33కోట్ల మంది కూలీలపై ప్రభావం
ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి..లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, వెంకట్రాములు
గాంధీ విగ్రహం ఎదుట ప్రజా సంఘాల ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా మోడీ అసలు రూపం బయటపడిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ విమర్శించారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ముందున్న గాంధీ విగ్రహం ఎదుట మహాత్మాగాంధీ వర్థంతి నేపథ్యంలో చేపట్టిన ‘నరేగా బచావో’ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్,
బి పద్మ, డీబీఎఫ్ నాయకులు పులి కల్పన, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, వృత్తి సంఘాల సమన్వయ కమిటీ నాయకులు పి ఆశయ్య, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు హర్ష, ఆర్ ఆంజనేయులు తదితరులు మాట్లాడారు.
జి నాగయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగినప్పుడే అసలైన అభివృద్ధి అనే మహాత్మా గాంధీ కలను సాకారం చేయాలనే సంకల్పంతోనే ప్రజల ఆకాంక్ష మేరకు ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే మొదటిదశలో ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో నాలుగు శాతం నిధులు కేటాయించారనీ, దానితో కొంత మేర గ్రామీణ పేదలకు మేలు జరిగిందని వివరించారు. మోడీ అధికార పగ్గాలు చేపట్టాక ఉపాధి హామీపై కక్ష కట్టారని విమర్శించారు. చట్టాన్ని బలహీన పర్చేందుకు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి, పలు రకాలుగా కూలీలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చటం వల్ల కూలీలకు ఒరిగే ప్రయోజనం ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు.
మరోవైపు ఈ చట్టానికి కేంద్ర బడ్జెట్‌లో క్రమంగా నిధులను తగ్గిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో 1.37 శాతానికి కుదించారని విమర్శించారు. మెటీరియల్‌కు 10 శాతానికి మించి ఖర్చు చేయకూడదని చట్టంలో ఉన్నప్పటికీ, దానిని అతిక్రమించి 40 శాతానికి పెంచి కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉపాధి హామీని మార్చారని గుర్తు చేశారు. చట్టానికి ఆధార్ ప్రామాణికమే కాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, ఆధార్‌కు అనుసంధానం చేసి కోటికిపైగా జాబ్ కార్డులు, ఏడు కోట్ల మంది లబ్దిదారులకు ఉపాధి హామీని రద్దు చేశారనీ, మోడీ ప్రభుత్వానికి కూలీలంటే ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే ఉపాధి కూలీలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరిరచే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. మహాత్మా గాంధీపై గౌరవం ఉంటే ఉపాధి హామీ చట్టానికి రూ.2.50 లక్షల కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ వామపక్షాల ఒత్తిడితో వచ్చిన నరేగాను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలనీ, కొత్తగా తీసుకువచ్చిన వీబీ జీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా 33 కోట్ల మంది కూలీల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద నిర్వహించే చలో హైదరాబాద్‌కు కూలీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ రైతుల పోరాట స్ఫూర్తితో కూలీల పోరాటం తప్పదని హెచ్చరించారు.



