వడ్డించేవాడు మనవాడైతే చివరలో కూర్చున్నా భయపడాల్సిందేమీలేదని ఒక నానుడి. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న పనులు కూడా తమవారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, ఏదో రకమైన లబ్ధి చేకూర్చడంలో పోటీ పడుతున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, ఆయన్ను చంపిన గాడ్సే సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒకేరోజు రావడం యాదృచ్ఛికం కావచ్చు. కానీ ప్రజల్లో అది మరొకసారి ఆలోచనలను రేకెత్తించింది. అనేక చర్చలకు దారితీసింది. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీది దేశ స్వాతంత్య్ర సముపార్జనలో ప్రధాన పాత్ర. అహింస, సత్యాగ్రహాలను ఆయుధాలుగా చేసుకుని తనదైన మార్గంలో కోట్లాదిమందిని స్వాతంత్య్ర ఉద్యమం వైపునకు కదిలించిన ఘనత ఆయనది. అలాంటి మహాత్ముడిని సంకుచితభావంతో స్వరాజ్యం సిద్ధించిన ఐదున్నర నెలలకే ఈ జాతికి దూరం చేసిన చరిత్ర గాడ్సేది. ఆయన వారసులు తమ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న సందర్భం ఇది.
స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఆర్‌ఎస్‌ఎస్ ఇంకా హిందూ మహాసభలు చాలా విద్రోహపూరితంగా ప్రవర్తించినట్లు చరిత్రకారుల వాదన. రెండు విఫల ప్రయత్నాల తర్వాత మహాత్ముడిని మట్టుపెట్టిన గాడ్సే ఆయన సంస్థ ప్రవచించే శాంతికాముకుడు ఎలా అవుతాడు? ఇంకా ఆర్‌ఎస్‌ఎస్ హిందూ మహాసభతో బలమైన సంబంధాలు ఉన్న వీర సావర్కర్ తాను జైల్లో ఉండగా బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక క్షమాభిక్ష ఉత్తరాలు రాసి విడుదలైనట్లుగా చదువుతున్నాం. తర్వాత మహాత్ముడు ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపును గాంధీని చంపిన గాడ్సేతో పాటుగా సావర్కర్ కూడా సహ కుట్రదారుడుగా ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ అవి నిరూపించ బడలేదు. అవకాశవాదంతో బ్రిటిష్ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో బయటపడ్డ వారు దేశభక్తులుగా చలామణి కావడం విడ్డూరం. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అమలు చేసిన రోజుల్లో కూడా నాటి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత బాలా సాహెబ్ దేవరస్ తన లేఖలో తమ లక్షలాది కార్యకర్తలు జాతి పురోభివృద్ధిలో ఆమెకు సహకరిస్తారని, ప్రభుత్వా నికి అండదండగా ఉంటారని వారిని విడుదల చేయవలసిందిగా అభ్యర్థించాడు. నాటికి అమలు లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేయమని, ప్రధానమంత్రి నాయకత్వంలోనే తామంతా దేశ పురోగతికి పనిచేయ డానికి సిద్ధమంటూ రాయడం కేవలం ఆర్‌ఎస్‌ఎస్ రాజీ, లొంగుబాటు వైఖరులను స్పష్టం చేస్తున్నది.
అటల్ బిహారీ వాజపేయి కూడా ఎమర్జెన్సీ అమలులో ఉన్న 21 నెలల్లో 20 నెలలు పెరోల్ పైనే ఉన్నట్లు మనందరికీ తెలిసిందే. మరొక ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు మధుకర్ దత్తాత్రేయ దేవరస్ కూడా ఇందిరాగాంధీ, సంజరు గాంధీతో అంటకాగాడు. ఇన్ని దృష్టాంతాలు కేవలం ఆర్‌ఎస్‌ఎస్ అవకాశవాదాన్ని ప్రస్ఫుటంగా తెలుపుతున్నాయి. ఇందులో ఎక్కడ వారు ప్రవచించే హిందుత్వం లేకపోవడం గమనార్హం. 1925 సెప్టెంబర్ 27న విజయదశమి నాడే ఈ రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఫ్‌ు ఆవిర్భవించింది. స్వాతంత్రానికి ముందు ఒకసారి, తరువాత మూడుసార్లు ఈ సంస్థ నిషేధించబడింది. బీజేపీ ప్రజలను వంచించే పథకంలో భాగంగా గాంధీని, పటేల్‌ను అక్కున చేర్చుకుంటూ నెహ్రూ కుటుంబాలను అప్రతిష్టపాలు చేయడం మొదలు పెట్టింది. నెహ్రూ (నేటి గాంధీలు) కుటుంబాలపై తరచుగా విరుచుకుపడుతున్నది. ఒక దశలో ‘గాంధీ’ సినిమా వల్లనే మహాత్ముడికి గొప్ప గుర్తింపు వచ్చినట్లు మాట్లాడి మోడీ విమర్శల పాలయ్యాడు. హిందూ రాజ్య స్థాపన పేరుతో దేశంలో మతవ్యాప్తి చేస్తూ లౌకిక రాజ్యంగా గర్వంగా చెప్పుకుంటున్న దేశాన్ని హిందూ దేశంగా మార్చే దిశగా ఆర్‌ఎస్‌ఎస్ తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. బీజేపీ సిద్ధాంతాలను, అధ్యక్షులను, పార్టీ వ్యవహారాలను నియంత్రించేది ఇంకా ప్రభుత్వ విధివిధానాలను నిర్ణయించేది ఆర్‌ఎస్‌ఎస్.
గాంధీని చంపిన గాడ్సే వారసులు నేడు ఆ గాంధీనే తలకెత్తుకోవడం అవకాశవాదమే. సంఫ్‌ు కార్యకలా పాలు బీజేపీకి నచ్చవచ్చు, నచ్చవలసిందే. లేకపోతే ఆ పార్టీకి మనుగడ దుర్లభం. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ తానులోని ముక్క, దాని సిద్ధాంతాల ప్రచారకర్తగా, అమలుపరిచే వ్యక్తిగా, ఆసంఘ సభ్యుడైన ప్రధాన మంత్రి మోడీ సంఫ్‌ు చేసే పనులను సాగించడంలో ఆశ్చర్యం లేదు. జాతి నిర్మాణంలో వారి పాత్రను ఎంతపొగుడుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్‌ను, వంద రూపాయల నాణెం విడుదల చేయడం విమర్శలకు తావు ఇచ్చినట్లయింది. సంస్థ ఏమి ప్రభుత్వ సంస్థ కాదు నాణెం, స్టాంపు దాని గౌరవ సూచకంగా విడుదల చేయడానికి. ఆ సంస్థ చారిత్రక ఘనకార్యాలు ఏమీ సాధించిన దాఖలాలు లేవు.ఇది కేవలం తన మాతృ సంస్థకు మోడీ తీర్చుకున్న రుణం అనిపిస్తుంది. అంటే దాని సిద్ధాంతమైన హిందూ మత రాజ్య స్థాపనకు సమ్మతం తెలిపి దానికి ఒక కీర్తి, గౌరవం కలిగించడమే మోడీజీ అభిమతం లాగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ కూడా తన వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి స్మరణగా 1985లో నాటి ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి స్మరణగా ఇంకా కొంతమంది జాతి నేతల సేవలకు గుర్తుగా కూడా పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం జరిగింది. అయితే 2015లో మోడీ ప్రభుత్వం ఒకే కుటుంబానికి ఇన్ని గౌరవాలు అవసరం లేదంటూ ఇందిరా, రాజీవ్ గాంధీల స్టాంపులను నిలిపేసింది. అదే నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ జనసంఫ్‌ు నేతలైన శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయులతో పాటుగా జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, వల్లభారు పటేల్ వంటి వారి సేవలకు గుర్తుగా స్టాంపులు విడుదల చేసింది. ఎవరు జాతి నిర్మాతలు జాతి నిర్మాణంలో వారి పాత్ర ఎంత అనేది ఒక పెద్ద చర్చనీయాంశమే. కానీ ఈ విధంగా ప్రభుత్వాలు తమకు నచ్చిన వారి పేరు మీద స్టాంపులు, నాణేలు తయారు చేయడం విడుదల చేయడం అధికార దుర్వినియోగం కాదా అనేది సామాన్యుడి ప్రశ్న. 2001లో మార్క్సిస్టు పార్టీ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాద్ సేవలకు గుర్తుగా నాటి ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా జ్యోతిబసుపై స్టాంప్ విడుదల చేయమన్న డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం పెడచెవిని పెట్టింది.
గతంలో కూడా బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజపేయి, రాజమాత విజయ రాజ సిందియా, శ్యాంప్రసాద్ ముఖర్జీలకు గౌరవంగా కరెన్సీ నాణేలను విడుదల చేయడం చేసింది. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ పై కూడా విడుదల చేయడం రాజ్యాంగానికి వక్రభాష్యం చెప్పడమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది జాతీయ నాయకులకు గౌరవ చిహ్నంగా నాణాలను విడుదల చేయడం అందుకు కొనసాగింపుగా బీజేపీ తమ సిద్ధాంతకర్తల, ఆలోచనపరుల సేవలకు గుర్తుగా గౌరవంగా ఈ స్టాంపులను నాణేలను విడుదల చేస్తున్నది. స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధంలేని, నాటి ఉద్యమాలతో పోరాటాలతో సంబంధం లేని, వాటిలో పాల్గొనని వ్యక్తుల (నేతల) పేరున ఈ రకంగా స్టాంపులు, నాణేలు విడుదల చేయడం ఎటు దారితీస్తుంది? దీనికంటూ ఒక కమిటీ విధివిధానాలు ఉండవా? ఇంకా గౌరవం పొందవలసిన జాతీయ స్థాయి నేతలు అనేకమంది ఉన్నారు. బహుశా వారి పార్టీలు అధికారంలోకి రాకపోవడమో, లేకపోవడమో కారణం కావచ్చు. కానీ ఈ దుష్ట సంప్రదాయానికి ఎవరో ఒకరు తెరదించాలని కోరుకుందాం.
శ్రీ శ్రీ కుమార్
9440354092
మతవాదానికి మోడీ ‘అధికారిక’ స్టాంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES