీశాయి. నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా 80 మంది గాయపడ్డారు. నిరసనలకు నేతృత్వం వహించిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో నిర్బంధించారు. ఆందోళనలు ఉధృత రూపు దాల్చడంతో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సుందరమైన రాజధాని లెహ్ లో కర్ఫ్యూ విధించడంతో అక్కడ భద్రతా దళాల పద ఘట్టనలు మాత్రమే వినిపిస్తున్నాయి. పారా మిలిటరీ దళాలను మోహరించారు. అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
అసంతృప్తికి హింస తోడైతే…
లడఖ్ ప్రజల్లో అసంతృప్తి చెలరేగడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు దానికి హింస కూడా తోడైంది. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్…మధ్యలో ఉన్నదే లడఖ్. ఇది బౌద్ధ చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ప్రదేశం. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని విభజించింది. ప్రత్యక్ష పాలన విధించింది. అప్పటి వరకూ అది కాశ్మీర్‌లోనే అంతర్భాగంగా ఉండేది. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఉద్యోగ కోటా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు 2021 నుంచి శాంతియుతంగా ఆందోళన సాగిస్తున్నారు. తమ ప్రత్యేక గుర్తింపును, సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ చర్యలు అవసరమన్నది వారి వాదన. ఏదేమైనప్పటికీ లడఖ్ హింసపై ప్రస్తుతం మేజిస్ట్రేట్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. పలు ఆంక్షలను అధికారులు ఎత్తివేసినప్పటికీ భయం, అపనమ్మకం ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.
సైన్యాన్ని సమర్థిస్తుంటే అపవాదులా?
‘లడఖ్ అత్యంత సున్నితమైన ప్రాంతం. కయ్యానికి కాలు దువ్వే చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని స్థిరంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం’ అని గతంలో సైనిక దళంలో నార్తర్న్ కమాండ్‌కు నేతృత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ దీపేంద్ర సింగ్ హూడా అభిప్రాయపడ్డారు. 2020లో చైనా, భారత్ మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణకు లడఖ్ వేదికగా నిలిచింది. అలాగే భారత్, పాక్ మధ్య 1999లో జరిగిన చిన్నపాటి యుద్ధంలో లడఖ్‌కు చెందిన కార్గిల్ ఓ భాగం. లడఖ్ ప్రజలు సైన్యాన్ని సమర్ధిస్తుంటే వారిని జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని హూడా వాపోయారు. లడఖ్ జనాభా మూడు లక్షలు. వీరిలో బౌద్ధులు, ముస్లింలు సమాన సంఖ్యలో ఉంటారు. లెహ్ ప్రాంతంలో బౌద్ధులు…ప్రధానంగా గిరిజనుల ప్రభావం ఎక్కువగా ఉండగా కార్గిల్‌లో ముస్లింలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. బౌద్ధ సమాజం తన ప్రజల కోసం ప్రత్యేక ప్రాంతాన్ని డిమాండ్ చేస్తోంది. కార్గిల్‌లో ఉంటున్న వారు తమను కాశ్మీర్‌లో కలపాలని కోరుతున్నారు. కాశ్మీర్‌లో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది.
చేతులు కలిపిన లేెహ్, లడఖ్ వాసులు
‘మేము మోసపోయాం. మా భూమి, ఉద్యోగాలు, సాంస్కృతిక గుర్తింపును కాపాడతామని హామీ ఇచ్చారు. కానీ అది అబద్ధం’ అని నిరసనలకు నాయకత్వం వహిస్తున్న లడఖ్ బౌద్ధ సంఘం (ఏల్‌బీఐ) మండిపడుతోంది. ఆగ్రహం పెల్లుబుకడంతో ఇప్పుడు లేెహ్, లడఖ్ ప్రజలు చేతులు కలిపారు. తమ ప్రాంతానికి పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. లడఖ్‌ను ఆరో షెడ్యూల్ అని పిలిచే జాబితాలో చేర్చాలని కూడా వారు కోరుతున్నారు. ఇది రాజ్యాంగం ప్రకారం భూమికి రక్షణ, గిరిజన ప్రాంతాలకు నామమాత్రపు స్వయం ప్రతిపత్తికి హామీ ఇస్తుంది. అలాగే లెహ్, కార్గిల్ జిల్లాలకు ఒక్కో పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తుంది. డిమాండ్ల సాధన కోసం లడఖ్‌లోని న్యాయవాద బృందాల సమాఖ్య అనేక సంవత్సరాలుగా కేంద్ర హోం శాఖతో చర్చలు జరుపుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అక్కడ నిరుద్యోగం బాగా పెరిగింది. దీంతో యువతలో నిరాశా నిస్పృహలు పెల్లుబుకాయి. ఈ నేపథ్యంలోనే వాంగ్‌చుక్, ఇతరులు గత నెలలో నిరసన ప్రారంభించారు.
ఏం జరిగింది?
2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు లడఖ్ వాసులు చాలా సంతోషించారు. ఆ నిర్ణయం తమ సంస్కృతిలో మరింత స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుందని, మారమూలన ఉన్న ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని వారు ఆశించారు. కానీ కాలం గడిచేకొద్దీ వారి ఆశలు నీరుకారుతున్నాయి. తాము ఆశించిన ప్రయోజనాలేవీ దక్కలేదని వారు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదాను కోల్పోవడంతో 1990వ దశకంలో ఏర్పడిన హిల్ కౌన్సిల్స్ స్వయం ప్రతిపత్తి క్షిణించడం మొదలైంది. రాజకీయాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించేందుకు ఈ హిల్ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో స్థానికేతరులు ఈ ప్రాంతంలో భూమి, ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశం లభించింది. దీంతో ఒకప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారు సైతం ఇప్పుడు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు అప్పగిస్తోందని, దీనివల్ల వారి ప్రాబల్యం పెరుగుతుందని ఆరోపిస్తున్నారు.
చర్చలకు దూరం
వాంగ్‌చుక్ అరెస్ట్ తర్వాత ఆ ప్రాంతానికి చెందిన ప్రధాన పౌర సమాజ సంఘాలు ప్రభుత్వంతో చర్చల నుంచి వైదొలిగాయి. లడఖ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చూస్తుంటే అక్కడ ఇప్పట్లో శాంతి నెలకొనేలా లేదు. గత వారం నుంచి వందలాది మంది సైనికులు లేెహ్ లోని ప్రధాన ఉద్యాన వనాలలో ఒకటైన నిరసన ప్రదేశాన్ని పహారా కాస్తున్నారు. ఆందోళనలను ప్రారంభించాలని నిరసనకారులు అనుకుంటున్నప్పటికీ అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. ఎందుకంటే పోలీసు చర్యలకు భయపడి వారిలో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.