Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ఉపాధి' నిర్వీర్యానికి మోడీ కుట్ర

‘ఉపాధి’ నిర్వీర్యానికి మోడీ కుట్ర

- Advertisement -

రైతుల మాదిరి వీబీజీఆర్‌ఏఎం-జీపై కూలీలు ఉద్యమించాలి
కూలీలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది : ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ‘ఉపాధి’ కూలీలతో ముఖాముఖి
సీఎంతో వీడియో కాల్‌
నవతెలంగాణ – బల్మూరు/ అచ్చంపేట

దేశంలో పేదల జీవనం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తే.. మోడీ ప్రభుత్వం వచ్చాక క్రమంగా నిధుల కేటాయింపు తగ్గిస్తూ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చిందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అన్నారు. పని చేసుకునే హక్కు చట్టాన్ని రద్దు చేస్తే కూలీలంతా ఏకమై ఐక్యతతో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టం బచావో.. వీబీజీఆర్‌ఏఎం-జీ హఠావో.. కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, బల్మూరు మండలాల్లో పర్యటించారు. అచ్చంపేటలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళుర్పించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కొద్దిసేపు మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట మండలం బుడ్డతండా, బల్మూరు మండలంలోని చెంచుగూడెం గ్రామాల్లో కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. కూలీలతో కలిసి పనిప్రదేశంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు, మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల అభివృద్ధికి చేపట్టిన ఉపాధి హామీ చట్టాన్ని 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం నీరు గారుస్తూ వచ్చిందని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి వీబీజీఆర్‌ఏఎం-జీగా కొత్త పథకం తీసుకొచ్చి.. పేదలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఉపాధి హామీకి పూర్తిగా కేంద్రం నుంచి నిధుల కేటాయింపు జరగాల్సి ఉండగా.. ఈ కొత్త పథకంలో 60శాతం కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రాలు భరించాలని చెప్పడం పథకాన్ని నీరుగార్చడమేనని చెప్పారు. గతంలోలాగే నిధుల కేటాయింపు ఉండాలని, పని దినాలను పెంచి కూలీలకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని కూలీలు అందరూ వ్యతిరేకిస్తున్నారని, వారి పోరాటానికి తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పారు. దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రాష్ట్రంలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కేంద్రం దిగొచ్చిందని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు కూడా నిరవధికంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, అసంతృప్తి విషయంపై నాయకుల సూచనలపై ఆమె స్పందించి మాట్లాడారు.

‘ఉపాధి’ పని ప్రదేశంలో..
అచ్చంపేట మండలం బుడ్డతండాలో ప్రధాన రహదారిపై పనులు చేస్తున్న కూలీలతో మీనాక్షి నటరాజన్‌ మాట్లాడారు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? రోజు కూలి ఎంత వస్తుంది.. అని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వీడియో కాల్‌ చేసి మాట్లాడించారు. కూలీలతో స్వయంగా ముఖ్యమంత్రి వీడియో కాల్‌లో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్‌కు గిరిజనులు డప్పులు, నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణతోపాటు ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రజిత మల్లేష్‌, కాంగ్రెస్‌ పార్టీ బల్మూరు మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, చెంచుగూడెం సర్పంచ్‌ అంజమ్మ, బుడ్డతండా సర్పంచ్‌ రామావత్‌ పార్వతి, నాయకులు కాశన్న యాదవ్‌, కృష్ణారెడ్డి, మూడవత్‌ శ్రీనునాయక్‌, రెండుగ్రామాల ఉపాధి హామీ చట్టం కూలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -