– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ – భువనగిరి
ప్రధాని మోడీ చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అమెరికా సామ్రాజ్యవాద పెత్తనం దేశం మీద మరింత పెరుగుతున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ జిల్లాస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ల సంస్థలకు రాయితీలను కల్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నీరుగార్చుతూ నిరుద్యోగాన్ని పెంచుతున్నారని విమర్శించారు. రైతాంగాన్ని దివాళా తీస్తూ పరిపాలన సాగిస్తున్నాడన్నారు. అమెరికా భారతదేశం మీద అనేక విధాలుగా సుంకాల పేరుతో పన్నులు పెంచుతున్నా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధిస్తున్నా మోడీ ప్రభుత్వం ఎలాంటి ఖండన ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధానాలను తీసుకొచ్చి వ్యవసాయ కూలీల పొట్టగొట్టాలని చూస్తుందన్నారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి పేదవాడికి విద్యుత్ భారాన్ని మరింత పెంచే విధంగా మోడీ ప్రభుత్వ విధానం ఉందన్నారు. గతంలో నల్ల చట్టాలను తీసుకురావడంతో రైతుల పోరాటంతో వెనక్కు తగ్గారని, ఇప్పుడు రైతాంగానికి మద్దతు ధరను ఇస్తామని చెప్పి నూతనంగా విత్తన చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదే విధంగా కార్మికుల పొట్టకొట్టే లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మికులపై మరింత పని ఒత్తిడిని పెంచాలని చూస్తుందన్నారు. ‘సర్’ పేరుతో బీహార్‌లో ఓట్ల తొలగింపు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇదే పనిని ఇతర రాష్ట్రాల్లోనూ చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. సీబీఐ, ఈడీని తన గుప్పెట్లో ఉంచుకొని రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో కుల దురహంకారానికి బలైపోయిన రెండు నెలల పసికందు కుటుంబానికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయలేదని, దోషులను శిక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తొలగించిన ఇండ్లను వెంటనే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యాదాద్రి భువనగిరి జిల్లాకు నిధులు కేటాయింపు విషయంలో అన్యాయం చేసిందన్నారు. ప్రస్తుతం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య బూరుగు కృష్ణారెడ్డి గుంటోజు శ్రీనివాసాచారి జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మోడీ తప్పుడు విధానాలే అమెరికా సామ్రాజ్యవాదానికి దారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



