Tuesday, September 23, 2025
E-PAPER
Homeజాతీయంమధ్యతరగతి పైనే మోడీ ఆశలు

మధ్యతరగతి పైనే మోడీ ఆశలు

- Advertisement -

ఐటీ రాయితీలు, జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ ద్వారా వినియోగం పెరుగుతుందని అంచనా
మినహాయింపులు ఇచ్చినా ఆదుకోని కార్పొరేట్‌ సంస్థలు

న్యూఢిల్లీ : ఆదాయపన్ను మినహాయింపులు, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వంటి చర్యల కారణంగా దేశంలోని మధ్య తరగతి ప్రజల జేబుల్లో డబ్బు గలగల లాడుతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆశిస్తోంది. అంతేకాక ప్రజల వినియోగం పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెబుతోంది. నిన్న మొన్నటి వరకూ కార్పొరేట్‌ సంస్థలకు భారీగా రాయితీలు ఇచ్చినప్ప టికీ ఆశించిన ప్రయోజనం చేకూరకపో వడంతో ఇప్పుడు మధ్య తరగతి ప్రజలపై ఆశలు పెట్టుకుంది.

పేదలు, మధ్య తరగతికి ప్రయోజనం?
జీఎస్టీ రేట్లను సవరించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కొత్త పన్ను రేట్లు అమలులోకి వచ్చే సోమవారం ‘జీఎస్టీ బచత్‌ ఉత్సవ్‌’ ప్రారంభం అవుతుందని చెప్పారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపన్ను మినహాయిం పులకు వస్తు సేవల పన్ను రేటు హేతుబద్ధీకరణ కొనసాగింపు అని వ్యాఖ్యానిం చారు. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ రెండు చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం చెబుతోంది. ఆదాయపన్ను మినహాయింపులు, జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ…ఈ రెండు చర్యల ద్వారా దేశ ప్రజలు ఒక సంవత్సరంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఆదా చేస్తారని మోడీ చెప్పారు.

పెరుగుతున్న నయా మధ్య తరగతి ప్రజానీకం
తయారీ రంగం బలోపేతం అయితే ప్రజల వినియోగం పెరుగుతుంది. దేశంలో వస్తు సేవలపై డబ్బు ఖర్చు చేసే వారు కేవలం 14 లక్షల మంది మాత్రమే. అంటే జనాభాలో పది శాతం. దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు… .వీరంతా ఈ పొదుపు ఉత్సవంతో ప్రయోజనం పొందుతారని ప్రధాని చెబుతున్నారు. పేదరికం నుంచి బయటపడినా ఇంకా మధ్య తరగతి హోదా లభించని నయా మధ్య తరగతి ప్రజానీకం సంఖ్య పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఎంతో కీలకం. గత కొన్ని సంవత్సరాలలో దేశంలో పాతిక కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుంచి బయటపడ్డారని, వారిలో అధిక భాగం ఇప్పుడు నయా మధ్య తరగతి ప్రజానీకంగా కీలక పాత్ర పోషిస్తున్నారని మోడీ తెలిపారు. వీరికి సొంత ఆకాంక్షలు, కలలు ఉంటాయని ఆయన అన్నారు. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ ద్వారా మధ్య తరగతి ప్రజలు మరింత సంపాదనాపరులు అవుతారని, ఎక్కువ పొదుపు చేస్తారని ప్రభుత్వం అనుకుంటోంది.

ఇది ప్రధానికి పరీక్షే
ప్రధాని మోడీ 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే ఇందుకోసం 8 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుంది. బడా కార్పొరేట్‌ సంస్థలకు ఆయన ఇచ్చిన రాయితీలు ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తాజాగా ఆయన మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా ఎంచుకున్నారు. వారిపై నమ్మకం పెట్టుకొని వారి చేతిలో చాలినంత డబ్బు ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయ మధ్య తరగతి వినియోగదారులపై మోడీ పెట్టుకున్న విశ్వాసానికి సోమవారం ప్రారంభమైన జీఎస్టీ బచత్‌ మహోత్సవ్‌ పరీక్ష కాబోతోంది.

రూ. 48 వేల కోట్ల ఆదాయానికి గండి
కార్పొరేట్‌ సంస్థల నుంచి సాయం ఏదీ అందకపోవడంతో మోడీ ఇప్పుడు వినియోగదారులపై దృష్టి సారించారు. ‘కార్పొరేట్లకు మినహాయింపులు ఇచ్చి పరోక్షంగా డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అది ఫలించలేదు. దీంతో ఇప్పుడు ప్రజల ద్వారా నేరుగా సొమ్మును చొప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యక్ష పన్నుల వెసులుబాట తర్వాత ఇది పరోక్ష పన్నుల వెసులుబాటు’ అని రాజకీయ వ్యూహకర్త అమితాబ్‌ తివారీ తెలిపారు. డిమాండ్‌ పెరగాలంటే ఆదాయం పెరగాల్సి ఉంటుందని, జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణతో ప్రజల చేతిలో చాలినంత డబ్బు ఉంటుందని, వినియోగం పెరుగుతుందని చెప్పారు. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ కారణంగా సంవత్సరానికి సుమారు రూ.48,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఆదాయంతో ఆ నష్టంలో పది శాతం భర్తీ అవుతుందని తివారీ అన్నారు.

జేబులు నింపుతున్న పన్ను మినహాయింపులు
మోడీ ప్రభుత్వం 2019 సెప్టెంబరులో బేస్‌ కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఈ చర్యతో పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, వినియోగం పెరుగుతుందని భావించింది. కంపెనీలు తాము ఆదా చేసిన సొమ్ముతో సామర్ధ్యాన్ని పెంచుకుంటాయని, ఉద్యోగాలు కల్పిస్తాయని, వేతనాలు పెంచుతాయని ఆశించింది. అయితే కంపెనీలు గత పదిహేను సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించినప్పటికీ ద్రవ్యోల్బణ వృద్ధికి అడ్డుకట్ట వేసేలా వాస్తవ వేతనాలు పెంచలేదు. పన్ను మినహాయింపులతో పొందిన ఆదాయాలతో జేబులు నింపుకున్నాయి. అదే సమయంలో కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన మినహాయింపుల కారణంగా ప్రభుత్వం 2019-20, 2020-21లో ఏకంగా రూ.1.84 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. అంతేకాదు…ప్రైవేటు వ్యక్తుల కంటే కార్పొరేట్‌ సంస్థలు తక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాయి. 2022-23లో వ్యక్తిగత ఆదాయపన్ను కార్పొరేట్‌ పన్నులను దాటేసింది. ఈ ధోరణి ఆ తర్వాతి సంవత్సరం కూడా కొనసాగింది. 2023-24లో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.10.44 లక్షల కోట్లు ఉండగా కార్పొరేట్‌ సంస్థల నుంచి పన్నుల రూపంలో వచ్చింది రూ.9.11 కోట్లు మాత్రమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -