మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు. వృద్యాప్య సమస్యలతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు.
శాంతకుమారి సొంత ఊరు ఎలంతూరు కాగా, పెళ్ళి తరువాత భర్తతో కలిసి తిరువనంతపురంలో స్థిరపడ్డారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె కేరళ ప్రభుత్వ న్యాయ కార్యదర్శిగా పని చేశారు. అనారోగ్యానికి గురయ్యాక తల్లిని మోహన్‌లాల్ కొచ్చిలోని తన ఇంటికి తీసుకొచ్చారు. అక్కడే ఉంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
తల్లి మరణం నేపథ్యంలో తాను చిన్నపిల్లాడిగా ఉండగా ఆమెతో కలిసి తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన తల్లి వల్లే తాను ఈస్థాయికి వచ్చినట్లు మోహన్‌లాల్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేదని తెలిపారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సమయంలో మొదట తల్లి సమక్షంలో ఆనందాన్ని పంచుకున్నట్లు మోహన్‌లాల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శాంతకుమారి మృతి పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఏ వయసులో అయినా సరే తల్లి మరణం ఓ వ్యక్తికి తీవ్ర భావోద్వేగానికి గురి చేసేదే. దేశం గర్వించదగ్గ నటుడిని అందించిన శాంతకుమారిని అందరూ కొనియాడుతున్నారు.
మోహన్‌లాల్‌కు మాతృ వియోగం
- Advertisement -
- Advertisement -



