ఎంపిక చేసిన నిపుణుల అసెంబ్లీ
టెహ్రాన్ : ఇరాన్ సుప్రీం నేతగా సయ్యద్ మొజ్తాబా హొస్సేనీ ఖమేనీని (56) నిపుణుల అసెంబ్లీ ఎంపిక చేసింది. అమెరికా, ఇజ్రాయిల్ సేనల దాడిలో మరణించిన అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడే మొజ్తాబా ఖమేనీ. ఇరాన్‌కు ఈయన మూడవ సుప్రీం నేతగా వ్యవహరించబోతున్నారు. ఇరాన్‌లో ప్రభుత్వ, సైనిక వ్యవహారాలలో తుది నిర్ణయం సుప్రీం నేతదే. మొజ్తాబా నియామకాన్ని అనేక పాశ్చాత్య దేశాలు తీవ్రంగా విమర్శించాయి. అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురై వారం రోజులు దాటిన తర్వాత నిపుణుల అసెంబ్లీ సమా వేశమై మొజ్తాబాను సుప్రీం నేతగా ఎన్నుకుంది. 88 మంది సభ్యులతో కూడిన నిపుణుల అసెంబ్లీ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత మొజ్తాబా నియామకాన్ని ధృవీకరించింది. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పవిత్ర వ్యవస్థకు మూడవ నేతగా సయ్యద్ మొజ్తాబా హొస్సేనీ ఖమేనీని నిర్ణయాత్మక ఓటు ద్వారా నిపుణుల అసెంబ్లీ ఎన్నుకుంది’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆధ్యాత్మికం నుంచి రాజకీయం వైపు…
1969లో ఉత్తర ఇరాన్‌లోని ఆధ్యాత్మిక పట్టణమైన మష్‌హాద్‌లో మొజ్తాబా జన్మించారు. 1979 వరకూ ఇరాన్‌ను పరిపాలించిన షా రాజ వంశానికి వ్యతిరేకంగా తన తండ్రి జరిపిన పోరా టాన్ని చూస్తూ ఎదిగారు. మతపరమైన వాతా వరణంలో ఎదుగుతూ వచ్చిన మొజ్తాబా ఇరాన్- ఇరాక్ యుద్ధ సమయంలో పార్లమెంటరీ రివల్యూ షనరీ గార్డ్‌లో విభాగమైన హబీబ్ బిన్ మజాహిర్ బెటాలియన్ కింద పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు అనేక మంది అధికారులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే ఆయన ఎన్నడూ రాజకీయ కార్యాలయంలో పనిచేయలేదు. మత పరమైన విద్యను అభ్యసించి ఓ గురువుగానే కొన సాగారు. 1989లో తండ్రి ఖమేనీ సుప్రీం నేత అయిన తర్వాత మొజ్తాబా ప్రభావం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో ఆయన ఓ విశ్వాసపాత్రు డిగా, రక్షకుడిగా, పవర్ బ్రోకర్‌గా వ్యవహరించారు. అంతేకాక అపారమైన వ్యాపార వ్యవస్థను నిర్మించారు. భద్రతా సంస్థతో లోతైన సంబంధాలు నెరిపారు.
ఎక్కువ కాలం ఉండడు : ట్రంప్
ఇరాన్ సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనప్పటికీ వాషింగ్టన్ అనుమతి లేకుండా అధికారంలో కొనసాగలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం నేతకు తమ అనుమతి అవసరమని స్పష్టం చేశారు. తమ నుంచి అనుమతి లేకుంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేడని చెప్పారు. మొజ్తాబాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఆమోదయోగ్యమైన వ్యక్తి కాదని ట్రంప్ గతంలోనే తెలిపారు. మొజ్తాబా ఎన్నడూ ఎన్నిక కాలేదని, ప్రభుత్వ పదవిలో నియమితుడు కాలేదని ఆరోపిస్తూ 2019లో అమెరికా వాణిజ్య శాఖ ఆయనపై ఆంక్షలు విధించింది.
పశ్చిమ దేశాలకు వ్యూహాత్మక సంకేతం
ఖమేనీ తన హయాంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)కి మద్దతుగా నిలవడంతో అందులో మొజ్తాబా ప్రాబల్యం గణనీయంగా పెరిగింది. ఐఆర్‌జీసీ విభాగాలకు చెందిన కమాండర్లతో ఆయన సన్నిహితంగా పనిచేశారు. అధికారులతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా శుద్ధి చేసిన కీలక యురేనియం నిల్వలను తరచూ పరిశీలిస్తుండే వారు. మహమూద్ అహ్మదీనెజాబ్ రెండోసారి దేశాధ్యక్షుడు కావడానికి ఆయన మద్దతు తెలిపారు. మొజ్తాబాపై 2019లో అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. మొజ్తాబా గతంలో అవలంబించిన కఠిన వైఖరి నేపథ్యంలో ఆయన నియామకాన్ని పశ్చిమ దేశాలకు వ్యూహాత్మక సంకేతంగా చూస్తున్నారు. ఇరాన్ ఆచితూచి అడుగులు వేయాలంటూ వస్తున్న వాదనలను మొజ్తాబా ఎంపిక ద్వారా నిపుణుల అసెంబ్లీ తోసిపుచ్చింది. ఎందుకంటే ఆయన గతంలో అనేక సందర్బాలలో కఠిన వైఖరి అవలంబించారు. అందుకే ఆయన ఎంపికపై పశ్చిమ దేశాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇజ్రాయిల్ అయితే ఓ అడుగు ముందుకు వేసి నిపుణుల అసెంబ్లీ సమావేశానికి ఆటంకం కలిగిస్తానని బెదిరించింది.
ఎంపిక సమయంలో బాంబుల మోత
సుప్రీం నేత ఎన్నిక ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే బాంబు పేలుళ్లలో టెహ్రాన్ నగరం దద్దరిల్లింది. ఇంధన డిపోలు, సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. ఇజ్రాయిల్, అమెరికా సేనలు క్షిపణులను కూడా ప్రయోగించాయి. దీంతో నగరమంతటా దట్టమైన పొగలు అలముకున్నాయి.
మొజ్తాబా హత్యకు ట్రంప్ కుట్ర ?
ఇరాన్ సుప్రీం నేతగా ఎన్నికైన అలీ ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీని కూడా తండ్రిని చంపినట్లుగానే హతమార్చాలని అమెరికా భావిస్తోందా?. జరుగుతున్న పరిణామాలు, అగ్రరాజ్యం అధినేత చేస్తున్న ప్రకటనలను చూస్తుంటే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. తమ అనుమతి లేకుండా మొజ్తాబా ఖమేనీ ఎక్కువ కాలం ఇరాన్ నేతగా కొనసాగలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఏబీసీ న్యూస్‌కు చెప్పారు. ఇరాన్ సుప్రీం నేతగా అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఎంపిక కాబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన ప్రశ్నించగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు. మొజ్తాబా ఎంపికపై విమర్శలు చేసేందుకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నిరాకరించారు. ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్‌కు ఎవరు నేతగా ఎన్నికైనప్పటికీ దాడి చేస్తానని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేత పదవికి మొజ్తాబా ఖమేనీ పేరు తొలుత వినిపించినప్పుడు అలాంటి ప్రయత్నం తనకు అంగీకారయోగ్యం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అధికార ప్రకటన విడుదలైన తర్వాత మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. తమ అంగీకారం లేకుంటే మొజ్తాబా ఎక్కువ కాలం ఇరాన్ సుప్రీం నేతగా కొనసాగలేరని ట్రంప్ గతంలో హెచ్చరించినప్పటికీ నిపుణుల అసెంబ్లీ మాత్రం ఆయననే ఎంపిక చేయడం గమనార్హం. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే మొజ్తాబా నియామకం అమెరి కాకు సుతరామూ ఇష్టం లేదని అర్థమవుతోంది. ఆయనపై 2019లోనే అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. అలీ ఖమేనీ ప్రాంతీయ ఆకాంక్షలు, ఆశయాలను అస్థిరపరచే ప్రయత్నం చేశారని, అణచివేత విధానాలను అవలంబించారని, ఆయన కుమారుడు మొజ్తాబా కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. అలీ ఖమేనీకి అమెరికా పొడ ఏ మాత్రం గిట్టని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీ ఖమేనీని అంతం చేసిన ట్లుగానే మొజ్తాబా ఖమేనీని కూడా హతమార్చడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తూ ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



