Monday, July 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్రానికి మోడీ మొండిచేయి

రాష్ట్రానికి మోడీ మొండిచేయి

- Advertisement -

సీఎం వినతులన్నీ బుట్టదాఖలు
బీజేపీకి 8 మంది ఎంపీలు…రాష్ట్రానికి ఒరిగిందేం లేదు
నిధుల్లేవు…ప్రాజెక్టులు లేవు – సమాఖ్య స్ఫూర్తి డొల్లే!
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మూడుసార్లు దేశానికి మోడీ ప్రధాని అయినా, రాష్ట్రం నుంచి ఆపార్టీకి 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా తెలంగాణకు ఒరిగిందేం లేదు. కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి వచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న సొమ్ముకు, కేంద్రం తిరిగి రాష్ట్రానికి చెల్లిస్తున్న సొమ్ముకు మధ్య పొంతనే లేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్ను రూపంలో రూపాయి వెళ్తే, తిరిగి వస్తున్నది 42 పైసలే అని అనేక వేదికలపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖరరావు కూడా ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ఏటా బడ్జెట్‌ కేటాయింపుల సందర్భంగా మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పక్కన పెడుతున్న విషయం తెలిసిందే.

నిధుల కేటాయింపు నుంచి వివిధ ప్రాజెక్టుల అనుమతి వరకు అన్నీ పెండింగే. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పలుమార్లు ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులను కలిసి సహాయం కోసం అభ్యర్థించినా ఫలితం శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వ్యూహాత్మకంగానే కేంద్రంలోని మోడీ సర్కార్‌ అడ్డంకులు సృష్టిస్తోంది. నిధుల్లేక పథకాలు నీరసించి, ప్రజల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్‌ అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయొచ్చనే దుర్నీతితో కమలదళం పావులు కదుపుతున్నదనే చర్చ ప్రజల్లో వినిపిస్తుంది.

భారత రాజ్యాంగ నిర్మాతలు పటిష్టంగా ఏర్పాటు చేసిన సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచే చర్యలకు కేంద్రం పాల్పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి 11 ఏండ్లుగా ఇలాగే కొనసాగుతున్నది. రాష్ట్రానికి రావల్సిన అనేక ప్రాజెక్టుల్ని బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్న ఉదాహరణలూ ఉన్నాయి. చట్టబద్దంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా విడుదలలోనూ జాప్యం చేస్తున్నది. కొత్త ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వట్లేదు. ఐటీఐఆర్‌ను కేంద్రం అటకెక్కించింది. మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణంపై రాష్ట్రం చేసిన విజ్ఞప్తులకు స్పందించలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వాలని కోరితే, దాన్నీ పట్టించుకోలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలని కోరితే, కనీసం అక్లిరిటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రామ్‌ (ఏఐబీపీ) స్కీంలోకి కూడా పరిగణలోకి తీసుకోలేదు. సిరిసిల్లకు మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌, వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌కు ఆర్థిక సాయంపై స్పందించ డంలేదు. రాష్ట్రం పట్ల కేంద్రం ఆర్థిక వివక్షకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఎనిమిది మందిని గెలిపిస్తే….
తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకించి చేసిందేం లేదు. వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యారు. వారికి తమ పదవులను కాపాడుకోవడానికే కాలం సరిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకునే తీరిక వారికి లేదు. కేంద్రం చర్యలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇరుకున పెడుతూ ప్రజల్లో అసంతృప్తిని ఎగదోసే చర్యలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది.

కేంద్రానికి రాష్ట్రం చేసిన ముఖ్యమైన వినతులు
– మెట్రో రెండో దశ ప్రాజెక్టు (76.4 కిలోమీటర్ల) విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17,212 కోట్లు కేటాయించాలని కోరినా రూపాయి ఇవ్వలేదు. (రూ.15,611 కోట్లతో చేపట్టిన బెంగళూరు మూడో దశకు 2024లో, రూ. 3,624 కోట్లతో చేపట్టిన పుణె రెండో దశకు…2025 జూన్‌లో అనుమతులు ఇచ్చింది)
– తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరినా స్పందించ లేదు.
– విభజన హామీల్లో బాగంగా ఎన్టీపీసీలో 4,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు అనుమతిస్తామని చెప్పింది. గత ప్రభుత్వం 1,600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి అనుమతించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామని తెలిపినా కేంద్రం సైలెంట్‌గా ఉంటోంది.

ఏపీ పునర్విజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలన్న వినతుల్ని పట్టించుకోవట్లేదు. మూసీ నదీ ప్రక్షాళనకు కేంద్రం రూపాయి
సాయం ప్రకటించలేదు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.4,100 కోట్ల రుణం తీసుకొమ్మని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌) సిఫార్సు చేసి చేతులు దులుపుకుంది.
– రాష్ట్రంలో వంద శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు, సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్‌ మిషన్‌ ద్వారా నిధులు కేటాయించాలని కోరినా ఉలుకు పలుకు లేదు.
హైదరాబాద్‌ శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్‌ అటవీప్రాంతం మీదుగా ఎలివేటేడ్‌ కారిడార్‌ నిర్మాణం ప్రతిపాదనలను అటకెక్కించింది.
– తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి చేసిన విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేసింది.
810 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్‌ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1,350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్‌ ల్యాండ్స్‌ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలనే ప్రతిపాదనపై కాలయాపన చేస్తోంది. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలో ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ (1,038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలని కోరితే స్పందించట్లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -