– ట్రంప్ చెబితే కాల్పులు విరమించడం దురదృష్టకరం
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డివి చవకబారు విమర్శలు
– ఇందిరా, రాజీవ్‌లు దేశ ఐక్యతకు పాటుపడ్డారు : రాజీవ్‌గాంధీ వర్థంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని విఫలమయారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసే పరిస్థితికి భారత ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయింది. ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా ఎదుర్కోలేని ప్రభుత్వం దేశాన్నీ, దేశ ప్రజలను ఎలా రక్షిస్తుంది. – సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పహల్గాం మారణకాండ తర్వాత పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో కేంద్రంలోని మోడీ వెనకడుగు వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 34వ వర్థంతిని పురస్కరించుకుని హైదరాబా ద్‌లోని సచివాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సీఎం పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ పౌరులపై తీవ్రవాదులు దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. మా దేశాన్ని మేం రక్షించుకో గలుగుతాం.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదనే రీతిలో ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం పహల్గాం ఘటనలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని విఫలమయ్యారని విమర్శించారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ చెబితేనే కాల్పుల విరమణ చేసే పరిస్థితికి భారత ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా ఎదుర్కోలేని ప్రభుత్వం దేశాన్నీ, దేశ ప్రజలను ఎలా రక్షిస్తుందని ప్రశ్నించారు. ఈ వాస్తవాలను మరిచిన కొంతమంది చేవలేని వ్యక్తులు నేడు రాజీవ్‌గాంధీని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రానికి అండగా నిలబడాల్సిన సమయంలో బయటకు రాని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్‌గాంధీ అని సీఎం కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో ఆయన భారత్‌ను బలమైన దేశంగా నిలబెట్టారని గుర్తు చేశారు. 18 ఏండ్లకే ఓటు హక్కును కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించారని అన్నారు. ”సెక్రెటేరియట్ దగ్గర రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు సంకుచిత మనస్తత్వంతో విమర్శలు చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీది. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతాం. అది మా బాధ్యత. దేశ సమగ్రత విషయంలో మేం రాజకీయాలు చేయం. దేశ భద్రతకు కట్టుబడి పనిచేస్తాం” అని సీఎం స్పష్టం చేశారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ మేయర్, తదితరులు ఉన్నారు.
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో మోడీ వెనకడుగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES